మున్సిపాలిటీల్లో బీజేపీకి నిరాశాజనక ఫలితాలు.. పార్టీ బలంగా ఉందని భావిస్తున్న ఉత్తర తెలంగాణలోనూ అంతంతే..
ఓటమి కారణాలు, ప్రభావం చూపిన అంశాలపై విశ్లేషణ
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒకింత నిరాశాజనక ఫలితాలే వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లో పట్టున్న పార్టీగా మంచి ఫలితాలే సాధిస్తామని ఆ పార్టీ నేతలు ఆశించినా అది నెరవేరలేదని అంటున్నారు. మొత్తం 7 కార్పొరేషన్లలో కరీంనగర్, నిజామాబాద్ మేయర్ పీఠాలను, 116 మున్సిపాలిటీల్లో 15 నుంచి 20 దాకా చైర్‌పర్సన్ పదవులను సాధిస్తామని వేసుకున్న అంచనాలకు దగ్గరలో కూడా ఫలితాలు రాలేదని భావిస్తున్నారు.
ఉత్తర తెలంగాణలో దూకుడు చూపడంతోపాటు దక్షిణ తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో కనీసం ఒక్క డివిజన్‌లో గెలిచి బలాన్ని చాటుతామనుకున్న అంచనాలను అందుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 సీట్లలో 7, 8 ఎంపీ సీట్లలో మూడు, 3 ఎమ్మెల్సీ సీట్లలో 2 ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే గెలిచినందున... పుర ఎన్నికల్లో అక్కడ మంచి ప్రదర్శన కనబరుస్తామని భావించింది. అయితే ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ పీఠం మాత్రమే దక్కించుకోగలిగింది.
దక్షిణాన నామమాత్రమే...
దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీల్లో కనీసం ఒక్కసీటునైనా సాధించి ప్రాతినిధ్యం చాటుతామన్న కమలనాథుల ధీమా వాస్తవరూపం దాల్చలేదు. అదేవిధంగా కనీసం ఒక్క మున్సిపాలిటీనైనా కైవసం చేసుకుంటామన్న ఆశలు నెరవేరలేదు. మెదక్, నల్లగొండ జిల్లాల్లో నిరాశాజనక ఫలితాలు రాగా, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో ఆశించినస్థాయిలో వార్డులు, డివిజన్లను గెలవలేకపోయింది. ఏతావాతా చూస్తే... 2020 మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన ఫలితాలనే కొంచెం అటుఇటుగా ఈసారి కూడా సాధించినట్టయ్యింది. అయితే, గత ఎన్నికల్లో 15 శాతం ఓటింగ్ సాధించగా, 20 శాతం ఓట్ల నమోదు ద్వారా మెరుగైన ఫలితాలను సాధించామని ముఖ్యనేతలు అంచనా వేస్తున్నారు.
జాతీయ నాయకత్వం ధీమా
మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించే అవకాశాలున్నాయని జాతీయ నాయకత్వం కూడా విశ్వసించింది. ఈ ఎన్నికలకు అవసరమైన పూర్తి సహాయ, సహకారాలను అందజేసింది. ఎన్నికల ప్రచారాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మహబూబ్‌నగర్‌లో పెద్దఎత్తున ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రచారం నిర్వహించారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు భిన్నంగా... కాంగ్రెస్ సర్కార్‌పై చార్జీïÙట్ విడుదల చేసింది.. పురపోరు కోసమే ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా రూపొందించింది.
మోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో మున్సిపాలిటీల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని హామీనిచి్చంది. అయితే, ఇవేవీ ఆశించిన స్థాయిలో పట్టణప్రాంతాల ప్రజల ఓట్లను రాబట్టుకోవడంలో సఫలీకృతం కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, 49 మున్సిపాలిటీల్లో కనీసం ఒక్క డివిజన్, వార్డులోనూ గెలవకపోవడంతో కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయిందని అంటున్నారు.


