యువహో.. ప్రీమియంకు జయహో | Trend towards bikes with higher engine capacity | Sakshi
Sakshi News home page

యువహో.. ప్రీమియంకు జయహో

Feb 19 2026 4:44 AM | Updated on Feb 19 2026 4:44 AM

Trend towards bikes with higher engine capacity

అధిక ఇంజిన్‌సామర్థ్యం కలిగిన బైక్‌లవైపు మొగ్గు

10 నెలల్లో రోడ్డెక్కిన 28,90,823 యూనిట్లు 

బైక్స్‌లో నాలుగింట ఒక వంతు వాటా వీటిదే 

ఖరీదైన వాహనాలను కోరుకుంటున్న యూత్‌ 

సియామ్‌ గణాంకాల్లో ఆసక్తికర అంశాలు

సాక్షి, స్పెషల్‌ డెస్క్ :  వాహనాల విషయంలో కస్టమర్ల ఆకాంక్షలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. సులభ వాయిదాల్లో చెల్లించే అవకాశాలు విస్తృతం అయ్యాయి. ఆకట్టుకునే మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. పైగా వినియోగదారులకు ఖర్చు చేయదగ్గ ఆదాయాలు పెరుగుతున్నాయి. ఇంకేముంది.. నచ్చిందే తడవుగా యువ కస్టమర్లు ప్రీమియం బైక్స్‌తో దూసుకుపోతున్నారు. భారతీయ ద్విచక్ర వాహన విపణి క్రమంగా అధిక ఇంజన్‌ సామర్థ్యం కలిగిన ప్రీమియం బైక్స్‌ వైపు మళ్లుతోంది. 

సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జనవరి కాలంలో రూ.80,000 ప్రారంభ ధర కలిగిన 125 సీసీ, అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల మోడళ్ల వాటా మొత్తం మోటార్‌ సైకిల్స్‌ మార్కెట్‌లో 26% చేరుకుంది. 2019–20లో ఇది 22.1% నమోదైంది. గత సెప్టెంబర్‌లో జీఎస్టీ సవరణతో ధరలు తగ్గడం కూడా ఈ వృద్ధికి దోహదపడింది.  

ప్రీమియమైజేషన్‌ వైపు.. 
భారత్‌లో 125 సీసీ, అంతకంటే ఎక్కువ ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న బైక్స్‌ వాటా ఈ స్థాయికి చేరుకోవడం ఆరేళ్లలో ఇదే అత్యధికం. 2024–25లో మొత్తం మోటార్‌సైకిళ్ల విక్రయాలలో ఈ సెగ్మెంట్‌ 24.4% వాటాను కలిగి ఉంది. జీఎస్టీ హేతుబద్దీకరణ తర్వాత మోటార్‌సైకిల్స్‌ విభాగం బలమైన రికవరీని చూసిందని రేటింగ్స్‌ ఏజెన్సీ క్రిసిల్‌ తెలిపింది. 125 సీసీ వరకు ఉన్న ఎంట్రీ–లెవల్‌ మోడల్స్‌ 73% వాటాతో మార్కెట్‌లో ఆధిపత్యం కొనసాగిస్తున్నప్పటికీ డిమాండ్‌ క్రమంగా 150–350 సీసీ శ్రేణి వైపు మళ్లుతోంది. ఏటా వృద్ధి చూస్తుంటే వినియోగదార్లకు ఇవి అందుబాటులో లభించడం, మారుతున్న ప్రీమియమైజేషన్‌ ధోరణిని ప్రతిబింబిస్తోంది.  

టాప్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. 
తయారీ కంపెనీల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్, టీవీఎస్‌ మోటార్‌ ఈ ప్రీమియమైజేషన్‌ ధోరణి ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందిన సంస్థలుగా అవతరించాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 125 సీసీ+ సెగ్మెంట్‌లో తన మార్కెట్‌ వాటాను 2019–20లో 27% నుంచి 2025–26 మొదటి తొమ్మిది నెలల్లో 32%కి పెంచుకుంది. జెఫరీస్‌ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం ఇదే కాలంలో టీవీఎస్‌ మోటార్‌ వాటా 15% నుంచి19%కి చేరింది. బజాజ్‌ ఆటో వాటా 32% నుంచి 22%కి తగ్గడం వల్ల ఈ రెండు సంస్థలు లాభపడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement