కాంగ్రెస్‌పై వ్యతిరేకతకు స్పష్టమైన సంకేతం | BRS Working President KTR on Municipal results | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌పై వ్యతిరేకతకు స్పష్టమైన సంకేతం

Feb 14 2026 5:42 AM | Updated on Feb 14 2026 5:42 AM

BRS Working President KTR on Municipal results

మున్సిపల్‌ ఫలితాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 

అన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల మనసు గెలవలేకపోయారు 

పట్టణాల్లో కూడా బీఆర్‌ఎస్‌నే ప్రధాన ప్రత్యామ్నాయంగా ఓటర్లు నిలబెట్టారు 

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు స్పష్టమైన సంకేతమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ‘సామ, భేద, దాన, దండోపాయాలు‘అన్నీ ప్రయోగించినా ప్రజల మనసు గెలవలేకపోయిందన్నారు. డబ్బు, మద్యం, అధికార యంత్రాంగ దురి్వనియోగం పరాకాష్టకు చేరినా ఓటర్లు భయపడలేదని స్పష్టం చేశారు. శుక్రవారం మున్సిపల్‌ ఫలితాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  

ఇది కాంగ్రెస్‌కు హెచ్చరిక 
‘123 చోట్ల ఎన్నికలు జరిగితే 15 స్థానాల్లో ప్రత్యక్షంగా గెలిచాం. 30 చోట్ల హంగ్‌ పరిస్థితి నెలకొన్నది. మరో 10–15 చోట్ల బీఆర్‌ఎస్‌ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే 117 స్థానాల్లో బలమైన ఫలితాలు సాధించాం. అధికారంలో లేని పార్టీగా ఇదే ప్రజాభిప్రాయం. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా అధికార పార్టీకి వన్‌సైడ్‌ అవుతాయి. మంచి పరిపాలన ఉంటే 80–90 శాతం స్థానాలు గెలుస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి ఉల్టా ఉంది. ఇది కాంగ్రెస్‌కు హెచ్చరిక. 

మొన్న పంచాయతీ ఎన్నికల్లో రెండేళ్లు కూడా నిండకముందే కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు. 4 వేల పైచిలుకు గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు గెలిచారు. ఇప్పుడు పట్టణాల్లో కూడా బీఆర్‌ఎస్‌నే ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలబెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గద్దె దించే శక్తి బీఆర్‌ఎస్‌కే ఉందని ఈ ఫలితాలు తేల్చాయి. హంగ్‌ వచ్చిన చోట్ల ఏ వైఖరి అవలంబించాలనే విషయంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో చర్చించి, స్థానిక నాయకత్వ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం..’అని కేటీఆర్‌ చెప్పారు. 

కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు 
‘రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఇద్దరూ కలిసి రాజకీయాలు చేస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు అవసరమైతే లౌకిక శక్తులతో కలిసి పనిచేస్తాం. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాతో కలిసి చెన్నూరు, క్యాతనపల్లి ప్రాంతాల్లో పోటీ చేసి విజయాన్ని సాధించాం. 

చాలామంది వచ్చారు..పోయారు 
నేనే రాజు, నేనే మంత్రి అనుకునే వారు చాలామంది వచ్చారు, పోయారు. ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేస్తే గాలి తీసుకుపోతుంది. ఇందిరాగాం«దీ, ఎన్టీ రామారావులనూ ఓడించిన దేశమిది. మీ ప్రభుత్వంపై అంత నమ్మకం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రండి. ప్రజల తీర్పే అసలు ఇండికేటర్‌..’అని కేటీఆర్‌ సవాల్‌ చేశారు. 

మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలు, ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై భవిష్యత్తులో పోరాటం మరింత తీవ్రం చేస్తామని అన్నారు. సింగరేణి కంపెనీలో రూ.6 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, దానిపై మేము పోరాడుతున్నామని చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement