కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఎనిమిది మంది సజీవ దహనం! | 8 workers burnt alive in chemical factory fire in Rajasthan | Sakshi
Sakshi News home page

కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఎనిమిది మంది సజీవ దహనం!

Feb 16 2026 12:22 PM | Updated on Feb 16 2026 1:12 PM

8 workers burnt alive in chemical factory fire in Rajasthan

భివాడీ: రాజస్థాన్‌లోని ఖేర్తల్-తిజారా జిల్లా భివాడీలో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఖుష్ఖేరా కరౌలి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ  సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 25 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు.  వీరిలో ఎనిమిది మంది  బయటపడలేక ఫ్యాక్టరీలోనే సజీవ దహనమయ్యారు.

పోలీసులు గస్తీలో ఉండగా ఈ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏఎండీ) సుమితా మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో కార్మికుడు ఇంకా లోపలే చిక్కుకుని ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ఖుష్ఖేరా, భివాడీ రీకో ఫైర్ స్టేషన్ల నుండి అగ్నిమాపక యంత్రాలు యుద్ధ ప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుమారు గంటన్నర పాటు అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా శ్రమించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రసాయనాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని, దీనివల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు.  తిజారా డీఎస్పీ శివరాజ్ సింగ్ ఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. భివాడీ ఎస్పీ, ఏడీఎం సహా ఇతర ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలంలోనే ఉన్నారు. విచారణ అనంతరం ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: ‘వృద్ధాప్యంలో విడాకులేంటి?’.. చివాట్లు పెట్టిన కోర్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement