కంటిపాపను కాటేసిన కామోన్మాదులు | Humiliating incident in vijayawada | Sakshi
Sakshi News home page

కంటిపాపను కాటేసిన కామోన్మాదులు

Feb 21 2026 4:44 AM | Updated on Feb 21 2026 4:44 AM

Humiliating incident in vijayawada

కుమార్తెపై మూడు నెలలుగా కన్నతండ్రి లైంగికదాడి  

ఇదే అదునుగా అర్ధరాత్రి వేళల్లో మేనమామ అఘాయిత్యం  

విజయవాడ జక్కంపూడి కాలనీలో అమానుషం  

స్నేహితురాలు, టీచర్‌ సాయంతో విషయం వెలుగులోకి   

మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టేవారని వెల్లడి

చిట్టినగర్‌ (విజయవాడ పశ్చిమ): కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి మానవ మృగంలా ప్రవర్తించాడు. చీకటి పడగానే కామపిశాచిలా మారిపోయి సొంత కుమార్తెపైనే కొన్నేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇదే అదునుగా మేనమామ కూడా అర్ధరాత్రి వేళ బాలికపై లైంగికదాడికి పాల్పడేవాడు. కొన్నేళ్లుగా విజయవాడ జక్కంపూడి కాలనీలో సాగుతున్న ఈ దారుణ కీచకపర్వం బాధితురాలి స్నేహితురాలు, ఓ టీచర్‌ చొరవతో వెలుగుచూసింది. కామోన్మాదులు ఇద్దరికీ స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 

సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఈ అమానుష ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు రోడ్డు ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కొన్నేళ్ల కిందట జక్కంపూడి కాలనీకి వలస వచ్చింది. ఆ దంపతులకు ఓ ఆడపిల్ల సంతానం. భర్త పని చేయగా వచ్చిన డబ్బులతో మద్యం తాగి ఇంటిని పట్టించుకోకపోవడంతో భార్య వేరుగా వెళ్లిపోయింది. అప్పటి నుంచి బాలిక తండ్రి వద్దే ఉండిపోయింది. ఆ పాప ఆలనాపాలన స్థానికులతోపాటు మేనత్త చూసుకోవడంతో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటోంది. 

ఈ క్రమంలో రోజూ మద్యం తాగి ఇంటికి వస్తున్న తండ్రి కన్ను బాలికపై పడింది. ఆ బాలిక తండ్రి మూడు నెలల క్రితం చెల్లెలు వరసయ్యే బావమరిది భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె వారుంటున్న ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోయింది. అప్పటి నుంచి మూడు నెలలుగా బాలికపై తండ్రి లైంగికదాడికి పాల్పడేవాడు. విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించేవాడు. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత అర్ధరాత్రి రెండు గంటల తర్వాత మేనమామ ఇంటికి వచ్చి బాలికపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. 

చీకటి పడేసరికి భయకంపితురాలు కావడంతో 
రోజూ చీకటి పడేసరికి బాలిక కంగారుపడడం, భయం భయంగా ఉండడంతో  అదే బ్లాక్‌లో నివసిస్తున్న స్నేహితురాలికి అనుమానం వచ్చి ఆరా తీసింది. దీంతో తనపై జరుగుతున్న అమానుషాన్ని బాధితురాలు చెప్పుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. వెంటనే ఆ స్నేహితురాలు గురువారం సాయంత్రం స్కూల్‌ టీచర్‌కు విషయం చెప్పడంతో ఆమె వెంటనే కృష్ణలంకలో ఉన్న సీడబ్ల్యూసీ అధికారులకు సమాచారం అందించారు. వారు శుక్రవారం ఉదయం జక్కంపూడి కాలనీకి వచ్చి బాలికను ప్రశ్నించగా, జరిగిన విషయం వాస్తవమేనని తేలింది. 

విషయం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో తమ మధ్యే ఉన్న మానవ మృగాలు తండ్రి, మేనమామకు దేహశుద్ధి చేశారు. ఇంతలో కొత్తపేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాలిక తండ్రిని, మేనమామను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బాలికను ప్రజ్వల హోమ్‌కు తరలించారు. కొత్తపేట సీఐ కొండలరావు బాలిక నుంచి రిపోర్టు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement