చెల్లెలి ముందే తండ్రిని తుపాకీతో కాల్చి.. | Blue Drum Horror Man Shoots Father dead in Front of Sister | Sakshi
Sakshi News home page

చెల్లెలి ముందే తండ్రిని తుపాకీతో కాల్చి..

Feb 24 2026 7:42 AM | Updated on Feb 24 2026 10:54 AM

Blue Drum Horror Man Shoots Father dead in Front of Sister

లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పరిధిలోగల ఆషియానాలో సభ్యసమాజం తలదించుకునే ఘోరం  చోటుచేసుకుంది. తండ్రీకొడుకుల మధ్య చదువు విషయంలో తలెత్తిన వివాదం చివరకు తండ్రి ప్రాణాలను బలిగొంది. మద్యం వ్యాపారంతో పాటు పాథాలజీ ల్యాబ్‌ను నిర్వహిస్తున్న మన్వేంద్ర సింగ్ (49)ను అతని కుమారుడు, బీకామ్ విద్యార్థి అక్షత్ సింగ్(21) అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఫిబ్రవరి 20న జరిగిన ఈ ఘటన పోలీసుల విచారణలో వెలుగులోకి రావడంతో స్థానికంగా సంచలనంగా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. అక్షత్ సింగ్‌ను ‘నీట్’ పరీక్షకు సిద్ధం కావాలని తండ్రి మన్వేంద్ర సింగ్  కోరేవాడు. అయితే అక్షత్, బీకామ్ చదవాలని నిశ్చయించుకున్నాడు. ఈ విషయమై తండ్రీకొడుకుల మధ్య గత కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ఈ క్రమంలోనే గత ఏడాది మీరట్‌లో జరిగిన ఒక హత్య ఉదంతం (సౌరభ్ రాజ్‌పుత్ కేసు) గురించి సోషల్ మీడియాలో చదివిన అక్షత్, తన తండ్రిని కూడా అదే తరహాలో వదిలించుకోవాలని ప్లానింగ్‌ చేశాడు.

ఫిబ్రవరి 20 తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో తండ్రీ కొడుకుల మధ్య చదువు విషయమై మరోసారి ఘర్షణ చెలరేగింది. ఆగ్రహంతో అక్షత్ తన తండ్రికి చెందిన లైసెన్స్‌డ్ రైఫిల్‌తో అతనిపై కాల్పులు జరిపాడు. ఈ ఘోరం  అక్షత్ చెల్లెలి ముందే జరిగింది. ఆ సమయంలో నోరు విప్పితే చంపేస్తానని  చెల్లెలిని చంపేస్తానని అక్షత్ బెదిరించాడు

హత్య అనంతరం సాక్ష్యాలను రూపుమాపేందుకు అక్షత్ మూడవ అంతస్తులో ఉన్న మృతదేహాన్ని కిందకు ఈడ్చుకొచ్చి, ఇంట్లోని పనిముట్లతో శరీర భాగాలను ముక్కలు చేశాడు. తల, మొండెం భాగాలను ఒక నీలం రంగు ప్లాస్టిక్ డ్రమ్ములో దాచిపెట్టి, చేతులు, కాళ్లను తన కారులో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతమైన సద్రౌనాలో పడేశాడు. ఆ తర్వాత తన తండ్రి ఢిల్లీ వెళ్లారని, ఫోన్ కలవడం లేదంటూ, అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. తండ్రి కనిపించడం లేదంటూ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసి, తప్పుదోవ పట్టించేందుకు యత్నించాడు.

అక్షత్ పొంతన లేని సమాధానాలు, కారును అత్యంత శుభ్రంగా కడగడం తదితర చర్యలపై అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్షత్‌ను తమదైన శైలిలో విచారించారు. మొదట తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని బుకాయించినప్పటికీ, చివరకు అక్షిత్‌ నిజం ఒప్పుకున్నాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఫోరెన్సిక్ బృందాలు సద్రౌనా ప్రాంతంలో మన్వేంద్ర సింగ్ శరీర భాగాల కోసం గాలిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ‘చుక్కలు చూపిస్తా’: అమెరికా అధ్యక్షుని హెచ్చరిక

Advertisement
 
Advertisement
Advertisement