‘చుక్కలు చూపిస్తా’: అమెరికా అధ్యక్షుని హెచ్చరిక | Trump issues higher tariff threat | Sakshi
Sakshi News home page

‘చుక్కలు చూపిస్తా’: అమెరికా అధ్యక్షుని హెచ్చరిక

Feb 24 2026 7:14 AM | Updated on Feb 24 2026 8:45 AM

Trump issues higher tariff threat

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన దూకుడుతనాన్ని ప్రదర్శించారు. దిగుమతి సుంకాల విషయంలో అమెరికా సుప్రీంకోర్టు (SCOTUS) ఇచ్చిన తీర్పును బేఖాతరు చేస్తూ, అంతర్జాతీయ వాణిజ్య వేదికపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాతో ఆటలు సాగించాలని చూసే దేశాలకు చుక్కలు చూపిస్తామని, గతంలో కంటే భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటున్న దేశాలు ఇకపై తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆయన హెచ్చరికలు జారీ చేయడం ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్‌ తన అధికార పరిధిని మించి సుంకాలు విధించడం చట్టవిరుద్ధమని, ఇందుకు కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని ధర్మాసనం 6-3 మెజారిటీతో తీర్పునిచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ట్రంప్ ఎదురుదాడికి దిగారు.

కోర్టు తీర్పును పక్కనపెట్టి, తక్షణమే 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అంతటితో ఆగకుండా మరుసటి రోజే ఆ సుంకాన్ని ఏకంగా 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించి తన పంతాన్ని చాటుకున్నారు. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (IEEPA) ఆసరాగా చేసుకుని ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు చట్టబద్ధమైన సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

యూరోపియన్ యూనియన్, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు అమెరికాతో తమ వాణిజ్య ఒప్పందాలను పునఃసమీక్షించుకుంటున్న తరుణంలో ట్రంప్ వాటిపై స్పందిస్తూ ‘కొనేవాడు జాగ్రత్త’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్ వంటి వ్యూహాత్మక భాగస్వాముల విషయంలోనూ ఈ సుంకాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో భారత్‌పై విధించిన 50 శాతం భారీ సుంకం, చర్చల అనంతరం 18 శాతానికి తగ్గినప్పటికీ, తాజా పరిణామాలు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Venezuela: మిన్నంటిన రాజకీయ ఖైదీల నిరసనలు

Advertisement
 
Advertisement
Advertisement