హేతుబద్ధీకరణతోనే సర్దుబాటు
18 వేల ఖాళీలున్నట్టు గతంలో నివేదిక
రేషనలైజేషన్‌తో 10వేల మందిని సర్దుబాటు చేయొచ్చని అంచనా
విద్యాశాఖ తాజా నివేదిక
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బడులు, టీచర్ల హేతుబద్ధీకరణ నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయ నియామకాలు చేపట్టే అవకాశం కన్పించడం లేదు. పాఠశాల విద్య డైరెక్టరేట్ ఇటీవల ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. విద్యార్థులు ఎక్కువ ఉన్న చోట టీచర్లు తక్కువగా ఉన్నారని, టీచర్లు ఎక్కువగా ఉన్నచోట విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని నివేదికలో పేర్కొన్నారు. సర్దుబాటుతో ఈ సమస్యను పరిష్కరించవచ్చన్నారు. కొత్త నియామకాల విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. రాష్ట్రంలో 24,235 సర్కారు బడులుంటే వీటిల్లో ఎన్‌రోల్‌మెంట్ 16,57,812 మాత్రమే.
అయితే ఇదే బడుల్లో 1.06 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. 16 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 30 మంది విద్యార్థులకొక టీచర్ ఉండాలనేది విద్యాశాఖ లేవనెత్తుతున్న అంశం. రాష్ట్రంలో మంజూరైన టీచర్ పోస్టులు 1,25,583 ఉండగా, 18 వేలకుపైగా ఖాళీగా ఉన్నాయి. రేషనలైజేషన్ జరిగితే 10వేలకు పైగా టీచర్లను సర్దుబాటుతో సరిపెట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో కొత్త నియామకాల అవసరం లేదన్నది పాఠశాల విద్య డైరెక్టరేట్ నివేదిక సారాంశం.
దగ్గర్లోని స్కూళ్లలో కలిపేద్దాం
పది మంది విద్యార్థులకన్నా తక్కువ ఉన్న స్కూళ్లను కిలోమీటరు దూరంలో ఉన్న మరో ప్రభుత్వ స్కూల్‌లో కలిపేయాలని భావిస్తున్నారు. దీనివల్ల కొన్ని స్కూళ్లలో టీచర్ల కొరత తీరుతుందని చెబుతున్నారు. తక్కువ మంది విద్యార్థులున్న చోట స్కూల్ నడిపినా విద్యార్థులపై అంతగా శ్రద్ధ ఉండటం లేదని, విద్యార్థులు కూడా పెద్దఎత్తున గైర్హాజరు అవుతున్నారని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. విద్యార్థులు పది మంది కన్నా తక్కువ ఉన్న ప్రాథమిక, మాధ్యమిక బడులు వెయ్యి వరకూ ఉంటాయని గుర్తించారు. 19 లోపు విద్యార్థులున్న స్కూళ్లు 5,500 వరకూ ఉన్నాయి.
వెయ్యి ఉన్నత పాఠశాలల్లో 50 మంది కన్నా తక్కువే విద్యార్థులున్నారు. దీని ప్రకారం 8 వేల స్కూళ్లలో 16 వేల మంది అదనంగా టీచర్లు ఉన్నట్టు పాఠశాల విద్య డైరెక్టరేట్ చెబుతోంది. ఇదే క్రమంలో 3 వేల స్కూళ్లలో అనదంగా 4 వేల టీచర్ల అవసరం ఉందంటున్నారు. హేతుబద్దీకరణ ద్వారా పరిస్థితిని చక్కదిద్దవచ్చని భావిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికే ఈ పరిస్థితి మెరుగుపడుతుందని అధికారులు అంటున్నారు.
నిరుద్యోగులకు నిరాశ
‘టెట్’ఉత్తీర్ణులైన వారు రాష్ట్రంలో 4 లక్షల మందికిపైగా ఉన్నారు. గత ఏడాది 10 వేలకుపైగా టీచర్ పోస్టులను భర్తీ చేశారు. ఈ ఏడాది కూడా డీఎస్సీ ఉంటుందని నిరుద్యోగులు భావించారు. టీచర్ పోస్టుల కోసం కోచింగ్ కేంద్రాలను ఆశ్రయించి శిక్షణ పొందిన వాళ్లూ ఉన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగాలు మానేసి డీఎస్సీ కోసం శిక్షణ తీసుకుంటున్నారు. హేతుబద్దీకరణ నేపథ్యంలో కొత్త నియామకాలు చేపట్టే అవకాశం లేకపోవడంతో వారంతా నిరాశకు గురవుతున్నారు.


