పనిచేయని ‘కల్తీ’ కుతంత్రం! సొంత కమిటీ షురూ! | Chandrababu Government Forms One Member Committee, Defying Supreme Court Oversight, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

పనిచేయని ‘కల్తీ’ కుతంత్రం! సొంత కమిటీ షురూ!

Feb 21 2026 4:28 AM | Updated on Feb 21 2026 10:38 AM

Chandrababu government forms one member committee in defiance of Supreme Court

సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ చంద్రబాబు సర్కార్‌ ఏకసభ్య కమిటీ ఏర్పాటు

రిటైర్డ్‌ ఐఏఎస్‌ దినేశ్‌ కుమార్‌ నేతృత్వం 

నెయ్యి కల్తీ దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో బాబు కొత్త పథకం 

శ్రీవారి ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదన్న ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ 

అదే విషయాన్ని స్పష్టం చేసిన సీబీఐ సిట్‌ చార్జ్‌షీట్‌ 

వైఎస్సార్‌సీపీ నేతలెవర్నీ చార్జ్‌షీట్‌లో పేర్కొనని సీబీఐ 

దాంతో కొత్త కుట్రకు కూటమి ప్రభుత్వ బరితెగింపు 

సిట్‌ సూచనలకు భిన్నంగా కమిటీ పరిధి పెంపు 

అనుకూలంగా నివేదిక ఇప్పించుకోవచ్చని భావిస్తున్న బాబు బృందం  

బెదిరించి అబద్ధపు వాంగ్మూలాల నమోదుకు పన్నాగం 

వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులే లక్ష్యం...!?  

సాక్షి, అమరావతి: శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలాగా.. ‘కల్తీ నెయ్యి’ వివాదంలో చిక్కుకున్న చంద్రబాబు పెనుగులాడుతున్నారు. హెరిటేజ్‌ – ఇందాపూర్‌ బంధం బయటపడడం, నెయ్యి కాంట్రాక్టు కోసమే పవిత్రమైన తిరుమలేశుని లడ్డూ ప్రసాదానికి ‘కల్తీ’ మరక అంటించినట్లు బట్టబయలు కావడంతో బాబు అండ్‌కో కు కళ్లు బైర్లు కమ్మాయి. తమ కుట్ర బయటపడిపోవడం, మండలిలో ప్రతిపక్షం రోజూ చర్చకోసం పట్టుబడుతుండడం అధికార పక్షానికి మింగుడుపడడం లేదు. దాంతో ముందే వేసుకున్న పథకాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. 

లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకాన్ని ఆపాదిస్తూ తాము చేసిన దుష్ప్రచారానికి రాజముద్ర వేసేందుకు సొంతంగా ఏకసభ్య కమిటీ ఏర్పాటుచేసే కుట్రను చంద్రబాబు పట్టాలెక్కించారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దినేశ్‌కుమార్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన, చంద్రబాబుకు ఎంతో అనుకూలమైన అధికారిగా పేరుతెచ్చుకున్న దినేశ్‌కుమార్‌ని ఈ కార్యానికి ఎంచుకోవడం గమనార్హం. 

టీటీడీ నెయ్యి వ్యవహారంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు సాగుతున్నా... కూటమి ప్రభుత్వం తమ సొంత కమిటీని ఏర్పాటు చేయడం విస్మయపరుస్తోంది. అంతేకాదు ఆ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులు ప్రభుత్వ అసలు పన్నాగాన్ని బయటపెట్టాయి.

సిట్‌ లేఖ ముసుగు... రాజకీయ కక్ష సాధింపే లొసుగు
అప్పటి టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఆర్థిక సలహాదారు, ముఖ్య గణాంకాధికారి(ఎఫ్‌ఏసీవో) బాలాజీలపై శాఖాపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలించాలని సీబీఐ నేతృత్వంలోని సిట్‌ కొద్ది కాలం క్రితం రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసింది. టెండర్ల ప్రక్రియను అమలు చేయడంలో వైఫల్యాలపై వారి నుంచి వివరణ తీసుకోవాలన్నది ఆ లేఖ సారాంశం. 

కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ లేఖను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటోంది. తమ రాజకీయ కక్ష సాధింపునకు సిట్‌ లేఖను వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఏకసభ్య కమిటీ పరిధిని గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. టెండర్ల ప్రక్రియ వ్యవహారాలపై దినేశ్‌ కుమార్‌ కమిటీ టీడీడీ అధికారులతోపాటు కమిటీ సభ్యులను కూడా పిలిచి విచారించ వచ్చని రాష్ట్రప్రభుత్వం పేర్కొంది.  దీనిని చూస్తే కూటమి ప్రభుత్వ రాజకీయ కుట్ర అర్ధం కావడం లేదూ? 

జంతు కొవ్వు కలవలేదన్న క్లీన్‌ చిట్‌ తట్టుకోలేక కూటమి కొత్త కుతంత్రం
లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ముఠా దుష్ప్రచారం బెడిసికొట్టడంతో కూటమి ప్రభుత్వం ఈ కొత్త కుతాంత్రానికి తెరతీసింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ స్వతంత్ర సిట్‌ తమ చార్‌్జషీట్‌ను నెల్లూ­రు న్యాయస్థానానికి ఇటీవల సమర్పించింది. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని అందులో స్పష్టం చేసింది. నాలు­గు వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన శాంపిల్స్‌ను జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ల్యాబరేటరీలలో సీబీఐ పరీక్షించింది. 

హర్యానాలోని నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌డీఆర్‌ఐ), గుజరాత్‌లోని నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు(ఎన్‌డీడీబీ) ల్యాబ్‌లు ఆ శాంపిల్స్‌ను నిశితంగా పరీక్షించి వాటిలో జంతు కొవ్వు లేనే లేదని తేల్చిచెప్పాయి. ఆ రెండు ల్యాబ్‌ల నివేదికలను పొందుపరుస్తూ మరీ సీబీఐ నెల్లూరు న్యాయస్థానంలో చార్‌్జ­షీట్‌ దాఖలు చేసింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సాధికారికంగా ప్రకటించింది. అంతేకాదు ఈ వ్యవహారంలో అప్పటి టీటీడీ చైర్మన్‌ వైవీ  సుబ్బారెడ్డి తదితరులపై చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమేనని కూడా సీబీఐ చార్‌్జషీట్‌ పరో­క్షంగా స్పష్టం చేసింది. 

వైవీ సుబ్బారెడ్డిగానీ ఇతర వైఎస్సార్‌సీపీ నేతలు ఎవర్నీ కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చకపోవడం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. దాంతో లడ్డూ ప్రసాదం ముసుగులో చంద్రబాబు చేసిందంతా రాజకీయ దుష్ప్రచారమేన్నది నిర్ధారణ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ తదితరులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల కోసం పవిత్రమైన తిరుమల ప్రసాదానికి కళంకం ఆపాదించేందుకు తెగబడతారా అని జాతీయస్థాయి మీడియా, విశ్లేషకులు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 

చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు తమ కుట్రను కొనసాగించేందుకే ఏక సభ్య కమిటీని తెరపైకి తెచ్చారు. అందుకే నెయ్యి టెండర్ల ప్రక్రియకు సంబంధించి టీటీడీ బోర్డు సభ్యులు, ఇతర అధికా­రు­లను కూడా విచారించే అధికారం ఈ కమిటీకి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సిట్‌ సమగ్రంగా దర్యాప్తు చేసి సమర్పించిన చార్‌్జషీట్‌కు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అంటే సుప్రీం కోర్టునే ధిక్కరిస్తోందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.  

ఇక 45 రోజుల హై డ్రామా..
లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచార రాద్ధాంతం మరో 45 రోజులపాటు కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. టీటీడీ నెయ్యి టెండర్ల ప్రక్రియపై టీటీడీ కమిటీ సభ్యులు, ఇతర అధికారులను విచారించేందుకు ఏకసభ్య కమిటీకి 45 రోజుల గడువు ఇచ్చింది. ఇప్పటికే  నెయ్యి నాణ్యత అంశంతోపాటు టెండర్ల ప్రక్రియపై సీబీఐ సిట్‌ దర్యాప్తు చేసే నివేదిక సమర్పించింది. 

కాగా మళ్లీ ఏకసభ్య కమిటీ టెండర్ల ప్రక్రియపై విచారణకు ప్రభుత్వం అనుమతించడం విడ్డూరంగా ఉంది. తద్వారా పలువురు అధికారులు, నెయ్యి సరఫరా డెయిరీ ప్రతినిధులు, ఇతరులను విచారణ పేరుతో వేధించడమే ప్రభుత్వ లక్ష్యం. తాము కోరినట్టు వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. 

మద్యం విధానంపై అక్రమ కేసులో ఇదే రీతిలో బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసి అక్రమ కేసులతో వేధిస్తున్న విషయం తెలిసిందే. అదే రీతిలో తాము లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్‌సీపీ నేతలకు వ్యతిరేకంగా అబ్దద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని అధికారులు, డెయిరీ ప్రతినిధులను బెదిరించేందుకు ఏక సభ్య కమిటీ రూపంలో అవకాశం కల్పించింది. అనుకున్నట్టు నివేదిక ఇప్పించుకోవాలన్నదే ప్రభుత్వ మొదటి లక్ష్యం. 

అనంతరం ఆ నివేదిక ఆధారంగా పోలీసులతో అక్రమ కేసు నమోదు చేయించి వైఎస్సార్‌సీపీ నేతలను వేధించాలన్నది అసలు లోగుట్టు. తద్వారా లడ్డూ ప్రసాదంపై తాము చేసిన దుష్ప్రచారాన్ని సాగదీస్తూ ఉండాలన్నది చంద్రబాబు ఉద్దేశం. తమ రాజకీయ కుట్రల కోసం తిరుమల శ్రీవారి ఆలయం, ప్రసాదం, సంప్రదాయాలపై విష ప్రచారం చేసేందుకు చంద్రబాబు పక్కా పన్నాగంతోనే తెగబడుతున్నారన్నది సుస్పష్టం.

Advertisement
 
Advertisement
Advertisement