‘బంగ్లా’కు సహకరిస్తాం.. భారత్‌కు రండి’ | PM Modi invites Bangladeshs Tarique Rahman to India | Sakshi
Sakshi News home page

‘బంగ్లా’కు సహకరిస్తాం.. భారత్‌కు రండి’

Feb 18 2026 7:30 AM | Updated on Feb 18 2026 9:19 AM

PM Modi invites Bangladeshs Tarique Rahman to India

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రెహ్మాన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ ఆయనను భారత్‌కు ఆహ్వానించారు. మంగళవారం ఢాకాలో తారిఖ్ రెహ్మాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. భారత ప్రభుత్వ ప్రతినిధిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యయుతంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా ఓం బిర్లా నూతన ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన వ్యక్తిగత లేఖను ఆయనకు స్వయంగా అందజేశారు.

పొరుగు దేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత్ ఈ కీలక అడుగు వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తన లేఖ ద్వారా తారిఖ్ రెహ్మాన్‌ భారతదేశ పర్యటనకు రావాలని సాదరంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఓం బిర్లా తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొంటూ ‘ప్రధాని మోదీ పంపిన లేఖను రెహ్మాన్‌కు అందజేశాను. బంగ్లాదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇరు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని పునరుద్ఘాటించాను’ అని తెలిపారు. కాగా ఫిబ్రవరి 13నే మోదీ ఫోన్ ద్వారా రెహ్మాన్‌ను అభినందించారు. తాజా లేఖలో బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నట్లు సమాచారం.
 

ఫిబ్రవరి 12న జరిగిన సాధారణ ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్‌ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) మూడింట రెండొంతుల మెజారిటీతో ఘనవిజయం సాధించింది. సుమారు 17 ఏళ్ల పాటు లండన్‌లో ప్రవాస జీవితం గడిపిన రెహమాన్, ఎన్నికలకు ముందు స్వదేశానికి తిరిగి వచ్చి తన పార్టీని విజయపథంలో నడిపారు. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏర్పడిన ఆందోళనకర పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో ఈ ఎన్నికల విజయం ‍కీలకంగా నిలిచింది. ప్రస్తుతం షేక్ హసీనా భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు.

భారత్‌తో సంబంధాల విషయంలో తారిఖ్ రెహ్మాన్‌ స్పందించారు. తమ విదేశాంగ విధానం పూర్తిగా ‘బంగ్లాదేశ్ ఫస్ట్’ ఎజెండాపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలే తమకు అత్యున్నతమని, దాని ప్రకారమే పొరుగు దేశాలతో సంబంధాలు ఉంటాయని పేర్కొన్నారు. కాగా చారిత్రక, సాంస్కృతిక బంధాలు కలిగిన రెండు దేశాలు కలిసి పనిచేస్తే, ప్రాంతీయ సుస్థిరత సాధ్యమవుతుందని భారత్ ఆశిస్తోంది.

ఇది కూడా చదవండి: కమల్ హాసన్‌కు ‘టార్చ్ లైట్’.. ‘ఎంఎన్‌ఎం’లో ఉత్సాహం ఉరకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement