కాంగ్రెస్, సీపీఐలకు సమానంగా 22 డివిజన్లు
8 డివిజన్లతో కింగ్‌మేకర్ పొజిషన్‌లో బీఆర్‌ఎస్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్‌లో హంగ్ ఏర్పడింది. దీంతో ఇక్కడ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలుగా ఉన్నా కొత్తగూడెం కార్పొరేషన్ సీట్ల పంపకాల విషయంలో రెండు పార్టీల మధ్య సర్దుబాటు కుదరలేదు. దీంతో కాంగ్రెస్ సీపీఎంతో జత కట్టి 58 స్థానాల్లో పోటీ చేసింది. చివరకు ఆ పార్టీ 22 డివిజన్లకే పరిమితం కాగా, మిత్రపక్షమైన సీపీఎం రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట గెలిచింది. ఆది నుంచీ చెబుతున్నట్టుగానే 22 స్థానాల్లో సీపీఐ గెలిచింది. 51 డివిజన్ నుంచి గెలిచిన అభ్యర్థి సీపీఐకి మద్దతుదారుగా ఉన్నారు.
కింగ్ ఎవరో?
కొత్తగూడెం కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉన్నాయి. మేయర్ పదవి దక్కించుకునేందుకు 31 డివిజన్లలో గెలవాలి. అయితే ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ చెరో 22 డివిజన్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీలుగా అవతరించినా సరిపడా మెజారిటీ సాధించలేకపోయాయి. అయితే కాంగ్రెస్ జోరుకు బ్రేక్ వేసేందుకు కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు.
ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కారద్యర్శి కూనంనేని సాంబశివరావుతో మాట్లాడినట్టు తెలిసింది. సీపీఐ 23 స్థానాలకు తోడు బీఆర్‌ఎస్ సభ్యులు 8 మంది తోడైతే మేయర్ పదవి సీపీఐ ఖాతాలో పడుతుంది. అయితే, బీఆర్‌ఎస్ ఆఫర్‌పై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సీపీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కొత్తగూడెం విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి సైతం కూనంనేనికి ఫోన్ చేసి సంప్రదింపులు జరిపినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే సీపీఐ– కాంగ్రెస్‌లు కలిసి అధికారం పంచుకునే వీలుంది.
కీలకంగా ఎక్స్‌అఫీషియో ఓట్లు
మిత్రపక్షమైన సీపీఎంతో కలిపి కాంగ్రెస్ బలం 23గా ఉంది. ఐదుగురు స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలెట్టింది. వారు కాంగ్రెస్ పక్షాన నిలిస్తే హస్తం ఖాతాలో 28 డివిజన్లు ఉంటాయి. మెజారిటీకి మరో మూడు ఓట్లు అవసరం పడతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగూడెం నుంచి ఎక్స్‌అఫీషియో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డిలతోపాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ రంగంలోకి దింపాల్సి ఉంటుంది.
అప్పుడు కాంగ్రెస్ మేజిక్ ఫిగర్‌ను చేరుకుంటుంది. అయితే, సీపీఐ, బీఆర్‌ఎస్ మధ్య పొత్తు చిగురించని పక్షంలోనే ఈ సమీకరణానికి చోటుంది. ఒక వేళ సీపీఐ అనుబంధ సభ్యుడు, ఒకరిద్దరు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు హస్తం వైపు మొగ్గు చూపినా కాంగ్రెస్‌కు మేయర్ పదవి దక్కించుకోవడం అంత సులువు కాదు. ఎక్స్‌అఫీషియో కోటాలో సీపీఐకి కూనంనేని సాంబశివరావుతో పాటు బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు ఓట్లు అండగా నిలిచే అవకాశముంది.
కొత్తగూడెం మేయర్ మాకే!
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మేయర్ స్థానం సీపీఐకి వచ్చే అవకాశం ఉందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఆయన శుక్రవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. దేశంలో మేయర్ స్థానం కమ్యూనిస్టులకు రావడం గొప్ప గౌరవమన్నారు. కమ్యూనిజంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. ఈ విజయం కార్మికులకు అంకితమని, తమ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకు ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. తమకు మద్దతు ఇస్తామని కేటీఆర్ ఫోన్‌లో హామీ ఇచ్చారని, కాంగ్రెస్ నుంచి ఇంకా ఎవరూ మాట్లాడలేదని వివరించారు.


