మనసే మంత్రం..! | Jeevansathi Matrimony Report on marriage | Sakshi
Sakshi News home page

మనసే మంత్రం..!

Feb 21 2026 4:45 AM | Updated on Feb 21 2026 4:45 AM

Jeevansathi Matrimony Report on marriage

సరైన భాగస్వామి దొరికితేనే వివాహం

కులం, వయసు, ఆస్తి ముఖ్యం కాదు

భారత్‌లో 90% మంది నిర్ణయం ఇదే

జీవన్‌సాథీ మ్యాట్రిమోనీ నివేదికలో వెల్లడి

పెళ్లి అంటే నూరేళ్ల పంట. జీవితంలో అత్యంత కీలక ఘట్టం. అంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే కులం, వయసు, ఆస్తితో సంబంధం లేకుండా సరైన జోడీ ఉండాల్సిందేనన్నది నేటి తరం మాట. ‘మనసే మంత్రం’అని జపించే వారి సంఖ్య మన దేశంలో అంతకంతకూ పెరుగుతుండటం ఆసక్తికరం.  

భాగస్వామి వేట, వివాహం విషయంలో భారత్‌లో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన సంప్రదాయాలను నేటి తరం ఎలా తిరగరాస్తోంది అన్న అంశంపై జీవన్‌సాథీ మ్యాట్రిమోనీ ఓ నివేదికను రూపొందించింది. దశాబ్ద కాలంలో (2016–2025) మారిన యూజర్ల పోకడలు, అలాగే ఈ ఏడాది దేశవ్యాప్తంగా 30 వేల పైచిలుకు యాక్టివ్‌ మెంబర్స్‌ నుంచి సేకరించిన అభిప్రాయాలను ఇందులో పొందుపరిచారు. భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కులం, మతం, వయసు, సంపాదన చూడకుండా తమ ఆలోచనా ధోరణి, అభిరుచులు ఎంతవరకు కలుస్తున్నాయనే దానికి అత్యధికులు ప్రాధాన్యం ఇస్తున్నారని నివేదిక వివరించింది. సరైన భాగస్వామి దొరకడమే పెళ్లికి అసలైన అర్హతగా 90% మంది భావిస్తున్నారు.

భారతీయులు తమ భాగస్వాములను ఎంచుకునే విధానంలో స్పష్టమైన మార్పులు వస్తున్నాయి. కుల ప్రాధాన్యాలు తగ్గాయి. పునర్వివాహాల పట్ల ఆదరణ పెరుగుతోంది. వివాహ వయసు ఆలస్యమవుతోంది. వరుడు/వధువు ఎంపికలో కుటుంబమూ జోక్యం చేసుకోవాలన్న ధోరణి కనపడుతోందని నివేదిక తెలిపింది. యువత తమ పెళ్లి విషయంలో మరింత స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కఠినమైన నిబంధనలు లేదా నిర్ణీత వయసుకంటే పరస్పర అవగాహన, సమాన విలువలతోపాటు మానసికంగా సిద్ధపడ్డాకే పెళ్లికి సై అంటున్నారు. విడాకుల పట్ల ఉన్న సామాజిక వివక్ష క్రమంగా తగ్గుతోంది.

కులం గోడలు బద్దలు: భాగస్వామి ఎంపికలో కులం కంటే వ్యక్తిగత విలువలు, ఆలోచనల కలయికకు నేటి తరం ఎక్కువ ప్రాముఖ్యతనిస్తోంది. కులం ముఖ్యం అన్నవారు దశాబ్దం క్రితం 91% ఉంటే.. ఇప్పుడీ సంఖ్య ఏకంగా 54 శాతానికి వచ్చి చేరింది. మెట్రోల్లో వీరి సంఖ్య 49% ఉంది.  

పునర్వివాహానికి సై: గతంతో పోలిస్తే ప్రస్తుతం పునర్వివాహం పట్ల సమాజంలో సానుకూల మార్పు కనిపిస్తోంది. ఇటువంటి వారి సంఖ్య 2016లో కేవలం 11% మాత్రమే. 2025 నాటికి ఈ సంఖ్య 16%కి చేరింది. అంటే దశాబ్ద కాలంలో 43% పెరిగారన్న మాట. విడాకులు తీసుకున్న వారికి వస్తున్న సంబంధాలలో 15% మంది అవివాహితులు. అంటే గత చరిత్ర కంటే వ్యక్తిత్వానికే ప్రాముఖ్యత పెరుగుతోంది.  

అప్పుడే పెళ్లి భాజాలు
‘నాకు 25 ఏళ్లు వచ్చాయి కాబట్టి పెళ్లి చేసుకోవాలి’అనే ఆలోచన పోయి ‘నన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరికినప్పుడే నేను సిద్ధం’అనే ధోరణి కనపడుతోంది. కెరీర్‌ స్థిరత్వం, వ్యక్తిగత ఎదుగుదలతోపాటు మానసిక ప్రశాంతత, జీవితం పట్ల స్పష్టత వచ్చిన తర్వాతే పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. అందుకే భాగస్వామి కోసం వెతికే వయస్సు 29 ఏళ్లకు చేరింది. దశాబ్దం క్రితం ఈ వయసు 27 ఉంది.  

ఇద్దరూ సంపాదిస్తేనే..
వివాహ బంధంలో పాతకాలపు ఆర్థిక పద్ధతులు ఇప్పుడు మారుతున్నాయి. 87% మంది పురుషులు తమ కంటే ఎక్కువ సంపాదిస్తున్న మహిళను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 15% మంది మహిళలు తమ కంటే తక్కువ సంపాదిస్తున్న పురుషులతో పెళ్లికి మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరూ సంపాదించాలని భావిస్తున్నారు. కేవలం 8% మంది మాత్రమే ఒక్కరు సంపాదిస్తే చాలని నమ్ముతున్నారు.  

కుటుంబమూ ఒప్పుకోవాల్సిందే..
యువత తమ భాగస్వామిని తామే ఎంచుకుంటున్నారు. 77% మంది తమ ప్రొఫైల్‌ను తామే నిర్వహిస్తున్నారు. 2016లో ఇటువంటివారి సంఖ్య 67%. కుటుంబం మేనేజ్‌ చేస్తున్న అమ్మాయి/అబ్బాయి ప్రొఫైల్స్‌ సంఖ్య 33% నుంచి 23%కి పడిపోయింది. పెళ్లికి తల్లిదండ్రుల ఆమోదం మరియు సలహాలకు 69% విలువ ఇస్తున్నారు. అమ్మాయిల విషయంలో ఈ సంఖ్య 75% ఉంది. ఆసక్తికర అంశం ఏమంటే మ్యాచ్‌ మేకింగ్‌లో తల్లిదండ్రుల కంటే తోబుట్టువుల పాత్ర పెరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement