న్యూయార్క్‌లో ఘోర ప్రమాదం.. గ్యాస్ లీకై చర్చిలో పేలుడు | Firefighter in critical condition, 4 others injured in New York church explosion | Sakshi
Sakshi News home page

న్యూయార్క్‌లో ఘోర ప్రమాదం.. గ్యాస్ లీకై చర్చిలో పేలుడు

Feb 18 2026 12:31 AM | Updated on Feb 18 2026 12:31 AM

Firefighter in critical condition, 4 others injured in New York church explosion

న్యూయార్క్‌లో బూన్‌విల్లే ప‌ట్ట‌ణంలోని ఓ చ‌ర్చిలో భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక ఫైర్ ఫైటర్ సహా ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బూన్‌విల్లేలోని 'అబండెంట్ లైఫ్ ఫెలోషిప్' చర్చిలో గ్యాస్ లీక్ అవుతుందన్న ఫిర్యాదు అగ్ని మాప‌క సిబ్బందికి అందింది.

దీంతో అగ్నిమాపక సిబ్బంది,  పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపడుతుండగానే ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి చర్చి భవనం దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన ఐదుగురిని వెంటనే యూటికాలోని విన్ ఆసుపత్రికి తరలించారు. గాయ‌ప‌డిన వారిలో ఫైర్ ఫైటర్‌తో పాటు మ‌రొక పౌరుడి పరిస్థితి విషమంగా ఉంది.

చర్చి పాస్టర్ కూడా ఈ ప్రమాదంలో గాయపడినట్లు తెలుస్తోంది.  చర్చిలో వేడిని పుట్టించ‌డానికి ఉపయోగించే ప్రొపేన్ సిలిండర్ల నుండి గ్యాస్ లీక్ అవ్వడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లో నల్లటి పొగ అలుముకుంది. ఈ ఘటనలో ఎటువంటి కుట్ర కోణం లేదని, ఇది ప్రమాదవశాత్తు జరిగినదేనని న్యూయార్క్ స్టేట్ పోలీసులు స్ప‌ష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement