ఎఫ్‌టీఏతో సువర్ణాధ్యాయం | Narendra Modi and European Union leaders concluded a historic Free Trade Agreement | Sakshi
Sakshi News home page

ఎఫ్‌టీఏతో సువర్ణాధ్యాయం

Feb 19 2026 6:16 AM | Updated on Feb 19 2026 6:16 AM

Narendra Modi and European Union leaders concluded a historic Free Trade Agreement

భారత్‌–ఈయూ సంబంధాలు మరింత బలోపేతం  

ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన  

స్పెయిన్, ఫిన్‌లాండ్, సెర్బియా, ఎస్తోనియా, కజకిస్తాన్, క్రొయేషియా అధినేతలతో సమావేశం  

కీలక రంగాల్లో పరస్పర సహకారంపై చర్చ   

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పెయిన్‌ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్, ఫిన్‌లాండ్‌ ప్రధాని పెటెరీ ఓర్పోతోపాటు సెర్బియా అధ్యక్షుడు అలెక్సాండర్‌ వుకిక్, ఎస్తోనియా అధ్యక్షుడు అలార్‌ కరీస్, కజకిస్తాన్‌ ప్రధానమంత్రి ఒల్జాస్‌ బెక్తెనోవ్, క్రొయేషియా ప్రధానమంత్రి అండ్రెజ్‌ ప్లెంకోవిక్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. 

భారత్‌–యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)తో భారత్‌–ఈయూ సంబంధాల్లో సువర్ణ అధ్యాయం ప్రారంభమైందని, దీంతో ఇరుపక్షాల సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు సందర్భంగా ఈ భేటీలు జరిగాయి. ఆయా దేశాల అధినేతలతో సమావేశం అనంతరం మోదీ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. స్పెయిన్‌ అధ్యక్షుడు సాంచెజ్‌తో ఫలవంతమైన సమావేశం జరిగినట్లు వెల్లడించారు. 

భారత్‌–స్పెయిన్‌ మధ్య ద్వైపాక్షిక అంశాలతోపాటు స్నేహ సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించామని తెలిపారు. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, అంతరిక్షం, పర్యాటకం, రక్షణ, టెక్నాలజీ తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారంపై అభిప్రాయాలు పంచుకున్నామని ఉద్ఘాటించారు. 2026వ సంవత్సరం భారత్‌–స్పెయిన్‌ భాగస్వామ్యానికి సాంస్కృతిక, పర్యాటక, కృత్రిమ మేధ(ఏఐ) సంవత్సరమని వివరించారు. ఇరుదేశాల ప్రజల మధ్య బంధం మరింత బలపడడం తథ్యమని చెప్పారు. 

స్పెయిన్‌ యూనివర్సిటీల నుంచి ప్రతినిధి బృందం భారత్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. భారత్‌–ఈయూ ఎఫ్‌టీఏ వల్ల స్పెయిన్‌తో ఆర్థిక భాగస్వామ్యంపై సానుకూల ప్రభావం కచ్చితంగా ఉంటుందని స్పష్టంచేశారు. ఇరుదేశాల ప్రజలకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. భారత్, ఈయూ మధ్య జనవరి 27న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీన్ని ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డీల్స్‌’గా ఇరుపక్షాలు అభివరి్ణస్తున్నాయి. భారత్‌తో బలమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని స్పెయిన్‌ అధ్యక్షుడు సాంచెజ్‌ స్పష్టంచేశారు. ఇంపాక్ట్‌ ఏఐ సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement