భారతీయ పోలీసులపై పాకిస్తాన్ హనీ ట్రాప్ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తోంది. పాక్ నిఘా వర్గాలు సోషల్ మీడియా వేదికగా భారత పోలీసులను లక్ష్యంగా చేసుకుని 'హనీ-ట్రాప్' (అందమైన యువతుల ఫోటోలతో బురిడీ కొట్టించడం)కు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) పోలీసు సిబ్బందికి తాజాగా కొన్ని హెచ్చరికలను జారీ చేసింది.
పాకిస్తాన్ నిఘా సంస్థల "హనీ-ట్రాపింగ్" ప్రయత్నాలు పెరుగుతున్నట్టు గమనించిన, MHA ఈ ముప్పును ఎదుర్కోవడానికి, సోషల్ మీడియా సురక్షిత వినియోగంపై మంత్రిత్వ శాఖ వివరణాత్మక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (SOP) విడుదల చేసింది.
ఈ మార్గదర్శకాలను గత ఏడాది నవంబరు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ జారీ చేసింది. పోలీసు అధికారులతో స్నేహం చేసి, సున్నితమైన సమాచారాన్ని రహస్యంగా సేకరించడానికి Facebook, X, Instagram, WhatsApp, Telegram, LinkedIn వంటి ప్రసిద్ధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను వాడుకుంటాయి.
ముఖ్యమైన మార్గదర్శకాలు (SOP):
సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో తాము పోలీసు అధికారులమని బహిర్గతం చేయకూడదు.
అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. అనామకుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులను అంగీకరించ వద్దు. ముఖ్యంగా యువతుల ఫోటోలతో ఆకర్షించే ప్రొఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ఆన్‌లైన్ పోస్ట్‌లు కేవలం మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి మాత్రమే కనిపించేలా ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకోవాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో (WhatsApp, Telegram, etc.) అధికారిక పత్రాలను లేదా సున్నితమైన సమాచారాన్ని పంచుకోకూడదు.
ఉద్యోగాలు, ఉచిత పర్యటనలు లేదా ప్రభుత్వ ఆఫర్ల పేరుతో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ధృవీకరించని యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం, తెలియని లింక్స్ క్లిక్ చేయడం, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో పత్రాలను పంచుకోవడం చేయకూడదు.
ఇదీ చదవండి: అవును వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు : ఫ్యాన్స్‌కు వాలెంటైన్స్ డే సర్‌ప్రైజ్
ఒకవేళ హనీ-ట్రాప్‌కు గురైతే ఏం చేయాలి?
ఒకవేళ హనీ-ట్రాప్‌కు గురైతే ఏం చేయాలనేదానిపై కూడా సూచనలు అందించింది. ఒకవేళ ఎవరైనా అధికారి హనీ ట్రాప్ ఉచ్చులో పడినట్లు అనుమానం వస్తే, తక్షణమే సదరు అధికారికి చెందిన డిజిటల్ పరికరాలను (ఫోన్లు, ల్యాప్‌టాప్స్) వెంటనే స్వాధీనం చేసుకోవాలి.
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలి. స్టేట్ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ ఈ నిబంధనల అమలును పర్యవేక్షిస్తుంది.
దృఢమైన పాస్‌వర్డ్‌లు, రెండు-కారకాల ప్రామాణీకరణ, పరిమిత యాప్ అనుమతులు, సాధారణ గోప్యతా తనిఖీల ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లకు ఆయా పోలీసు అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రహస్య సమాచారాన్ని లీక్ చేస్తే క్రమశిక్షణా చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇదీ చదవండి: కస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్


