సమ్‌థింగ్ స్పెషల్
‘నువ్వు నాకు ఆటోడ్రైవింగ్ నేర్పించాలిరా కన్నా’ అని కుమారుడిని అడిగింది మంగళ. ‘ఈ సరదా ఏమిటి!’ ఆశ్చర్యంగా అడిగాడు కుమారుడు. ‘సరదా కోసం కాదు, ఆటో నడిపి నాలుగు డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను’ అని చెప్పింది తల్లి. మనసులో ఏమనుకున్నాడో తెలియదుగానీ, తల్లి కోరినట్లే ఆటో నడపడం నేర్పించాడు కుమారుడు. పదిహేను రోజుల్లో పర్‌ఫెక్ట్‌గా ఆటోనడపడం నేర్చుకుంది మంగళ. ఆ తరువాత ఆటోరిక్షా డ్రైవర్‌గా కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. మహారాష్ట్ర సతార జిల్లాలో కరాడ్–ఉండాలే రోడ్డులో రోజూ ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆటో నడుపుతుంది.
నెలకు అయిదు నుంచి ఏడు వేల వరకు సంపాదిస్తుంది. ఇది తక్కువ మొత్తమే కావచ్చు. ఆమెకు మాత్రం కోట్లతో సమానం! ఎందుకంటే ఆ డబ్బులో శ్రమ ఫలం ఉంది. ఆత్మగౌరవం ఉంది. ‘నేను చాలారోజులు ఇంట్లోనే ఉన్నాను. దీని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు అనిపించింది. ఏదో ఒక పని చేయాలనుకున్నాను. నా కొడుకు ్రపోత్సాహంతో ఆటో నడపడం నేర్చుకున్నాను. ఇంటి ఖర్చులకు, నా వైద్య అవసరాలకు నేను సంపాదించిన డబ్బు ఉపయోగపడుతుంది. డ్రైవింగ్ అంటే నాకు ఇష్టం కాబట్టి, ఎలాంటి భయం ఉండదు. ఇతర డ్రైవర్లు నన్ను గౌరవంగా చూస్తారు. ముందు అమ్మను వెళ్లన్విండి అంటారు’ అని ఆసందంగా చెబుతోంది 65 సంవత్సరాల మంగళ.


