‘వేచి చూడండి’.. ఇరానియన్లకు హెచ్చరిక | Iranians get alert on phones amid Trump's threats | Sakshi
Sakshi News home page

‘వేచి చూడండి’.. ఇరానియన్లకు హెచ్చరిక

Feb 24 2026 8:32 AM | Updated on Feb 24 2026 9:20 AM

Iranians get alert on phones amid Trump's threats

టెహ్రాన్/వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ మిడిల్‌ ఈస్ట్‌(మధ్యప్రాచ్యం)లో ఉత్కంఠభరిత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దూకుడును పెంచడమే కాకుండా, సైనిక చర్యకు సిద్ధమన్నట్లుగా భారీ నౌకాదళాన్ని మొహరించారు. ఈ ఉద్రిక్తతల నడుమ సోమవారం వేలాది మంది ఇరానియన్ల మొబైల్ ఫోన్లకు ఒక అజ్ఞాత సందేశం రావడం కలకలం రేపింది.

పర్షియన్ భాషలో ఉన్న ఆ సందేశంలో ‘అమెరికా అధ్యక్షుడు చేతల మనిషి.. ఏం జరుగుతుందో వేచి చూడండి’ అంటూ హెచ్చరికలు  ఉన్నాయి. ఇరాన్ ఇంటర్నేషనల్ వార్తా సంస్థ ఈ పరిణామాలను గుర్తించింది. ఇరాన్‌పై పరిమిత సైనిక దాడికి వెనుకాడబోనని ట్రంప్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ  సూచించారు. అణు ఒప్పందానికి  ఇక 15 రోజుల సమయం మాత్రమే ఉందని, తరువాత సైనిక చర్య తప్పదని ట్రంప్ డెడ్ లైన్ విధించారు.

ఇదే సమయంలో ఇరాన్ తన అణు ప్రతిపాదనల ముసాయిదాను సిద్ధం చేస్తోంది. అయితే అమెరికా ఈ అణు అంశంపైననే కాకుండా, ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, ప్రాంతీయ తీవ్రవాద గ్రూపులకు అందుతున్న మద్దతుపై కూడా చర్చించాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలో జెనీవాలో జరగబోయే తదుపరి రౌండ్ చర్చలు అత్యంత కీలకంగా మారాయి. యూరోపియన్ యూనియన్ సైతం ఈ ప్రాంతంలో మరో యుద్ధం వద్దంటూ దౌత్య పరిష్కారాన్ని కోరుతోంది. దేశం వెలుపల యుద్ధ భయాలు ఉండగా, ఇరాన్ లోపల అంతర్గత తిరుగుబాటు జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.

ఇజ్రాయెల్‌తో యుద్ధం, ప్రాంతీయ ప్రాక్సీ గ్రూపులతో ఇక్కట్లు వంటి అంశాలు ఇరాన్ పాలకులకు పెను సవాలుగా మారాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన పలు దేశాలు తమ పౌరులను తక్షణమే ఇరాన్ వదిలి వెళ్లాలని ఆదేశించాయి. ఇప్పటికే స్వీడన్, పోలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలు హెచ్చరికలు జారీ చేయగా, తాజాగా భారత్ కూడా తన పౌరులకు అడ్వైజరీ జారీ చేస్తూ అప్రమత్తం చేసింది. లెబనాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సైతం ముందు జాగ్రత్తగా సిబ్బందిని ఖాళీ చేయించే ప్రయత్నంలో ఉందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: చెల్లెలి ముందే తండ్రిని తుపాకీతో కాల్చి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement