మహారాష్ట్రలో ముస్లిం కోటా రద్దు | Maharashtra government cancels 5 pc Muslim quota in jobs and education | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో ముస్లిం కోటా రద్దు

Feb 19 2026 6:37 AM | Updated on Feb 19 2026 9:36 AM

Maharashtra government cancels 5 pc Muslim quota in jobs and education

ఫడ్నవీస్‌ సర్కారు నిర్ణయం

ముంబై: మహారాష్ట్రలో విద్య, ఉద్యోగా వకాశాల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వే షన్లను బీజేపీ సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వం బుధవారం రద్దు చేసింది. 2014లో కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రిజర్వేషన్లు వాస్తవానికి ఎప్పుడూ అమలు కాలేదు. రాష్ట్రంలో ముస్లింలకు స్పెషల్‌ బ్లాక్‌వర్డ్‌ క్లాస్‌–ఏ (ఎస్‌బీసీ–ఏ) కేటగిరీ కింద ముస్లింలకు 5 శాతం రిజర్వేష న్లు కల్పిస్తూ నాటి ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చింది. కానీ అది చట్టరూపం దాల్చలేదు. దాంతో ఆ రిజర్వేషన్లకు ఎప్పుడో కాలదోషం పట్టింది. 

అయినా వాటిని లాంఛనంగా రద్దు చేస్తూ ఫడ్నవీస్‌ సర్కారు నిర్ణయం తీసుకోవడం విశేషం. అంతేగాక ఎస్‌బీసీ–ఏ కేటగిరీ కింద రాష్ట్రంలో ముస్లింలకు కుల, నాన్‌ క్రీమీలేయర్‌ సర్టిఫికెట్ల జారీని కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ముస్లిం రిజర్వేషన్ల అమలుపై 2014 నవంబర్‌లోనే బాంబే హైకోర్టు స్టే విధించింది. అయితే విద్యా సంస్థల్లో వాటిని అమలు చేసేందుకు మాత్రం అనుమతించింది. కానీ ఆ తర్వాత నెల రోజులకే ఆర్డినెన్స్‌ కాలపరిమితి ముగిసింది. దాంతో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కూడా అటకెక్కాయి. అయినా ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. కోర్టు కూడా ఆ రిజర్వేషన్లు చెల్లవని ప్రకటించింది.

భగ్గుమన్న విపక్షాలు
ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఫడ్నవీస్‌ సర్కారు నిర్ణయం ముస్లింలను ప్రధాన స్రవంతికి దూరం చేస్తుందంటూ కాంగ్రెస్‌ ఆందోళన వెలిబుచ్చింది. ముస్లింలు అంటే బీజేపీకి ఏ మాత్రం విలువ లేదని ఎన్సీపీ (ఎస్‌పీ), సమాజ్‌వాదీ పార్టీ విమర్శించాయి. ముస్లిం యువత ఏ రంగంలోనూ ఎదగరాదన్నదే బీజేపీ ఉద్దేశమని మజ్లిస్, ఆరోపించింది. 

Advertisement
 
Advertisement
Advertisement