ఏఐ మంత్రిత్వ శాఖ! | CM Revanth Reddy Speech At AI Impact Summit 2026 In Delhi | Sakshi
Sakshi News home page

ఏఐ మంత్రిత్వ శాఖ!

Feb 21 2026 3:16 AM | Updated on Feb 21 2026 3:16 AM

CM Revanth Reddy Speech At AI Impact Summit 2026 In Delhi

కేంద్రంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచన

ఏఐ వినియోగం, నియంత్రణ తదితరాల కోసం ప్రత్యేక వ్యవస్థ అవసరం 

కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో జాతీయ ‘ఏఐ వార్‌ రూమ్‌’ఏర్పాటు చేయాలి 

తెలంగాణలో ఏఐ స్టార్టప్‌ విలేజ్‌ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం  

ఢిల్లీలో కృత్రిమ మేధ సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగం

సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం యావత్‌ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రంగంలో భారత్‌ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కృత్రిమ మేధ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత వంటి అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు.

మానవ చరిత్రలో అగ్ని, చక్రం, వ్యవసాయం, విద్యుత్, ఇంటర్నెట్‌ వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఎలా మార్చాయో గుర్తుచేశారు. ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక సాంకేతికతేనని, ఇది కేవలం ఇంకొక టెక్నాలజీ కాదని, మానవ పరిణామ క్రమంలో అత్యంత శక్తివంతమైన మలుపని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మునుపటి యంత్రాల మాదిరిగా కాకుండా ఏఐ స్వయంగా నేర్చుకోగలదని, విశ్లేషించగలదని, నిర్ణయాలు తీసుకోగలదని అన్నారు. రోబోటిక్స్‌తో కలిసినప్పుడు యంత్రాలు మానవ మేధస్సుతో పాటు శారీరక సామర్థ్యాన్ని కూడా పొందుతున్నాయని చెప్పారు.  

హైదరాబాద్‌లో వార్‌ రూమ్‌ నిర్వహిస్తాం.. 
ప్రపంచ ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని, కొన్ని దేశాలు, కంపెనీలు ముందంజలో ఉన్నాయని సీఎం చెప్పారు. గత పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన అవకాశ నష్టాలను గుర్తు చేస్తూ, ఈసారి భారత్‌ అలాంటి తప్పిదం చేయకూడదని హెచ్చరించారు. సేవలు, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో విజయం సాధించిన భారత్, ప్రపంచ స్థాయి కోర్‌ టెక్నాలజీ ఉత్పత్తుల్లో కూడా నాయకత్వం వహించాలని సూచించారు.

దేశానికి తక్షణ జాతీయ ఏఐ రోడ్‌మ్యాప్‌ అవసరమని నొక్కిచెప్పారు. ఏఐ అభివృద్ధి ప్రతి దశలో భారత్‌ స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించేందుకు కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో జాతీయ ‘ఏఐ వార్‌ రూమ్‌’ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్‌లో అలాంటి వార్‌ రూమ్‌ నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు.  

ఏఐ యూనివర్సిటీ స్థాపించాలి 
    ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే ఏఐ యూనివర్సిటీని దేశంలో స్థాపించాలని సీఎం కోరారు. ఏఐ విస్తరణ నేపథ్యంలో ఉపాధిపై ఉద్భవిస్తున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ, కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు సంభవించవచ్చని, అయితే సరైన రీ స్కిల్లింగ్, అప్‌ స్కిల్లింగ్‌ చర్యల ద్వారా ఏఐ సృష్టించే కొత్త అవకాశాలు మరింత విస్తృతంగా ఉంటాయని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. యువతను ఏఐ ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. 

స్టార్టప్‌ల కోసం జాతీయ ఏఐ నిధి 
    స్టార్టప్‌లకు మద్దతు కల్పించేందుకు జాతీయ ఏఐ నిధి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే ‘ఏఐ స్టార్టప్‌ విలేజ్‌’ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. ఏఐ రంగంలో విధానాలు, చట్టాలు, నైతిక ప్రమాణాలకు మార్గనిర్దేశం చేసే అత్యున్నత సంస్థగా ఇండియా ఏఐ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని కోరారు. ఏఐ అభివృద్ధి, సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, ప్రజా సేవల మెరుగుదల, జాతీయ భద్రతకు తోడ్పడేలా ఉండాలని సూచించారు. బాధ్యతాయుతమైన, సమ్మిళిత, భవిష్యత్‌ దృష్టితో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించేందుకు ప్రపంచ నిపుణులు, సంస్థలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement