మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ జోరు
66 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో విజయం
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, పాలమూరు జిల్లాల్లో మెరుగైన ఫలితాలు
2,995 వార్డులు, డివిజన్లకు గాను 1,530కి పైగా స్థానాల్లో గెలుపు.. మెదక్‌తో పాటు హైదరాబాద్ శివార్లలో బీఆర్‌ఎస్ దూకుడు
13 పురపాలికలు, 781 వార్డులు,డివిజన్లలో గెలుపొందిన గులాబీ పార్టీ
కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీజేపీకి మెజారిటీ
రాష్ట్రవ్యాప్తంగా 36 మున్సిపాలిటీలతో పాటు 4 కార్పొరేషన్లలో హంగ్
క్యాంపు రాజకీయాలకు లేచిన తెర
సాక్షి, హైదరాబాద్: పురపాలక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. మొత్తం 66 మున్సిపాలిటీలు, రామగుండం, నల్లగొండ, మంచిర్యాల కార్పొరేషన్లలో విజయకేతనం ఎగురవేసింది. మరో ఐదారు మున్సిపాలిటీలు, మరో కార్పొరేషన్‌ను కూడా దక్కించుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ రెండో స్థానంలో నిలిచింది.
ఆ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 13 పురపాలికల్లో విజయం సాధించింది. బీజేపీ, ఎంఐఎం విషయానికి వస్తే ఏ ఒక్క మున్సిపాలిటీలోనూ పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. అయితే కరీంనగర్ కార్పొరేషన్‌లో మంచి ఫలితాలు సాధించిన కమలం పార్టీ.. పీఠాన్ని సొంతంగా కైవసం చేసుకోవడంలో వెనుకబడింది.
ఇక దాదాపు 36 మున్సిపాలిటీలతో పాటు మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. ఎంఐఎం, సీపీఐ, సీపీఎం అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పలు వార్డు స్థానాల్లో విజయం సాధించారు. కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌తో తలపడిన సీపీఐ ఆ పార్టీకి దీటుగా విజయాలను సాధించినా మ్యాజిక్ ఫిగర్‌ను మాత్రం దక్కించుకోలేకపోయింది. ఇక అనూహ్యంగా గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) బలపర్చిన తెలంగాణ జాగృతి అభ్యర్థులు ఎక్కువ చోట్ల గెలుపొందడం గమనార్హం.
51 శాతం స్థానాల్లో స్పష్టమైన మెజారిటీ
మున్సిపాలిలు, కార్పొరేషన్ల పరిధిలోని వార్డులు, డివిజన్ల వారీగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సగం కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే విజయం సాధించింది. మొత్తం 2,996కు గాను 2,995 వార్డులు, డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో (మక్తల్‌లో అభ్యర్థి చనిపోవడంతో అక్కడ ఎన్నిక నిర్వహించలేదు) ఆ పార్టీకి 1,538 స్థానాలు లభించాయి. అంటే దాదాపు 51 శాతం వార్డులు, డివిజన్లలో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో (2020) కేవలం 580 వార్డులు, డివిజన్లను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్.. గతం కంటే ఏకంగా 900కు పైగా స్థానాలను అదనంగా దక్కించుకుంది.
బీఆర్‌ఎస్ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ 781 డివిజన్లు, వార్డుల్లో విజయం సాధించింది. అంటే మొత్తం వార్డులు, డివిజన్లలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి 26 శాతం స్థానాలు లభించాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో 1,767 స్థానాల్లో గెలుపొందిన గులాబీ పార్టీ ఈ ఎన్నికల్లో దాదాపు 1,000 స్థానాలను కోల్పోవడం గమనార్హం. అయితే రెండు సందర్భాల్లోనూ అధికార పార్టీలే మెరుగైన ఫలితాలు సాధించడం కూడా గమనించ వలసిన విషయం.

ఇక బీజేపీకి గత ఎన్నికల్లో 311 చోట్ల విజయం సాధించగా, ఈసారి ఆ పార్టీకి 3335 స్థానాలు దక్కాయి. అంటే మొత్తం వార్డులు, డివిజన్లలో 11.3 శాతం గెలుపొందింది. మరోవైపు సీపీఐ, సీపీఎం, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 331 (11.3 శాతం) చోట్ల విజయం సాధించారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే సీపీఎం, ఎంఐఎం స్థానాలు గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం.
రెండుచోట్ల మినహా కాంగ్రెస్ జోరు
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది. ఉమ్మడి ఖమ్మంలోని అన్ని మున్సిపాలిటీలనూ స్వీప్ చేయగా, నల్లగొండలో కేవలం ఒక్క మున్సిపాలిటీ మినహా 16 చోట్ల విజయ కేతనం ఎగురవేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మెజార్టీ స్థానాలు, కరీంనగర్ కార్పొరేషన్ మినహా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్‌న్‌ను దక్కించుకోగలిగింది.
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ మెరుగైన ఫలితాలే సాధించినప్పటికీ ఉమ్మడి మెదక్‌లో కొంత డీలా పడింది. ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల మున్సిపాలిటీల్లోనూ కొంత వెనుకబడింది.
ఇక్కడ గులాబీ పరిమళం
ఉమ్మడి మెదక్, హైదరాబాద్ శివార్లలో బీఆర్‌ఎస్‌కు సానుకూల ఫలితాలు రావడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆ పార్టీకి ఈ రెండు చోట్లనే ఎక్కువ స్థానాలు రాగా, 26 నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కొంచెం అటూ ఇటుగా అవే ఫలితాలు వచ్చాయి. అయితే అప్పటి ఎన్నికల తరహాలోనే గ్రామీణ తెలంగాణ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌కు ఫలితాలు రావడం గమనార్హం. కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు నారాయణపేట, నిర్మల్, ఖానాపూర్, కాగజ్‌నగర్ తదితర మున్సిపాలిటీలు, నిజామాబాద్, మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లలో ఆ పార్టీకి చెప్పుకోదగిన స్థానాలు లభించాయి.
కమలం పార్టీ విషయానికొస్తే ఈ ఎన్నికకల్లో నామమాత్రపు ప్రభావాన్ని మాత్రమే చూపగలిగింది. కొన్ని చోట్ల పార్టీ ఎమ్మెల్యేలున్నప్పటికీ ఓటమి చవి చూడాల్సి వచి్చంది. వార్డుల వారీగా వచి్చన సంఖ్యలో గతంతో పోల్చుకుంటే పెద్దగా మార్పు లేకపోవడం, పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలపడుతుందనే సంకేతాలు కరీంనగర్, నిజామాబాద్ మినహా పురపాలికల్లో పెద్దగా కనిపించకపోవడం గమనార్హం.
40 చోట్ల హంగ్!
గతంలో ఎన్నడూ లేని విధంగా 36 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. అంటే వీటిల్లో సొంతంగా ఎవరూ మేయర్, చైర్‌పర్సన్‌లను దక్కించుకునే అవకాశం లేదు. కొత్తగూడెం కార్పొరేషన్‌లో మ్యాజిక్ ఫిగర్‌కు 31 డివిజన్లు అవసరం కాగా, సీపీఐ, కాంగ్రెస్‌లకు చెరి 22 స్థానాలు మాత్రమే లభించాయి. ఇక నిజామాబాద్‌లో కూడా మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన 31 స్థానాల కంటే మూడు స్థానాలు వెనుకబడిన బీజేపీ 28 స్థానాలు దక్కించుకుంది. ఇక్కడ ఎంఐఎం (13), కాంగ్రెస్ (18)లకు కలిపి మ్యాజిక్ ఫిగర్ లభించడం గమనార్హం.
కార్పొరేషన్లలో ఇలా..
నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్‌నగర్, కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా 3 కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. నల్లగొండ, మంచిర్యాల, రామగుండం కార్పొరేషన్లలో మ్యాజిక్ ఫిగర్ సాధించిన ఆ పార్టీ అక్కడ మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయమైపోయింది.
సీపీఐతో హోరాహోరీ తలపడిన కొత్తగూడెంలో మ్యాజిక్ ఫిగర్‌కు 9 స్థానాలు తక్కువైనా ఆరుగురు ఇండిపెండెంట్లు గెలవడం, ఎంపీ, రాజ్యసభ సభ్యులు కూడా ఉండడం, అవసరమైతే ఎమ్మెల్సీలను కూడా ఎక్స్‌అఫీషియోలుగా రంగంలోకి దించడం, ఏదీ కుదరకపోతే సీపీఐతో స్నేహపూర్వక ఒప్పందం చేసుకుని పదవులు, పదవీకాలం పంచుకోవడం లాంటి వ్యూహాలతో మేయర్ పీఠంపై కూర్చునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది.
కరీంనగర్‌లో బీజేపీకి మెజార్టీ రావడంతో అక్కడ ఆ పార్టీ అభ్యర్థే మేయర్ కానున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా అయిన నిజామాబాద్‌లో ఎంఐఎం సహకారంతో మేయర్ కుర్చీ దక్కించుకునే దిశలో కాంగ్రెస్ పావులు కదుపుతోంది.
క్యాంపులు షురూ..!
ఏకంగా 40 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లలో హంగ్ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. ఈనెల 16వ తేదీ వరకు గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కాపాడుకోవాల్సి ఉండడంతో దాదాపు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అన్ని పార్టీలు క్యాంపులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
ఎక్స్‌అఫీషియో సభ్యుల నమోదుకు నేటి వరకు గడువు
మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా పేర్లు నమోదు చేసుకోవడానికి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులు. రాజ్యసభ సభ్యులు శనివారం సాయంత్రం లోగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. అలా నమోదు చేసుకున్నవారికే.. ఈనెల 16వ తేదీన నిర్వహించే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత ఉంటుంది.
కార్పొరేషన్లలో ఇలా..
నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్‌నగర్, కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో మూడు చోట్ల కాంగ్రెస్ గెలిచింది. నల్లగొండ, మంచిర్యాల, రామగుండంలో మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయమైంది. సీపీఐతో హోరాహోరీ తలపడిన కొత్తగూడెంలో మ్యాజిక్ ఫిగర్‌కు 9 స్థానాలు తక్కువైనా ఆరుగురు ఇండిపెండెంట్లు గెలవడం, ఎంపీ, రాజ్యసభ సభ్యులూ ఉండడం, అవసరమైతే ఎమ్మెల్సీలను కూడా ఎక్స్‌అఫీషియోలుగా రంగంలోకి దించడం, లేదంటే సీపీఐతో స్నేహపూర్వక ఒప్పందం చేసుకుని మేయర్ పీఠంపై కూర్చునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది.
కరీంనగర్‌లో బీజేపీకి మెజార్టీ రావడంతో అక్కడ ఆ పార్టీ అభ్యర్థే మేయర్ కానున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా అయిన నిజామాబాద్‌లో ఎంఐఎం సహకారంతో మేయర్ కుర్చీ దక్కించుకునే దిశలో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 31కి ఒక్క స్థానం దూరంలో ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం. పార్టీపై వారికి ఉన్న అపారమైన అభిమానానికి ఇది నిదర్శనం. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా సంపూర్ణ ఆమోదం తెలిపారు. - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ సామ, భేద, దాన, దండోపాయాలన్నీ ప్రయోగించినా ప్రజలమనసు గెలవలేకపోయింది. ఈ ఫలితాలు ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు స్పష్టమైన సంకేతం. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఇద్దరూ కలిసి రాజకీయాలు చేస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు అవసరమైతే లౌకిక శక్తులతో కలిసిపనిచేస్తాం - కేటీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీ గెలిచే అవకాశాలున్న చోట కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం కుట్ర పన్ని ఓడించాయి.ఈ మూడు పార్టీల మధ్య ఫెవిక్విక్ బంధం మరింత బలోపేతమైందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే తమ మనుగడకుప్రమాదమన్న అక్కసుతో మజ్లిస్, అర్బన్ నక్సలైట్లు, కమ్యూనిస్టులు వ్యూహాత్మకంగా ఓడించే ప్రయత్నం చేశారు. - రాంచందర్‌రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు


