చర్చల అనంతరం మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు కార్లో కలిసి వెళ్తున్న మాక్రాన్, మోదీ
భారత్, ఫ్రాన్స్ నిర్ణయం
మాక్రాన్–మోదీ కీలక చర్చలు
21 ఒప్పందాలపై సంతకాలు
ముంబై: భారత్, ఫ్రాన్స్ సంబంధాల్లో నూతన శకానికి తెర లేచింది. అంతర్జాతీయంగా తీవ్ర అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. వాటిని ‘ప్రత్యేక ప్రపంచ స్థాయి వ్యూహత్మక భాగస్వామ్యం’గా తీర్చిదిద్దుకోవాలని నిశ్చయించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని నరేంద్ర మోదీ నడుమ జరిగిన చర్చల్లో ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది. రక్షణ, వర్తకం మొదలుకుని అరుదైన ఖనిజాల దాకా అన్ని రంగాల్లోనూ పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని నేతలు నిర్ణయించారు.
ఈ దిశగా రక్షణ, అత్యంత అధునాతన టెక్నాలజీ, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఆరోగ్యం తదితరాలకు సంబంధించి ఇరు దేశాల నడుమ 21 కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్, ఫ్రెంచి రక్షణరంగ దిగ్గజం సఫ్రాన్ సంయుక్తంగా భారత్‌లో హమ్మర్ క్షిపణుల తయారీ, భారత, ఇరుదేశాల సైన్యంలో పరస్పరం అధికారుల నియామకం తదితరాలు వీటిలో ఉన్నాయి. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచి్చన మాక్రాన్‌తో మంగళవారం సాయంత్రం మోదీ ముంబైలో సమావేశమయ్యారు. పలు అంశాలపై ఇరువురూ లోతుగా చర్చించారు. భారత్–ఫ్రాన్స్ ద్వైపాక్షిక బంధాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని తీర్మానించారు. అనంతరం మోదీ, మాక్రాన్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
కీలక భాగస్వామ్యం: మోదీ
ప్రపంచం ప్రస్తుతం అత్యంత అస్థిర దశ గుండా సాగుతోందని మోదీ అభిప్రాయపడ్డారు.ఈ పరిస్థితుల్లో స్థిరత్వ స్థాపనలో భారత్, ఫ్రాన్స్ భాగస్వామ్యం కీలకపాత్ర పోషించగలదని విశ్వాసం వెలిబుచ్చారు. ఫ్రాన్స్ నైపుణ్యం, భారత వనరులు ఒక్కతాటిపైకి వస్తే అద్భుతాలు జరుగుతాయన్నారు. ఇరుదేశాలదీ ఎలాంటి హద్దులూ లేని ఆదర్శ భాగస్వామ్యం. ఇరు దేశాల మధ్య మొదటినుంచీ ప్రత్యేక సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి’’అని చెప్పారు.
భారత్‌కు అత్యంత పురాతన వ్యూహాత్మక భాగస్వాముల్లో ఫ్రాన్స్ ఒకటని ఆయన గుర్తు చేశారు. ‘‘మాక్రాన్‌తో తాజా భేటీ ద్వారా ఈ బంధాన్ని ఎన్నడూ లేనంతగా ముందుకు తీసుకెళ్లాం. ఇరు దేశాలు పరస్పర విశ్వాసం, ఉమ్మడి విజన్‌తో కలసి సాగనున్నాయి. ఇది కేవలం వ్యూహాత్మక బంధం మాత్రమే కాదు. ప్రపంచ ప్రగతికి బాటలు పరిచే కీలక బంధం’’అని ప్రకటించారు. ఉగ్రవాదం కూడా మాక్రాన్‌తో చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచి్చనట్టు ప్రధాని తెలిపారు. దాన్ని అన్ని రూపాల్లోనూ తుదముట్టించేందుకు ఇరు దేశాలూ కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పారు.
సంస్కరణలతోనే సమాధానం
ఉక్రెయిన్, పశి్చమాసియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ఇతర చోట్ల యుద్ధ మేఘాలు ఇంకా తొలగలేదని మోదీ గుర్తు చేశారు. ‘‘ఈ కల్లోల పరిస్థితుల నుంచి గట్టెక్కించగలిగేది ప్రజాస్వామిక విలువలే అన్నదే భారత్, ఫ్రాన్స్ వైఖరి. ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థలను సమూలంగా సంస్కరించినప్పుడే ఈ అంతర్జాతీయ సవాళ్లకు సజావైన పరిష్కారాలు లభిస్తాయి ఆ ప్రయత్నాలకు భారత్, ఫ్రాన్స్ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాయి. ఎందుకంటే రెండు దేశాలూ బహుళ ధ్రువ ప్రపంచాన్నే కోరుతున్నాయి’’అని వివరించారు.
యూరోపియన్ యూనియన్‌తో భారత్ ఇటీవలే తన చరిత్రలోనే అతి పెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందని మోదీ గుర్తు చేశారు. అది భారత్, ఫ్రాన్స్ సంబంధాలకు కూడా ఎంతగానో ఊపునిచ్చే పరిణామమేనని ఆయన చెప్పారు. ‘‘ఇరు దేశాల ప్రజలు, కంపెనీలు ఇకపై రెండు పన్నులు కట్టాల్సిన దురవస్థ తప్పింది. పరస్పర వర్తకం, పెట్టుబడులు తదితరాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలకు ఈ ఒప్పందాలు సరికొత్త రోడ్‌మ్యాప్‌గా నిలిచాయి’’అన్నారు.
హెలికాప్టర్ నిర్మాణ కేంద్రం ప్రారంభం
కర్నాటకలోని వెమగల్‌లో ఎయిర్‌బస్ హెచ్125 హెలికాప్టర్ల నిర్మాణ కేంద్రాన్ని ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఇరుదేశాల మధ్య పరస్పరం నెలకొన్న లోతైన విశ్వాసానికి ఈ ప్లాంట్ ప్రారంభమే తాజా నిదర్శనమని మోదీ ఈ సందర్భంగా అన్నారు. ‘‘మౌంట్ ఎవరెస్టును మించిన ఎత్తుల్లో ఎగరగల సామర్థ్యమున్న ఏకైక హెలికాప్టర్‌ను ఇరుదేశాలూ కలిసి భారత్‌లో సంయుక్తంగా తయారు చేయనుండటం నిజంగా గర్వకారణం. వాటిని ప్రపంచమంతటికీ ఎగుమతి చేయనున్నాం’’అని ప్రకటించారు. ఈ హెలికాప్టర్ల తయారీ ప్లాంటు ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్, భారత్‌కు చెందిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ జాయింట్ వెంచర్
భారత్ అత్యంత విశ్వసనీయ భాగస్వామి: మాక్రాన్
ఫ్రాన్స్‌కు భారత్ అత్యంత విశ్వసనీయ భాగస్వామి అని మాక్రాన్ పేర్కొన్నారు. రఫేల్‌యుద్ధ విమానాలు మొదలుకుని జలాంతర్గాముల దాకా రక్షణ రంగంలో ఇరు దేశాల నడుమ పరస్పర సహకారం నానాటికీ పెంపొందుతోందని హర్షం వెలిబుచ్చారు. ఉగ్రవాదంపై పోరాటంలో కూడా భారత్, ఫ్రాన్స్ పరస్పరం మరింతగా సహకరించుకుంటాయని ప్రకటించారు. భారత్‌లో తనకు లభించిన అపూర్వ స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపారు. మాక్రాన్‌కు భారత్‌లో ఇది నాలుగో అధికారిక పర్యటన.
ఇన్నొవేషన్ల సారథి భారత్: మాక్రాన్
‘‘గ్లోబల్ ఇన్నొవేషన్‌లో భారత్ కేవలం భాగస్వామి కాదు. సిలికాన్ వ్యాలీ మొదలుకుని టెక్నాలజీ, సంస్కృతి దాకా అన్ని రంగాల్లోనూ సారథి స్థానంలో రాణిస్తోంది’’ అంటూ మాక్రాన్ ప్రశంసించారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా మోదీతో కలిసి ‘ఇండియా–ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నొవేషన్’ను ఆయన ఆవిష్కరించారు. ఇరుదేశాల భాగస్వామ్యాన్ని ప్రజల భాగస్వామ్యంగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యమని నేతలు వివరించారు. ఇందులో భాగంగా పరిశ్రమలు, స్టార్టప్‌లు, చిన్న–మధ్య తరహా పరిశ్రమలు, విద్యార్థులు, రక్షణ రంగంలో పరిశోధనలు, స్వచ్ఛ ఇంధనం, అంతరిక్షం, నూతన టెక్నాలజీలు తదితర రంగాల్లో పరిశోధనలకు మరింత ఊపు లభిస్తుందని మోదీ అన్నారు. ఇన్నొవేషన్ ఇయర్‌లో భాగంగా ఆరోగ్యం, డిజిటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ఇండో–ఫ్రెంచ్ ఏఐ సెంటర్లను స్థాపించనున్నారు. ఫ్రాన్స్‌లో భారత్ త్వరలో స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
మెరీన్ డ్రైవ్‌లో మాక్రాన్ జాగింగ్!
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మా క్రాన్ మంగళవారం ఉదయం బాంబేలోని మెరీన్ డ్రైవ్‌లో జాగింగ్ చేశారు. నీలిరంగు టీ షర్టు, నలుపు షార్ట్స్, రన్నింగ్ షూస్ ధరించిన ఆయన జాగింగ్ చేస్తున్న వారితో కలిసి పోటాపోటీగా పరుగు తీశారు. భద్రతా సిబ్బంది మారువేషాల్లో కాస్త వెనకగా ఆయనను అనుసరించారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మాక్రాన్‌ను గుర్తు పట్టిన పలువురు ఆయన్ను తమ స్మార్ట్ ఫోన్లలో బంధించారు. అవన్నీ వైరల్‌గా మారాయి. మాక్రాన్ విదేశీ పర్యటనల్లో కూడా జాగింగ్ కొనసాగిస్తుంటారు.
బాలీవుడ్ తారలతో మాక్రాన్ దంపతుల భేటీ
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటనలో తారల తళుకులు చోటుచేసుకున్నాయి. పలువురు బాలీవుడ్ తారలతో మాక్రాన్, బ్రిగెటీ దంపతులు మంగళవారం భేటీ అయ్యారు. సినీ పరిశ్రమపరంగా భారత్, ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు తదితరాలపై వారితో రెండు గంటలకు పైగా చర్చించారు. తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో జోయా అక్తర్, షబానా అజ్మీ, మనోజ్ బాజ్‌పాయ్, అనిల్ కపూర్, కబీర్ ఖాన్, రిచా ఛద్దా తదితరులు పాల్గొన్నారు. 2008లో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రమంటే తనకెంతో ఇష్టమని బ్రిగెటీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.


