పిప్పీ.. డుం డుం.. | Wedding Season Begins in the City as Auspicious Dates Return After Three Months | Sakshi
Sakshi News home page

పిప్పీ.. డుం డుం..

Feb 24 2026 9:21 AM | Updated on Feb 24 2026 9:21 AM

Wedding Season Begins in the City as Auspicious Dates Return After Three Months

వరుస శుభముహూర్తాలే

 ఒక్కటి కానున్న వేలాది జంటలు

ఫంక్షన్‌ హాళ్లకు భారీగా డిమాండ్‌

నగరంలో పెళ్లిసందడి మొదలైంది.. వరుస ముహూర్తాలతో పెళ్లిబాజాలు మోగుతున్నాయి. దీంతో వేలాది కొత్త జంటలు ఒక్కటి కానున్నాయి. మూడు నెలలుగా ఉన్న మూఢాలు తొలగిపోయి.. తిరిగి శుభ ముహూర్తాలు ప్రారంభమయ్యాయి.. దీంతో ఎంతో కాలంగా ఒక్కటవ్వాలని భావిస్తున్న వధూవరులకు మళ్లీ మంచి రోజులతోపాటు పెళ్లి బాజాలు మోగే సమయం ఆసన్నమైంది.. వేలాది జంటలతో.. వరుస ముహూర్తాలతో వివాహ వేదికలు, కళ్యాణ మండపాలు సందడిగా మారాయి.  

ఈనెల 17తో శుక్రమౌఢ్యమి అమావాస్య ముగిసింది. మూడు నెలల తర్వాత ముహూర్త బలం పెరిగింది. నగరంలోని ఫంక్షన్‌ హాళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, బాంక్వెట్‌ హాళ్లకు ముందస్తు బుకింగ్‌లతో ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. వేద మంత్రాలు ఉచ్చరించే పంతుళ్లు, బాజాభజంత్రీలు, స్టేజ్‌ డెకరేషన్‌ వర్కర్లు, వంట మనుషులు, సర్వీసు బాయ్స్, కేటరర్స్, ఈవెంట్‌ మేనేజర్లకు చేతినిండా పని దొరికింది. డిసెంబర్‌ నుంచి ముహూర్తాలు లేకపోవడంతో శుభ కార్యాలు నిలిచిపోయాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలను వాయిదా వేసుకోవాల్సి వచి్చంది. దీంతో నిన్న మొన్నటి వరకు ఖాళీగా కనిపించిన వాళ్లంతా ప్రస్తుత శుభ ముహూర్తాలతో బిజీగా మారారు.  

మార్చిలో పండుగలు  
మార్చి 2న కామదహనం, 3న హోలీ, 19న ఉగాది, 27న శ్రీరామ నవమి పండుగలు ఉన్నాయి. మార్చి 27 నుంచి మే 14 వరకు మంచి లఘ్నాల ఉన్నాయి. మే 17 నుంచి జూన్‌ 15 వరకు అధిక జ్యేష్ట మాసం ఉన్నందున శుభ కార్యాలు చేయొద్దని పండితులు చెబుతున్నారు. తిరిగి జూన్‌ 17 నుంచి జూలై 9వ తేదీ వరకు నిజ జ్యేష్ట మాసంలో మంచి రోజులు ఉన్నందున శుభకార్యాలు చేసుకోవచ్చని పండితులు పేర్కొంటున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement