తనిఖీలకు ప్రత్యేక కార్యాచరణ
జిల్లా స్థాయిలో షెడ్యూల్ రూపొందించాలని ప్రభుత్వం ఆదేశం
పనితీరు, నిర్వహణపై ఎప్పటికప్పుడు నివేదికలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో నిఘా కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 268 విద్యా సంస్థలున్నాయి. వీటి పరిధిలో 1.5 లక్షల మంది విద్యార్థులున్నారు. కొంతకాలంగా ఎస్సీ సొసైటీలోని చాలా గురుకులాల్లో విద్యార్థులు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న ఘటనలున్నాయి. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలు నిర్వహించాలని ఎస్సీ గురుకుల సొసైటీని ఆదేశించింది.
ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నా, ఇలాంటి ఘటనలు తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తున్నందున వీటికి చెక్ పెట్టాలని ఆదేశించింది. పర్యవేక్షణ కట్టుదిట్టం చేసేందుకు తనిఖీల కోసం జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించింది. విద్యార్థుల సమస్యలు, వసతులు, సౌకర్యాలను తనిఖీల్లో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. క్రమం తప్పకుండా గురుకులాల తనిఖీలు నిర్వహించడానికి నోడల్ అధికారులను కూడా నియమించాలని స్పష్టం చేసింది. డిటైల్డ్ ఎంక్వైరీ కేలండర్‌ను ముందుగానే తయారు చేసిన తర్వాత... నిర్ణీత షెడ్యూల్‌కు అనుగుణంగా సంబంధిత అన్ని విభాగాలకు వాటిని అందజేయాలని స్పష్టం చేసింది.
నోడల్ అధికారులు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తనిఖీలు నిర్వహించాలని, విద్యా సంస్థల సరైన పనితీరును నిర్ధారించడానికి ఆకస్మిక సందర్శనలను కూడా నిర్వహించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అధికారులు గురుకుల పాఠశాలలను సందర్శించిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకోవడానికి తనిఖీ నివేదికలను రూపొందించాలని, వాటిని రాష్ట్ర కార్యాలయంతోపాటు సచివాలయంలోని సంబంధిత కార్యదర్శికి సమర్పించాలని సూచించింది. పరిశీలన నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెంటనే తెలియజేయాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. తీసుకున్న చర్యల నివేదికను ప్రతి నెల 5వ తేదీలోపు సంబంధిత విభాగాధిపతులు, కార్యదర్శులకు తప్పకుండా సమర్పించాలని స్పష్టం చేసింది.


