పాక్‌కు భార‌త్ భారీ షాక్.. ఏప్రిల్ నుంచి నీళ్లు బంద్‌! | India to turn off Ravi water tap for Pakistan ahead of summer | Sakshi
Sakshi News home page

పాక్‌కు భార‌త్ భారీ షాక్.. ఏప్రిల్ నుంచి నీళ్లు బంద్‌!

Feb 18 2026 4:20 AM | Updated on Feb 18 2026 4:20 AM

India to turn off Ravi water tap for Pakistan ahead of summer

సింధు నదీ జలాల ఒప్పందం రద్దుతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు మ‌రో గ‌ట్టి షాక్ ఇచ్చేందుకు భార‌త్  సిద్ద‌మైంది. రావి నది నుండి పాక్‌కు వెళ్లే మిగులు జ‌లాల‌ను పూర్తిగా అడ్డుకోవాలని భారత్ నిర్ణయించింది. రావి నదిపై నిర్మిస్తున్న షాపుర్ కండి బ్యారేజీ పనులు తుది దశకు చేరుకున్నాయి. మార్చి 31 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కానున్న‌ట్లు తెలుస్తోంది.

దీంతో ఏప్రిల్ 1 నుండి ఈ బ్యారేజీ ద్వారా పాక్‌కు వెళ్లే మిగులు జ‌లాల‌ను నిలిపివేయ‌నున్నారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలగా సరైన నిల్వ సౌకర్యాలు లేకపోవడం వల్ల రావి నదిలోని అదనపు నీరు పాక్‌కు ప్ర‌వ‌హిస్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఆ నీటిని ఇక‌పై పాక్ వెళ్లనివ్వకుండా భారత్ తన సొంత అవసరాల కోసం ఉపయోగించుకోనుంది. 

ఇదే విషయంపై జమ్మూ కాశ్మీర్ మంత్రి జావేద్ అహ్మద్ రానా సోమవారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కతువా, సాంబ వంటి కరువు ప్రాంతాలకు సాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని ఆయ‌న తెలిపారు. "పాకిస్తాన్‌కు వెళ్లే అద‌న‌పు నీటిని క‌చ్చితంగా ఆపేయాల్సిందే. ఇకపై అక్కడకు ఒక్క చుక్క నీరు కూడా పోదు"అని జావేద్ పేర్కొన్నారు. 

కాగా 1960లో జ‌రిగిన‌ సింధూ జలాల ఒప్పందం ప్ర‌కారం రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు పూర్తి హక్కులు ఉన్నాయి. ఇప్పుడు త‌మ పూర్తి హక్కుల‌ను వినియోగించుకునేందుకు భార‌త్ సిద్ద‌మైంది. ఇప్ప‌టికే తీవ్ర ఆర్థిక సంక్షోభం, నీటి కొరతతో ఉన్న దాయాది దేశంకు ఇది గ‌ట్టి ఎదురు దెబ్బే. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన పాక్ పంజాబ్ ప్రావిన్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement