తెలంగాణ ‘పెద్దల’తో టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం !
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో తీవ్ర నిర్బంధం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను తుద ముట్టిస్తామని విధించిన గడువు అయిన మార్చి 31 సమీపిస్తున్న వేళ మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. గెరిల్లా వార్ చేయడానికి అనుకూలమైన పరిస్థితులు మృగ్యమై పోవడంతో లొంగుబాటు తప్పదనే దిశగా ఆ పార్టీ అగ్ర నాయకత్వం అడుగులు వేసిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. సురక్షిత లొంగుబాటుకు తెలంగాణను వేదికగా చేసుకోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.
మావోయిస్టు పార్టీకి సుప్రీం కమాండర్‌గా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ(Devji)ని ఎన్నుకున్నట్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న గతంలో ప్రకటించారు. అయితే దేవ్‌జీని ఎన్నుకున్న సమాచారం తమవరకు రాలేదని ఆ పార్టీ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ వంటివారు వెల్లడించారు. అయితే, దేవ్‌జీ జనరల్ సెక్రటరీనా.. కాదా అన్న చర్చను పక్కకు పెడితే, ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి ఆయనే పెద్దదిక్కు అనే అంశంపై ఎవరికీ పెద్దగా సందేహాలు లేవు. అయితే, మారిన పరిస్థితుల నేపథ్యంలో గెరిల్లా తరహా సాయుధ పోరాటం చేయడం కష్టమనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టు తెలుస్తోంది.
దీంతో లొంగుబాటు కోసం తెలంగాణ ‘పెద్దల’కు టచ్‌లోకి వచ్చినట్టు సమాచారం. దేవ్‌జీతోపాటు మరో కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కూడా లొంగుబాటు కోసం తన సొంత రాష్ట్రానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఆపరేషన్.. కర్రె గుట్టలు– 2: తీవ్ర నిర్బంధంతో మావోయిస్టు నాయకత్వం, శ్రేణులు ఉక్కిరిబిక్కిరైన సమయంలో ఆపరేషన్ కర్రె గుట్టలు–2ను ఈనెల 18న భద్రతా దళాలు ప్రారంభించాయి. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టు పార్టీ చీఫ్ దేవ్‌జీ అలియాస్ చేతన్‌తోపాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బాధ్యతలు చూస్తున్న కేసా సోదిలను లక్ష్యంగా చేసుకొని ఈ ఆపరేషన్ ప్రారంభించినట్టు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.
కనీసం కాలు కూడా కదపలేని స్థితికి నిర్బంధం పెరగడం... చివరకు దేవ్‌జీతోపాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు తమకున్న పరిచయాల ద్వారా తెలంగాణ ‘పెద్దల’టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం. రాబోయే నాలుగైదు రోజుల్లో ఈ అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. వీరిద్దరితోపాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీనియర్, జూనియర్ కేడర్ కూడా లొంగిపోయే అవకాశమున్నట్టు తెలుస్తోంది.


