డోనాల్ట్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు | Dont Know How Long Ill Be Around: Trump | Sakshi
Sakshi News home page

డోనాల్ట్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

Feb 24 2026 8:57 AM | Updated on Feb 24 2026 10:11 AM

Dont Know How Long Ill Be Around: Trump

తాను ఎంతకాలం ఉంటానో తెలియదంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. తాజాగా ఫ్లోరిడాలోని ఆయన నివాసం దగ్గర సాయుధ చొరబాటుదారుడిని భద్రతా దళాలు కాల్చివేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుసార్లు ట్రంప్‌పై హత్యాయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో టం‍ప్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

"నేను ఎంతకాలం ఇక్కడ ఉంటానో నాకు తెలియదు. నా కోసం చాలా మంది తుపాకులతో కాపు కాస్తున్నారు’’ అంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల ప్రచార సమయంలో తనపై జరిగిన రెండు హత్యాయత్నాల నుంచి ప్రాణాలతో బయటపడిన ట్రంప్, తాజా ఘటనపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

‘‘మీరు ఈ పిచ్చి షూటర్ల గురించి చదివే ఉంటారు.. కానీ వారు ప్రభావశీలురైన అధ్యక్షులను మాత్రమే టార్గెట్‌ చేస్తారు. తక్కువ ప్రభావం ఉన్న అధ్యక్షుల జోలికి వారు వెళ్లరు’’ అంటూ ట్రంప్‌ పేర్కొన్నారు. గతంలో హత్యకు గురైన అబ్రహం లింకన్, జాన్ ఎఫ్.కెన్నెడీలను గుర్తుచేస్తూ.. వారు చాలా ప్రభావశీలురన్నారు. ఆ గొప్ప నాయకులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. బహుశా తాను కొంచెం తక్కువ ప్రభావశీలిగా ఉండాలనుకుంటున్నానేమోనన్న ట్రంప్‌.. కాస్త తగ్గించుకుందామా?.. కొన్నాళ్లపాటు ఒక సాధారణ అధ్యక్షుడిలా ఉంటానంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

గత శనివారం అర్ధరాత్రి.. ఫ్లోరిడాలోని ఆయన నివాసంలోకి ఓ దుండగుడు చొరబడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అప్రమత్తమైన భద్రతా దళాలు అతడిని కాల్చివేశాయి. ఈ ఘటన సమయంలో ట్రంప్‌ దంపతులు వైట్‌హౌస్‌లోనే ఉన్నట్లు సమాచారం. ఫ్లోరిడా పామ్‌ బీచ్‌లో ఉన్న ‘మార్‌ ఎ లాగో’ ఎస్టేట్‌కు ట్రంప్‌ వీకెండ్‌లో వస్తుంటారు. ఎస్టేట్‌ నార్త్‌ గేట్‌ నుంచి ప్రవేశించిన  ఓ దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. అతడి చేతిలో ఆయుధంతో పాటు ఇంధనం క్యాన్‌ ఉన్నట్లు కూడా గుర్తించారు. అడ్డుకున్నభద్రతా దళాలపై నిందితుడు షాట్‌గన్‌ను ఎక్కుపెట్టాడు. దీంతో అధికారులు వెంటనే అతడిని మట్టుబెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement