ఫాంహౌస్‌లకు అనుమతి..! | Farmhouse Policy Soon in Telangana | Sakshi
Sakshi News home page

ఫాంహౌస్‌లకు అనుమతి..!

Feb 21 2026 3:52 AM | Updated on Feb 21 2026 3:52 AM

Farmhouse Policy Soon in Telangana

రాష్ట్రంలో త్వరలోనే ప్రత్యేక ఫాంహౌస్‌ పాలసీ 

విధివిధానాలపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం 

కనిష్టంగా 1,200 చదరపు గజాలు ఉంటేనే అనుమతి 

అందులో 20 శాతం స్థలంలో జీ+1 నిర్మాణానికి పర్మిషన్‌ 

మిగిలిన స్థలంలో వ్యవసాయం, తోటల పెంపకానికి ఓకే 

పారిశ్రామిక, వ్యవసాయ సహా ఏ జోన్‌లోనైనా కట్టుకొనే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో త్వరలోనే ప్రత్యేకంగా ఫాంహౌస్‌ పాలసీ రానుంది. ఈ మేరకు విధివిధానాలు, రుసుములు, అభివృద్ధి చార్జీలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జోన్‌తో సంబంధం లేకుండా కన్వర్షన్, బయో కన్వర్షన్, కమర్షియల్, ఇండ్రస్టియల్‌ సహా ఏ జోన్‌లో అయినా ఫాంహౌస్‌లను నిర్మించుకునే వీలు కల్పించనున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్, హరియాణాల లోని ఫాంహౌస్‌ పాలసీలను అధికారుల బృందం అధ్యయనం చేసింది. ఈ పాలసీ అమలు ద్వారా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితోపాటు ప్రభుత్వానికి భవన నిర్మాణ, అభివృద్ధి రుసుములతో స్థిరమైన ఆదాయం సమకూరనుంది. 

100, 200 గజాల్లోనూ ఫాంహౌస్‌లు 
గతంలో ఫాంహౌస్‌లు అనేవి ఉన్నత వర్గాలకు ఎక్కువగా ఉండేవి. కానీ, కరోనా అనంతరం నుంచి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా ఫాంహౌస్‌లకు ఆసక్తి చూపిస్తున్నారు. పనిదినాలలో పని ఒత్తిడి, ట్రాఫిక్‌ రద్దీ వంటి చికాకుల నుంచి బయటపడేందుకు వీకెండ్‌లో కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపేందుకు ఫాంహౌస్‌ ఉండాలని భావించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఫాంహౌస్‌ నిర్మాణాలకు ప్రత్యేకంగా విధానం అంటూ ఏమీ లేకపోవడం వల్ల బిల్డర్లు ఇష్టారీతిన నిర్మాణాలు చేపడుతున్నారు. చాలా మంది డెవలపర్లు 100, 200 గజాల్లోనూ ఫాంహౌస్‌లను నిర్మించి విక్రయిస్తున్నారు. దీంతో క్రెడాయ్, నరెడ్కో, టీడీఏ వంటి డెవలపర్ల సంఘాలు ప్రత్యేకంగా ఫాంహౌస్‌ పాలసీ తీసుకురావాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. 

ప్రస్తుతం ఇదీ పరిస్థితి.. 
ఇతర రాష్ట్రాల్లో కనిష్టంగా ఎకరం స్థలం ఉంటేనే ఫాంహౌస్‌ల నిర్మాణానికి అనుమతిస్తుండగా తెలంగాణలో మాత్రం 100, 200 గజాలలో కూడా ఫాంహౌస్‌లను కట్టి, విక్రయిస్తున్నారు. లేఅవుట్‌లకు అనుమతిచ్చిన తరహాలో హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, పంచాయతీలకు ఫాంహౌస్‌ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చే అధికారం లేకపోవడంతో బిల్డర్లు అక్రమబాట పడుతున్నారు. వినియోగదారులకు గజాల చొప్పున కాకుండా గుంటల లెక్కన రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.

మొక్కలు, పండ్లు, కూరగాయల పెంపకం పేరుతో ఫాంహౌస్‌లను నిర్మించి కస్టమర్లు వీకెండ్‌లో గడిపేందుకు క్లబ్‌హౌస్‌లను నిర్మిస్తున్నారు. వ్యవసాయం కోసం ట్రాన్స్‌ఫార్మర్‌ తీసుకొని క్లబ్‌హౌస్‌లకు వినియోగిస్తున్నారు. బిందు సేద్యంతో తోటల పెంపకం చేపడుతున్నారు. వినియోగదారుల నుంచి నెలవారీ నిర్వహణ చార్జీలను వసూలు చేస్తూ ఫాంహౌస్‌ లేఅవుట్‌ల నిర్వహణ చేపడుతున్నారు. కానీ చట్ట ప్రకారం మాత్రం ఆయా ఫాంహౌస్‌ ప్లాట్లను ప్రభుత్వం వ్యవసాయ భూములుగానే పరిగణనలోకి తీసుకుంటోంది.

నగరం నలువైపులా. 
ప్రస్తుతం రాష్ట్రంలో భవన, లేఅవుట్‌ల నిబంధనల ప్రకారం కన్వర్షన్, బయో కన్వర్షన్‌ జోన్లలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదు. చిన్న సైజు నివాస నిర్మాణానికైనా భూ వినియోగ మార్పిడి సర్టీఫికెట్‌ తప్పనిసరి. మొయినాబాద్, చిలుకూరు, చేవెళ్ల, గండిపేట, మోకిలా, శంషాబాద్, శంకర్‌పల్లి, కందుకూరు, కడ్తాల్, ఘట్‌కేసర్, భువనగిరి, శామీర్‌పేట, మేడ్చల్‌ వంటి నగరం నలువైపులా ఔటర్, ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాంతాలకు చేరువలో ఇబ్బడిముబ్బడిగా అక్రమ ఫాంహౌస్‌లు నిర్మితమవుతున్నాయి. 

ఫాంహౌస్‌ నిబంధనలివీ.. 
కొత్తగా అమలులోకి రానున్న ఫాంహౌస్‌ పాలసీ ప్రకారం.. ఫాంహౌస్‌లను నిర్మించుకోవాలంటే కనిష్టంగా 1,200 చదరపు గజాల స్థలం ఉండాలి. 30 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డు తప్పనిసరి. మొత్తం స్థలంలో కేవలం 20 శాతం మాత్రమే కాంక్రీట్‌ నిర్మాణానికి అనుమతి ఇస్తారు. అంటే 1,200 గజాల ప్లాట్‌లో 240 గజాల విస్తీర్ణంలో జీ+1 భవన నిర్మాణానికి అనుమతి ఉంటుంది. మిగిలిన స్థలంలో వ్యవసాయంతోపాటు మొక్కలు, పండ్లు, కూరగాయల వంటి తోటల పెంపకం చేసుకొనే వీలుంటుంది. అలాగే భవనం ఎత్తు 6 మీటర్లకు మించకూడదు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement