ఇద్దరు క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకుల అరెస్ట్‌ | Two cricket betting operators arrested | Sakshi
Sakshi News home page

ఇద్దరు క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకుల అరెస్ట్‌

Feb 21 2026 4:32 AM | Updated on Feb 21 2026 4:32 AM

Two cricket betting operators arrested

స్వాదీనం చేసుకున్న నగదు, వస్తువులు పరిశీలిస్తున్న ఎస్పీ, ఏఎస్పీ తదితరులు

బ్యాంకు ఖాతాల్లోని రూ.1.64 కోట్లు సీజ్‌ 

రూ.34.65 లక్షల నగదు, రెండు కత్తులు స్వాదీనం 

నెల్లూరు (క్రైమ్‌): ఆన్‌లైన్‌ యాప్‌లలో ఇన్వెస్ట్‌ చేస్తే అధికలాభాలు వస్తాయని నమ్మించి మోసగించారని అందిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు బెట్టింగ్‌ నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు. తీగ లాగితే డొంక కదిలిన చందాన క్రికెట్‌ బెట్టింగ్‌ వెలుగులోకి వచ్చింది. ఎస్పీ అజిత వేజెండ్ల శుక్రవారం వివరాలు వెల్లడించారు. నెల్లూరు ఎన్‌టీఆర్‌ నగర్‌కు చెందిన ఓ వ్యాపారికి బుచ్చిరెడ్డిపాళెం రామకృష్ణానగర్‌కు చెందిన కె.వేణుగోపాల్‌తో పరిచయమైంది. ఆయన ఆన్‌లైన్‌ యాప్‌లలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు. 

అతని మాటలు నమ్మిన వ్యాపారి పలుమార్లు ఆ యాప్‌లో రూ.53 లక్షలు డిపాజిట్‌ చేశారు. రోజులు గడుస్తున్నా ఆదాయం రాకపోవడంతో వేణుగోపాల్‌ను బాధితుడు సంప్రదించగా కాలయాపన చేయడంతోపాటు ఇటీవల బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు బాలాజీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.సాంబశివరావు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. గురువారం రాత్రి బుచ్చిరెడ్డిపాళెంలోని ఇంటిపై దాడి చేసి వేణుతోపాటు అక్కడే ఉన్న బి.వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు. 

వారిని విచారించగా క్రికెట్‌ బెట్టింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వేణుగోపాల్‌ అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు కలిసి రాధే ఎక్స్చేంజ్‌ యాప్‌ (ఆర్‌777) ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు, వెంకటరమణ బెట్టింగ్‌ తాలుకు నగదును తీసుకుని జూదరులకు ఇస్తున్నట్లు వెల్లడైంది. ఎవరైనా బెట్టింగ్‌ విషయంలో గొడవ చేస్తే కత్తులతో చంపుతామని నిందితులు బెదిరిస్తున్నట్లు తెలిసింది. వ్యాపారికి చెందిన నగదును సైతం నిందితులు బెట్టింగ్‌లో పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. 

క్స్చేందీంతో పోలీసులు వేణుగోపాల్, వెంకటరమణను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.34,65,800 నగదు, ల్యాప్‌టాప్, టీవీ, 13 మొబైల్స్, రెండు కత్తులను స్వా«దీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లోని రూ.1,64,74,600.60 నగదును సీజ్‌ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని ఎస్పీ వెల్లడించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ సీహెచ్‌ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement