‘శబరిమలకు మహిళలు’.. తుది విచారణకు ‘సుప్రీం’ | Sabarimala Temple women Entry Supreme court Nine Member Bench | Sakshi
Sakshi News home page

‘శబరిమలకు మహిళలు’.. తుది విచారణకు ‘సుప్రీం’

Feb 16 2026 12:55 PM | Updated on Feb 16 2026 1:41 PM

Sabarimala Temple women Entry Supreme court Nine Member Bench

శబరిమల: కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం, ఇతర మతపరమైన ప్రదేశాలలో వివక్షకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2026, ఏప్రిల్ 7వ తేదీ నుంచి తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులను విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జారీ చేసిన అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వుల  ఆధారంగా ఈ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం ఈ విషయంలో తన తుది వైఖరిని తెలియజేస్తూ, మార్చి 14 లోగా లిఖితపూర్వక వాదనలను సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

గతంలో ఈ కేసును ప్రధాన ధర్మాసనానికి బదిలీ చేయడంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ, సుప్రీంకోర్టు వాటిని తోసిపుచ్చింది. రివ్యూ పిటిషన్ల దశలో కూడా న్యాయపరమైన ప్రశ్నలను ప్రధాన ధర్మాసనానికి నివేదించే అధికారం కోర్టుకు ఉంటుందని 2020 ఫిబ్రవరిలోనే తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. దీనితో ఈ అంశంపై ఉన్న సందిగ్ధత పూర్తిగా తొలగిపోయింది. 2020లో రూపొందించిన ఏడు ప్రధాన న్యాయపరమైన ప్రశ్నల ఆధారంగానే ప్రస్తుత విచారణ సాగనుంది.

అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ కేసు కోసం కోర్టు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏప్రిల్ 7 నుండి 9 వరకు రివ్యూ పిటిషన్లను సమర్థించే వారి వాదనలను వింటారు. అనంతరం ఏప్రిల్ 14 నుండి 16 వరకు ఆ పిటిషన్లను వ్యతిరేకించే వారి వాదనలు జరుగుతాయి. ఏప్రిల్ 21న ప్రత్యుత్తరాల విచారణ చేపట్టి, ఏప్రిల్ 22 నాటికి అమికస్ క్యూరీ తుది వాదనలతో ప్రక్రియను ముగించాలని కోర్టు భావిస్తోంది. ఈ కేసు అత్యంత ముఖ్యమైనదని ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

2018లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం శబరిమలలో మహిళలందరికీ ప్రవేశం కల్పిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు కేరళలో పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. తాజా విచారణ కేవలం శబరిమలకే పరిమితం కాకుండా.. మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, ఇతర మతస్తులను వివాహం చేసుకున్న పార్శీ మహిళల హక్కులు, దావూదీ బోహ్రా కమ్యూనిటీలోని వివాదాస్పద ఆచారాల వంటి కీలక అంశాలను కూడా ప్రస్తావించనుంది.

ఇది కూడా చదవండి: ‘వృద్ధాప్యంలో విడాకులేంటి?’.. చివాట్లు పెట్టిన కోర్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement