దేశంలో 40% మందిలో ఫ్యాటీ లివర్‌! | Study Reveals 40 percent Indians Have Fatty Liver Disease | Sakshi
Sakshi News home page

దేశంలో 40% మందిలో ఫ్యాటీ లివర్‌!

Feb 14 2026 12:18 AM | Updated on Feb 14 2026 12:18 AM

Study Reveals 40 percent Indians Have Fatty Liver Disease

విస్మయకర గణాంకాలు బయటపెట్టిన లాన్సెట్‌ నివేదిక

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌:  దేశంలో కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. దాదాపు 40 శాతం మంది భారతీయులు ప్రస్తుతం ఫ్యాటీ లివర్‌ (కొవ్వు పేరుకుపోయిన కాలేయం) సమస్యను ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. భారతీయులలో తక్కువ బరువు ఉన్నప్పటికీ పొత్తికడుపు భాగంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోయి ఉంటోందని.. ఇది శరీరంలో ఇన్సులిన్‌ నిరోధకతకు దారితీస్తోందని నివేదిక పేర్కొంది. మద్యపానం అలవాటు లేని వారిలోనూ ఈ వ్యాధి కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

అధ్యయనంలో తేలిన అంశాలివీ..
లాన్సెట్‌ (ఆగ్నేయాసియా) జర్నల్‌లో ప్రచురితమైన ఫెనోమ్‌ ఇండియా అధ్యయనం ప్రకారం.. దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్‌ నుంచి 2024 జూన్‌ మధ్య 27 నగరాల్లో జరిపిన పరిశోధనలో సుమారు 38.9 శాతం మందిలో ఆల్కహాల్‌తో సంబంధం లేని మెటబాలిక్‌ డిస్‌ఫంక్షన్‌–అసోసియేటెడ్‌ స్టీటోటిక్‌ లివర్‌ డిసీజ్‌ (ఎంఏఎస్‌ఎల్‌డీ) ఉన్నట్లు తేలింది. కాలేయం గట్టిపడటం లేదా మచ్చలు పడటం (ఫైబ్రోసిస్‌) ముప్పు సాధారణ వ్యక్తుల్లో 1.7% మందిలో ఉంది. ఇప్పటికే ఎంఏఎస్‌ఎల్‌డీ సమస్య ఉన్నవారిలో లివర్‌ ఫైబ్రోసిస్‌ 6.3 శాతం మందిలో.. అంటే దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మొత్తంగా 2.4 శాతం మందిలో ఫైబ్రోసిస్‌ లక్షణాలు కనిపించాయి. 

సైలెంట్‌ కిల్లర్‌..
గతంలో నాన్‌–ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌గా పిలిచే ఈ సమస్యను ఇప్పుడు ఎంఏఎస్‌ఎల్‌డీగా పిలుస్తున్నారు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఈ సమస్య ఉన్న వారిలో చాలా మందికి తమ కాలేయం దెబ్బతింటోందనే విషయం ప్రాథమిక దశలో తెలియదు. ఈ వ్యాధి కాలేయాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఎంఏఎస్‌ఎల్‌డీ కాలేయాన్ని మాత్రమే ప్రభావితం చేయదు. టైప్‌–2 డయాబెటిస్, గుండెజబ్బులు, మూత్రపిండాల సమస్యలకు దారితీస్తోంది. దేశ జనాభాలో గణనీయమైన శాతం మందిలో లివర్‌ ఫైబ్రోసిస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది కాలేయం గట్టిపడే (స్కారింగ్‌) ప్రక్రియకు ప్రారంభ దశ. 

దీన్ని గమనించకుండా నిర్లక్ష్యం చేస్తే అది కాలక్రమేణా కాలేయం పూర్తిగా దెబ్బతినే సిర్రోసిస్‌ లేదా ప్రాణాంతక కాలేయ కేన్సర్‌కు దారితీసే ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దేశ జనాభా విస్తృతిని, వేగంగా పెరుగుతున్న మధుమేహం, స్థూలకాయం కేసులను పరిగణనలోకి తీసుకుంటే ఫ్యాటీ లివర్‌ రోగుల స్థాయి ఆందోళనకరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మధుమేహం, స్థూలకాయం, రక్తపోటు వంటి జీవక్రియ సంబంధిత సమస్యలే ఫ్యాటీ లివర్‌కు ప్రధాన మూలాలని పరిశోధకులు స్పష్టం చేశారు. సరైన జీవనశైలి, పౌష్టికాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా దీనిని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement