అమెరికాలో వలసదారులపై జరుగుతున్న దాడుల్లో భాగంగా ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ దారుణానికి ఒడిగట్టాడు. ఒక మహిళను కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. మిన్నియాపాలిస్‌లో బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో వందలాది మంది ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బుధవారంమిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా నిరసనకారులు ఉద్యమానికి దిగారు. నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పిన క్రమంలో ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, కారులో కూర్చున్న మహిళ తలపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో రెనీ గుడ్ (37) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.
Ice agent shoots woman who tried to flee 😳 pic.twitter.com/fJ1X2XDMhC
— RTN (@RTNToronto) January 7, 2026
ఇమ్మిగ్రేషన్ అమలు సమయంలో అధికారులను అడ్డుకోడంతో కాల్పులు జరిపినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఘర్షణ సమయంలో మహిళపై కాల్పులు జరిగాయని DHS ప్రతినిధి ట్రిసియా మెక్‌లాఫ్లిన్ తెలిపారు. అల్లర్లకు, రెనీ గుడ్‌కు ఎలాంటి సంబంధం లేదని బాధితురాలి తల్లి డోనా గాంగర్ విచారం వ్యక్తం చేసింది. తన కుమార్తె ఎంతో దయగల, గొప్ప మనిషి, ప్రజలంటే ప్రేమగల ఆమెను అన్యాయంగా కాల్చి చంపారని తల్లి వాపోయింది.
అమెరికాలో పెరుగుతున్న గన్ కల్చర్, హింస సర్వసాధారణంగా మారింది అని చెప్పడానికి మరో స్పష్టమైన ఉదాహరణ అని విశ్వవిద్యాలయ అధ్యక్షుడు బ్రియాన్ హెంఫిల్ వ్యాఖ్యానించారు. వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి ఇది నిదర్శనం అంటూ ఆగ్రహం పెల్లుబుకింది. వందలాది మంది నిరసనలకు దిగారు. మిన్నియాపాలిస్ నగర కౌన్సిల్‌లోని మెజారిటీ సభ్యులు రెనీ మరణానికి కారణమైన ఏజెంట్‌ను అరెస్టు చేసి, విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ICE తమ నగరాన్ని విడిచి పెట్టాలంటున్నారు.

అధికారుల భిన్నవాదనలు
ఈ సంఘటనల గురించి ఫెడరల్ , స్థానిక అధికారులు చాలా భిన్నవాదనలు వినిపిస్తున్నారు. కారును ఆపి బయటికి రావాలని ఆదేశాలను బేఖాతరు చేయడంతో పాటు, ఉద్దేశపూర్వకంగా ఏజెంట్‌పై ఎదురుదాడికి దిగి, ICE అధికారిని ఢీకొట్టడానికి ప్రయత్నించినందున మహిళను కాల్చి చంపామని అంటున్నారు. ఈ ఘటనపై FBI దర్యాప్తు జరుగుతోంది
2020లో ఓల్డ్ డొమినియన్ విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషులో పట్టభద్రురాలైంది గుడ్. ఆమె కవయిత్రి కూడా. ప్రస్తుతం రెనీ నికోల్ గుడ్ తన భాగస్వామితో మిన్నియాపాలిస్‌లో నివసిస్తోంది.కాగా ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత వలసదారుల ఆంక్షలు, దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య ఐదుకి చేరింది.
ఇదీ చదవండి: బాలికపై సామూహిక అత్యాచారం : యూట్యూబర్ అరెస్ట్, పరారీలో ఎస్‌ఐ


