కాంగ్రెస్‌ ఫుల్‌ జోష్‌ | Congress Grand Victory In Municipal Election Result: Telangana | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఫుల్‌ జోష్‌

Feb 14 2026 4:36 AM | Updated on Feb 14 2026 4:36 AM

Congress Grand Victory In Municipal Election Result: Telangana

అంచనాలకు తగిన ఫలితాలతో నేతల్లో ఉత్సాహం

పార్టీ పనితీరు, ‘సంక్షేమం’ మంచి ఫలితాన్నిచ్చాయనే అభిప్రాయం 

ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు ఆరా తీసిన సీఎం

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ అంచనాలకు తగినట్టుగానే ఆధిక్యత సాధించడంతో అధికార కాంగ్రెస్‌లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 26 నెలల తర్వాత, 2024 పార్లమెంటు ఎన్నికల అనంతరం పార్టీ గుర్తులపై జరిగిన ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంపై నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.   

పనితీరుతోనే మన్ననలు 
ఈ ఎన్నికల్లో పట్టణ ఓటర్ల మనసును గెలుచుకోవడానికి పార్టీ పనితీరే కారణమని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా గత 26 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లో విశ్వా సం పెరిగిందని అంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో పాటు సన్నబియ్యం, రేషన్‌కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లాంటి పథకాలు ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కీలకపాత్ర పోషించాయని, సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పకడ్బందీగా సాగిన ఎన్నికల ప్రచారం, వ్యూహాల అమలు కూడా ఫలితాన్నిచ్చాయని పేర్కొంటున్నారు.  

మంత్రుల నియోజకవర్గాల్లో స్వీప్‌ 
రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తోన్న వారందరి సొంత నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం గమనార్హం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్, మద్దూరు, కోస్గి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిధిలోని మధిరతో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్‌నగర్, నేరేడుచర్ల), దామోదర రాజనర్సింహ (ఆంథోల్‌), వాకిటి శ్రీహరి (మక్తల్‌), సీత క్క (ములుగు), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (ఏదులాపురం), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (మంథని), అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ (ధర్మపురి), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్‌), వివేక్‌ (చెన్నూరు), పొన్నం ప్రభాకర్‌ (హుస్నాబాద్‌)లలో కాంగ్రె స్‌ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ దక్కించుకుంది. మంత్రులు అజహరుద్దీన్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల మున్సిపల్‌ ఎన్నికలు జరగలేదు. 

వాటి కోసం స్వతంత్రుల సాయం 
సొంతంగా మ్యాజిక్‌ ఫిగర్‌ రాని ఐదు చోట్ల స్వతంత్రుల సాయంతో గెలిచేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. గద్వాల, వేములవాడల్లో ఇద్దరు చొప్పున ఇండిపెండెంట్లు, మొయినాబాద్, బెల్లంపల్లిలో ఐదుగురు, పరిగిలో ఇద్దరు స్వతంత్రుల సహకారంతో ఆయా మున్సిపాలిటీ లు, జగిత్యాలలో రెండు కాంగ్రెస్‌ వర్గాల మధ్య సయోధ్య కుదర్చడం ద్వారా పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు కచి్చతంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిస్తేనే మ్యాజిక్‌ ఫిగర్‌ రానున్న 10–12 స్థానాల్లో కూడా వీలున్న మున్సిపాలిటీలను స్థానిక పరిస్థితులను బట్టి తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్‌ నిమగ్నమైంది.  

ఆ రెండు కార్పొరేషన్లపై గురి 
మున్సిపల్‌ కార్పొరేషన్ల వారీగా పరిశీలిస్తే ముందు నుంచీ ఊహించినట్టుగానే నల్లగొండ, రామగుండం, మంచిర్యాల స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించింది. కొత్తగూడెంలో మిత్రపక్షమైన సీపీఐతో హోరాహోరీ తలపడింది. ఇక్కడ మేయర్‌ స్థానం దక్కించుకునేందుకు అవసరమైన 9 అదనపు ఓట్ల కోసం ఆ పార్టీ కసరత్తు ప్రారంభించింది. సీపీఐతో స్నేహపూర్వక ఒప్పందం కుదుర్చుకోవడమా లేదా స్వతంత్రులతో పాటు ఎక్స్‌ అఫీషియో సభ్యుల సహకారంతో కార్పొరేషన్‌ కైవసం చేసుకోవడమా అనే అంశాలను పరిశీలిస్తోంది. నిజామాబాద్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా ఏ పార్టీకి మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోవడంతో ఎంఐఎం మద్దతు తీసుకుని, నాలుగు లేదా ఐదు ఎక్స్‌ అఫిషియో ఓట్లతో ఆ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలపై దృష్టి పెట్టింది.  

ఢిల్లీ నుంచి సీఎం ఆరా 
ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడి నుంచే ఫలితాలపై ఆరా తీశారు. గెలిచిన చోట్ల ప్రజా ప్రతినిధులను, పార్టీ నేతలను అభినందించడంతో పాటు గెలుపునకు దగ్గరగా వచి్చన మున్సిపాలిటీలను చేజిక్కించుకోవడంపై చర్చలు జరిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షిలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఎక్స్‌ అఫీషియో ఓట్లు ఎక్కడ ఎన్ని అవసరమవుతాయో అంచనాలు వేశారు.  

కీలకంగా వార్‌ రూమ్‌ 
ఎన్నికల్లో పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేయడంలో కాంగ్రెస్‌ వార్‌ రూం కీలకంగా పనిచేసి సత్ఫలితాలు సాధించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మేనిఫెస్టోలు ప్రజల్లోకి వెళ్లిన తీరును గమనించడం బూత్‌ల వారీగా ప్రచారం సమన్వయం చేయడం, గడప గడపకూ సంక్షేమ పథకాలను చేరవేయడం, మహిళా సంఘాలు, అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించడం, క్లబ్బులతో సంప్రదింపులు జరపడం లాంటి కార్యక్రమాల ద్వారా వార్‌రూం కీలక పాత్ర పోషించిందని చెబుతున్నారు. పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ సమన్వయం చేసిన ఈ వార్‌రూంను పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి ముందుండి నడిపించారు.  

మిన్నంటిన సంబురాలు 
మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ విజయంతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. గాం«దీ భవన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. మాజీ ఎంపీ, సీనియర్‌ నేత వి.హన్మంతరావు, ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్, టీపీసీసీ ఉపాధ్యక్షులు కుమార్‌రావు, సంగిశెట్టి జగదీశ్వరరావు, పీసీసీ నేత అల్లం భాస్కర్‌ తదితరులు నృత్యాలు చేస్తూ, స్వీట్లు పంచుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement