ఎఫ్‌ఎస్‌ఎల్‌ అగ్ని ప్రమాదం కేసులో కీలక మలుపు | Key Turning Point In FSL Fire Accident Case, 1100 Case Files Burnt And Data Recovery Nearly Impossible | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఎస్‌ఎల్‌ అగ్ని ప్రమాదం కేసులో కీలక మలుపు

Feb 21 2026 8:50 AM | Updated on Feb 21 2026 9:54 AM

Key Turning Point In Fsl Fire Accident Case

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (టీజీ ఎఫ్‌ఎస్‌ఎల్‌) అగ్నిప్రమాదంలో కీలక మలుపు జరిగింది. అగ్ని ప్రమాదంలో 1100 ఫైల్స్‌ దగ్ధం అయినట్లు నాగపూర్‌ బృందం గుర్తించింది. 1100 కేసుల డేటా రికవరీ కోసం బృందం యత్నించింది. కేసుల డేటా రికవరీ కష్టం అని ప్రత్యేక బృందం తేల్చింది.

ఈ నెల(ఫిబవరి) 7వ తేదీన జరిగిన ఎఫ్‌ఎస్‌ఎల్‌ భారీ అగ్ని ప్రమాద ఘటనలో పలు కీలక కేసుల ఫైళ్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. ఎఫ్‌ఎస్‌ఎల్‌ భవనం మొదటి అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 50 కంప్యూటర్లు, తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, సీజ్‌ చేసిన హార్డ్‌డిస్కులు, కేసు రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఇందులో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతోపాటు ఇటీవల దర్యాప్తు కొనసాగుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు సైతం కాలి బూడిదైనట్టు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. రెండు అంతస్తులున్న ఈ భవనం మొదటి అంతస్తులోనే ఆధారాలను భద్రపర్చేగదితో పాటు, పలు కేసుల్లో ఆధారాల విశ్లేషణ తర్వాత నివేదికలను భద్రపరుస్తారు. రెండో అంతస్తులో ఫోరెన్సిక్‌ పరికరాలు, కెమికల్‌ ల్యాబ్‌ మెటీరియల్‌ ఉంటుంది. ఈ ల్యాబ్‌లోకి మంటలు వ్యాపించలేదు. అలాగే కింది అంతస్తులోకి మంటలు పోలేదు. ప్రమాదంలో కేవలం ఒకటో అంతస్తు పూర్తిగా దగ్ధమవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

రాష్ట్రంలో జరిగే నేర పరిశోధనకు ఈ ప్రయోగశాల శాస్త్రీయ సహాయం అందిస్తుంటుంది. హత్యలు, దోపిడీలు, లైంగిక దాడులు, మోసాలు వంటి కేసులకు సంబంధించిన సాక్షాధారాలు ఇక్కడే నిక్షిప్తమై ఉంటాయి. ఎక్కడ నేరం జరిగినా ఘటనాస్థలంలో సేకరించిన నమూనాల పరీక్ష ఇక్కడే చేస్తారు. ఈ న్యాయ వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగశాలలో వేలి ముద్రల పరిశీలన, రక్తం, వెంట్రుకలు, డీఎన్‌ఏ వంటి పరీక్షలు చేస్తారు. అలాగే తుపాకులు, బుల్లెట్ల పరిశీలన జరుపుతారు. వీటితోపాటుగా విషాలు, మత్తు పదార్థాల పరీక్షలు, సంతకాలు, నకిలీ పత్రాల పరిశీలన వంటివి చేస్తారు. అదేవిధంగా డ్రగ్స్, గంజాయి, హెరాయిన్‌ వంటి (నార్కోటిక్‌) పదార్ధాల పరిశీలన జరుపుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement