సరిగా చదువు చెప్పలేదు...  ‘కొవిడ్‌’ పరిహారం ఇవ్వండి! | Global University Students Demand Fair Compensation for Pandemic Disruptions | Sakshi
Sakshi News home page

సరిగా చదువు చెప్పలేదు...  ‘కొవిడ్‌’ పరిహారం ఇవ్వండి!

Feb 19 2026 4:16 AM | Updated on Feb 19 2026 8:47 AM

Global University Students Demand Fair Compensation for Pandemic Disruptions
  • బ్రిటన్‌ వర్సిటీలకు భారత విద్యార్థుల డిమాండ్‌
  • లేదంటే న్యాయపోరాటం చేస్తామంటూ నోటీసులు

లండన్‌: కరోనా సమయంలో తమకు సరైన విద్యా సేవలు అందించనందుకు బ్రిటన్‌కు చెందిన 36 యూనివర్సిటీలు పరిహారం చెల్లించాలని 20 వేల మంది విదేశీ విద్యార్థులు డిమాండ్‌ చేశారు. వారిలో 500 మందికి పైగా భారత విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ విషయంలో ‘స్టూడెంట్‌ గ్రూప్‌ క్లెయిం’ సంస్థ వారికి సాయపడుతోంది. స్వదేశీ విద్యార్థులను కూడా కలుపుకుని 2020–21 విద్యా సంవత్సరానికి గాను 1.7 లక్షల మందికి పరిహరం చెల్లించాలని సంస్థ డిమాండ్‌ చేసింది.

 ఈ మేరకు ఆయా వర్సిటీలకు తాజాగా నోటీసులు పంపింది. తక్షణం సరైన పరిహారం చెల్లించి పక్షంలో న్యాయపోరాటం తప్పదని హెచ్చరించింది. ‘‘ప్రత్యక్ష బోధన, వర్సిటీల్లోని లైబ్రరీలు, స్టూడియోల్లో అభ్యసన తదితరాలన్నింటికీ కలిపి విద్యార్థులు భారీగా ఫీజులు చెల్లించారు. కానీ కరోనా కారణంగా బోధన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరిగింది. దాంతో వారికి తీరని నష్టం వాటిల్లింది’’ అని ఆరోపించింది. 

రెగ్యులర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులతో పోలిస్తే బ్రిటన్‌లో ఆన్‌లైన్‌ కోర్సుల ఫీజులు 25 నుంచి 50 శాతం మేరకు తక్కువగా ఉంటాయి. కరోనా కారణంగా రెగ్యులర్‌ కోర్సులు కూడా ఆన్‌లైన్‌ తరహాలోనే సాగినందున ఆ మేరకు ఫీజును విద్యార్థులకు వెనక్కు ఇచ్చి ఉండాల్సిందన్నది ‘స్టూడెంట్‌ గ్రూప్‌’ వాదన. అన్ని ఖర్చులూ చుక్కలనంటిన కరోనా కాలంలో ఆ మొత్తాలు వారికి ఎంతగానో పనికొచ్చేవని ఆ సంస్థ గుర్తు చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement