చలో కొలంబో! | Flight fares rise 50 Percent as fans head to Colombo for India-Pakistan match | Sakshi
Sakshi News home page

చలో కొలంబో!

Feb 14 2026 12:04 AM | Updated on Feb 14 2026 12:04 AM

 Flight fares rise 50 Percent as fans head to Colombo for India-Pakistan match

దాయాదుల పోరు.. విమాన చార్జీల జోరు

కొలంబో ఫ్లైట్‌ టికెట్‌ రూ.లక్ష.. 

కనెక్టింగ్‌ ఫ్లైట్‌ రూ.50 వేల నుంచి రూ.60 వేలు

అయినా తగ్గని అభిమానుల జోరు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అభిమానుల్లో భారత్‌–పాక్‌ మ్యాచ్‌ సెగలు పుట్టిస్తోంది. ఈ నెల 15న కొలంబో వేదికగా జరగనున్న ఈ హై–వోల్టేజ్‌ పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు నగరవాసులు క్యూ కడుతున్నారు. ఈ విపరీతమైన రద్దీని క్యాష్‌ చేసుకుంటూ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు చార్జీలను ఆకాశానికి ఎత్తేశాయి.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కొలంబోకు నేరుగా వెళ్లే విమానాల్లో టికెట్లు ఇప్పటికే హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. సాధారణ రోజుల్లో రూ.13,000 ఉండే రౌండ్‌ ట్రిప్‌ ధర.. ఇప్పుడు ఏకంగా రూ. లక్షకు చేరింది. డైరెక్ట్‌ ఫ్లైట్స్‌ దొరక్కపోవడంతో బెంగళూరు, చెన్నై మీదుగా వెళ్లే కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌ కోసం ప్రయాణికులు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు వెచ్చిస్తున్నారు.

పనిలో పనిగా పర్యాటక ప్రాంతాల సందర్శన
కేవలం క్రికెట్‌ కోసమే కాకుండా, శ్రీలంకలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు రియ­ల్టర్లు, వ్యాపారవేత్తలు, యువత పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. కొలంబోలోని 5–స్టార్‌ హోటళ్లు ఇప్పటికే నిండిపోగా, ఇండిగో, ఎయిర్‌ ఇండియా వంటి సంస్థలు రద్దీ దృష్ట్యా ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి.

క్యాండీ వంటి సుందర ప్రదేశాలు, క్యాసినోల సందడికి తోడు ‘దాయాదుల పోరు’ కూడా తోడవ్వడంతో శ్రీలంక పర్యాటకం ఒక్కసారిగా కళకళలాడుతోంది. మ్యాచ్‌ టికెట్‌ దొరకడం ఒక ఎత్తైతే.. కొలంబో ఫ్లైట్‌ ధర భరించడం మరో ఎత్తు! అయినా సరే, మైదానంలో టీమ్‌ ఇండియాకు మద్దతు తెలప­డానికి ఫ్యాన్స్‌ ఏమాత్రం వెనకాడటం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement