లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మరో దారుణ ఘటన కలకలం రేపింది. 14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒక పోలీసు అధికారి ఒక యూట్యూబర్ ఉండటం మరింత ఆందోళన రేపింది.
బాధిత బాలిక పోలీసులకు అందించిన సమాచారం ప్రకారం కాన్పూర్‌లోని సచెండి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 14 ఏళ్ల బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి యూట్యూబర్ శివబరన్ అరెస్ట్ చేశారు. సబ్-ఇన్‌స్పెక్టర్ అమిత్ కుమార్ మౌర్య పరారీలో ఉన్నాడు.

ఏం జరిగిందంటే..
7వ తరగతి చదువు మానేసిన మైనర్ బాలిక సోమవారం రాత్రి సుమారు 10 గంటలకు తన ఇంటి నుండి బయటకు వెళ్ళగా, మహీంద్రా స్కార్పియోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు.అనంతరం సచెండిలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వాహనంలోనే దాదాపు రెండు గంటల పాటు ఆమెపై లైంగిక దాడి జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఇంటి బయట వదిలి వెళ్లారు. బాధితురాలి సోదరుడు అర్ధరాత్రి సమయంలోఆమెను గమనించి 112కు డయల్ చేసి పోలీసులు ఫిర్యాదు చేశాడు. అయితే ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోలేదు.
నిందితులలో ఒకరు పోలీసని చెప్పడంతో తమ ఫిర్యాదును పట్టించుకోలేదని బాలిక సోదరుడు ఆరోపించాడు. ఉన్నతాధికారులను ఆశ్రయించిన తర్వాతే కేసు నమోదు చేశారని, అంతేకాకుండా ఫిర్యాదులో నిందితుల పేర్లను మొదటగా చేర్చలేదని పేర్కొన్నాడు.
బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) దినేష్ త్రిపాఠి తెలిపారు. జర్నలిస్టును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, పోలీసు కానిస్టేబుల్‌ను గుర్తించి విచారణ పూర్తయిన తర్వాత అతడిని కూడా అరెస్టు చేస్తామని డీసీపీ తెలిపారు. కిడ్నాప్, సామూహిక అత్యాచారానికి సంబంధించిన సెక్షన్లతో పాటు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశామని, విచారణ పూర్తి పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు.
పరారీలో ఉన్న SIని పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని మరో పోలీసు అధికారి రఘుబీర్ లాల్ విలేకరులకు తెలిపారు.


