నేటి ఉరుకుల పరుగుల జీవితంలో స్మార్ట్‌ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. శ్వాస తీసుకోవడం, కనురెప్ప వేయడం ఎంత సహజంగా జరుగుతుంటాయో, అదే మాదిరిగా తెలియకుండానే ఫోన్ స్క్రీన్‌ను చూడటం అనేది అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటు మన మెదడు పనితీరును, ముఖ్యంగా ఏకాగ్రతను తీవ్రంగా దెబ్బతీస్తోందని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
పరిశోధనల్లో షాకింగ్ నిజాలు
బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివర్సిటీ, దక్షిణ కొరియాలోని కైమ్యుంగ్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఫోను చూడటంపై నిర్వహించిన పరిశోధనల్లో విస్తుపోయే నిజాలను వెల్లడయ్యాయి. ఒక వ్యక్తి రోజుకు సగటున 110 సార్లు ఫోన్ చెక్ చేస్తున్నారంటే, అతను తీవ్రమైన ఫోన్ వ్యసనంలో ఉన్నారని అర్థం. ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు, మన మేధో సామర్థ్యాలను క్రమంగా కుంగదీసే ఒక మానసిక సమస్యగా మారుతోందని ఈ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
మెదడుపై ‘డిజిటల్’ దాడి
మనం పదేపదే ఫోన్ చూడటం వల్ల మెదడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుందని బెంగళూరుకు చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ ఎస్. గిరిప్రసాద్ తెలిపారు. మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఫోన్ వైపు చూస్తే మెదడు ఆ పనిని పక్కన పెడుతుంది. తిరిగి పని మొదలుపెట్టినప్పుడు మెదడు మళ్లీ మొదటి నుండి శ్రమించాల్సి వస్తుంది. ఈ ‘స్విచ్చింగ్’ ప్రక్రియ వల్ల మెదడు త్వరగా అలసిపోయి, క్రమంగా ఏకాగ్రతను కోల్పోతుంది.
నోటిఫికేషన్ రాకపోయినా ..
మనం ఎంత సమయం ఫోన్ వాడుతున్నామనే దానికంటే, ఎన్నిసార్లు పని మధ్యలో ఫోన్‌ను చూస్తున్నామనేదే ముఖ్యం. ఫోన్ కల్పించే ఈ ‘అంతరాయం’ వల్లే ఏకాగ్రతకు అధిక నష్టం జరుగుతుంది. ఏదైనా నోటిఫికేషన్ రాకపోయినా సరే, ఊరికే ఫోన్ అన్‌లాక్ చేసి చూడటం ఒక బలహీనతగా మారుతుంది. దీనివల్ల మెదడు ఎక్కువ సేపు ఒకే విషయంపై దృష్టి పెట్టలేక ‘షార్ట్ అటెన్షన్ స్పాన్’కు అలవాటు పడిపోతుంది.
పరిమితి ఎంతంటే..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజుకు 50 నుంచి 80 సార్లు ఫోన్ చెక్ చేయడం ఒక సాధారణ పరిమితిగా పరిగణించవచ్చు. కానీ ఈ సంఖ్య 100 మార్కును దాటితే మాత్రం మీరు ప్రమాదకరమైన జోన్‌లో ఉన్నారని గ్రహించాలి. ఎటువంటి అవసరం లేకుండానే ఫోన్ తీయడం అనేది అదుపులేని అలవాటుగా మారి, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
మెదడును తిరిగి గాడిలో పెట్టండిలా..
ఈ వ్యసనం నుండి బయటపడటం అసాధ్యమేమీ కాదు. అనవసరమైన నోటిఫికేషన్లను వెంటనే ఆపివేయండి. చదువుకునేటప్పుడు లేదా నడిచేటప్పుడు ఫోన్‌ను కంటికి దూరంగా ఉంచండి. ప్రతి 3 లేదా 6 గంటలకు ఒకసారి మాత్రమే ఫోన్ చూసుకునేలా నియమించుకోవాలి. ఏదైనా పని చేస్తున్నప్పుడు కనీసం 20 నుండి 50 నిమిషాల పాటు ఫోన్ ముట్టుకోకుండా ఆ పనిపైనే దృష్టి సారించడం ద్వారా మెదడును తిరిగి ఉత్తేజితం చేయవచ్చు.
‘డిజిటల్ డిటాక్స్’ కోసం..
మెదడు చురుగ్గా పనిచేయాలంటే రాత్రి వేళల్లో ఫోన్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. దానికి బదులుగా పుస్తక పఠనం, ధ్యానం వంటి అలవాట్లను అలవరచుకోవాలి. సరైన నిద్ర మెదడుకు రీఛార్జ్‌లా పనిచేస్తుంది. మీరు మీ ఫోన్‌ను నియంత్రిస్తున్నారా లేక ఫోన్ మిమ్మల్ని నియంత్రిస్తోందా? ఒక్కసారి ఆలోచించుకోండి.
ఇది కూడా చదవండి: చెల్లెలి ముందే తండ్రిని తుపాకీతో కాల్చి..


