వేడుకల్లో డెస్టినేషన్‌.. ఇప్పుడు ఓ క్రేజీ పేషన్‌ | pre wedding shoots to destination weddings new craze among city elites | Sakshi
Sakshi News home page

వేడుకల్లో డెస్టినేషన్‌.. ఇప్పుడు ఓ క్రేజీ పేషన్‌

Feb 24 2026 9:37 AM | Updated on Feb 24 2026 10:48 AM

pre wedding shoots to destination weddings new craze among city elites

ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌తో మొదలై పెళ్లి తంతు వరకు 

వేడుకల్లో డెస్టినేషన్‌.. ఇప్పుడు ఓ క్రేజీ పేషన్‌ 

 సిటీ సెలబ్రిటీల నుంచి సంపన్నుల దాకా అదే రూటు 

 పిక్నిక్‌ స్పాట్స్‌లా మారిపోతున్న పెళ్లి వేదికలు

కరోనా సందర్భంగా ఊపందుకున్న డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ట్రెండ్‌ సంపన్న కుటుంబాల్లో ఇప్పుడు ఒక సంప్రదాయంగా స్థిరపడింది. సినిమా సెలబ్రిటీల ప్రైవసీ (వ్యక్తిగత గోప్యత) ఆలోచనల నుంచి పుట్టిన ఈ కొత్త పోకడ... తర్వాత సంపన్న కుటుంబాలకు విస్తరించింది. ఇప్పుడు ఎగువ మధ్య తరగతి కూడా ఇదే బాట పట్టేందుకు దారితీసింది. ఒకప్పుడు వేర్వేరు ప్రాంతాలలో కేవలం పెళ్లిళ్లకు మాత్రమే డెస్టినేషన్‌ అన్వేషించేవారు. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌కు కూడా వ్యాపించింది. 

ఊళ్లను చుట్టేస్తున్న వివాహ వేడుకల ప్రక్రియ
గతంలో పెద్దింటి నుంచి పెళ్లి ఆహ్వానం వస్తే ఏ హోటల్‌లో?, ఏ ఆడిటోరియంలో? అని అడిగేవారు. ఇప్పుడు ఏ ఊర్లో..? ఏ టూరిస్ట్‌ ప్లేస్‌లో? అంటూ ఆసక్తి చూపే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తున్న నేపథ్యంలో మరోసారి డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ సందడి చేస్తున్నాయి. ఈ తరహా పెళ్లిళ్లు ఆన్‌లైన్‌లో తరచూ వైరల్‌ అవుతుండడం దీనికి మరింత క్రేజ్‌ పెంచుతోంది. 

ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌తో మొదలు 
వివాహ సందర్భంగా ఊర్లు, టూర్లు వెళ్లడం అనేది ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌తో మొదలై పెళ్లితో ముగుస్తోంది. దంపతులు కాబోతున్న జంటతో పాటు కొందరు సన్నిహితులు, ఫొటో/వీడియోగ్రాఫర్లు కలిసి ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కోసం పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అక్కడ కొన్ని రోజులు గడిపి అచ్చంగా సినిమా తరహాలోనే షూటింగ్‌ ముగించుకుని తిరిగి వస్తున్నారు. ఈ తరహా ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌ కోసం గోవా, ఊటీ, కూర్గ్, మున్నార్‌... వంటి సుందరమైన ప్రకృతి అందాలకు నిలయమైన ప్రాంతాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

  • హల్దీ టు సంగీత్‌
    పెళ్లికి హాజరయ్యే అతిథులు పర్యాటక ప్రాంతాల అందాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. 

  • దంపతులు, ఇరు కుటుంబాలతో పాటు హాజరయ్యే బంధుమిత్రులు సైతం పూర్తిగా పెళ్లి వేడుకల్లో ఇతరత్రా అడ్డంకులు లేకుండా పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. అదే నివసించే ప్రాంతంలోనే అయితే వ్యక్తిగత పనులు, రోజువారీ కార్యకలాపాల్లో పెళ్లికి హాజరవడం ఒక భాగంగా మాత్రమే పరిమితం అవుతుంది. 

  • సంగీత్, హల్దీ... వంటి భిన్న రకాల కార్యక్రమాలతో పాటు మొత్తం వేడుకల్లో హాజరైనవారిలో అత్యధికులు భాగం పంచుకునే వీలుంటుంది.

సెలబ్రిటీ..నీవు నేరి్పన విద్యే 
టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రష్మికా, విజయ్‌ దేవరకొండల పెళ్లి ఫలానా నెలలో జరుగుతుంది అని తెలియగానే అది డెస్టినేషన్‌ వెడ్డింగే అనేది కన్‌ఫర్మ్‌ అయిపోయింది. అంతగా సెలబ్రిటీ సర్కిల్‌లో మమేకమైపోయిన ఈ ట్రెండ్‌ ఇప్పుడు సంపన్నులనూ ఆకర్షిస్తోంది. గత ఏడాది చివరిలో నగరవాసి, అమెరికాలో స్థిరపడిన పారిశ్రామికవేత్త రామరాజు మంతెన కుమార్తె నేత్రా మంతెన–వంశీ గాదిరాజు వివాహ వేడుకను ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో నిర్వహించారు. దీనికి ఏకంగా హాలీవుడ్‌ నటి, గాయని జెన్నిఫర్‌ లోపెజ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడు ట్రంప్‌ జూనియర్‌ సైతం హాజరవగా, బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ నృత్య కార్యక్రమం హైలైట్‌గా నిలిచింది.  

డెస్టినేషన్‌ను పేషన్‌గా మారుస్తున్నవి ఇవే.. 
పెళ్లిని ఒక గొప్ప జ్ఞాపకంగా మార్చుకోవాలనే ఆలోచన, ఈ వేడుకలను అత్యంత సన్నిహితులు, బంధువులకు మాత్రమే పరిమితం చేయాలని భావించే ధోరణి పెరుగుతోంది. ఇదే డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు ఆదరణ పెంచుతోంది. స్థానికంగా నివసించే చోట పెళ్లి నిర్వహిస్తే రకరకాల సమస్యలు ముఖ్యంగా మీడియా నుంచి ప్రైవసీ ఉండదని తొలుత సెలబ్రిటీలు ఈ మార్గాన్ని ఎంచుకుంటే అనంతరం రిచ్‌/పోష్‌ సర్కిల్‌ కూడా అదే బాట పట్టింది.  

పేరొందిన డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌.. ఇవే!  
 రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ (సిటీ ఆఫ్‌ లేక్స్‌), జోథ్‌పూర్‌ (బ్లూసిటీ), జైపూర్‌ (పింక్‌ సిటీ), జై సల్మేర్‌  గోవాలోని పలు రిసార్ట్స్, క్లబ్స్, బీచ్‌లు హిమాచల్‌ప్రదేశ్, సిమ్లా, మనాలి, రిషికేష్‌ ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ 

విభిన్న రకాల ప్యాకేజీలు
డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ నిర్వహించేందుకు పలు ఆన్‌లైన్‌ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి వివిధ ధరల్లో ప్యాకేజ్‌ కూడా అందిస్తున్నాయి. కనీసం 50 నుంచి 100 మందితో కూడిన బృందానికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల్లో కూడా ప్యాకేజ్‌ అందుబాటులో ఉంది. ఎంచుకున్న ప్లేస్, పాల్గొనేవారి సంఖ్యను బట్టి ఇది రూ.70 లక్షల వరకు పెరుగుతుంది. పలు రకాల ఈవెంట్లను కూడా వీటికి మేళవిస్తే ఆ ప్యాకేజీ రూ.కోటిపై మాటే. అయితే, రూ.కోట్లు వెచ్చించే సంపన్నులకు కొదవలేదు కాబట్టి ఈవెంట్‌ నిర్వాహకులకు మ్యారేజ్‌ సీజన్‌లో తగినంత డిమాండ్‌ ఉంటోంది.   

Advertisement
 
Advertisement
Advertisement