భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లు ఎప్పుడూ మహాసంగ్రామాలను తలపిస్తాయి. ప్రత్యేకించి ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల పోరాటాలు అంతకుమించిన అనుభూతిని కలిగిస్తాయి. మరీ ప్రత్యేకించి, టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల పోటీ ప్రళయ వాతావరణాన్ని సూచిస్తుంది.
గెలుపోటములు ఎలా ఉన్నా, మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే ఇరు దేశాల అభిమానుల మధ్య వార్ మొదలవుతుంది. ఈ పరిస్థితి దాయాదుల సమరానికి మరింత హైప్ తెచ్చిపెడుతుంది. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు, అభిమానుల భావోద్వేగాలు ఈ మ్యాచ్‌లను మరింత ప్రత్యేకం చేస్తాయి.
ఈ హైప్ భారత్, పాక్ అభిమానులనే కాక, విశ్వవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది.
భారీ అంచనాల మధ్య టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) భారత్-పాక్ తలపడుతున్నాయి. ఈ హైవోల్టేజీ మ్యాచ్ కొలంబోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టోర్నీ ప్రారంభానికి ముందు ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు ఉండేవి. బంగ్లాదేశ్‌కు జరిగిన అన్యాయానికి నిరసనగా పాక్ ప్రభుత్వం ఈ మ్యాచ్ రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
అయితే ఐసీసీ మధ్యవర్తిత్వంతో పాక్ ఈ మ్యాచ్ ఆడేందుకు తిరిగి అంగీకరించింది. జరగదనున్న మ్యాచ్ తిరిగి కార్యరూపం దాల్చడం ఈ మ్యాచ్ హైప్‌ను పీక్స్‌కు చేర్చింది.
ఈ భారీ అంచనాల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాక్ మ్యాచ్ హెడ్ టు హెడ్ రికార్డులపై ఓ లుక్కేద్దాం. ఈ మెగా టోర్నీలో భారత్‌కు పాక్‌పై స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 8 సార్లు ఎదురెదురుపడగా.. భారత్ ఏకంగా ఏడు సార్లు జయకేతనం ఎగురవేసింది. పాక్ ఒకే ఒక్క సందర్భంలో మాత్రమే గెలుపొందింది. టీమిండియా ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లోనూ గెలిచి పొట్టి ప్రపంచకప్‌లో తమ రికార్డును (8-1 మరింత మెరుగుపర్చుకోవాలని పట్టుదలగా ఉంది.
భారత జట్టు ప్రస్తుతమున్న ఫామ్‌ను బట్టి చూస్తే, ఇది అంత కష్టమేమీ కాకపోవచ్చు. గత కొంతకాలంగా టీమిండియా పొట్టి ఫార్మాట్‌లో తిరుగులేని విజయాలు సాధిస్తూ నంబర్ వన్ స్థానంలో ఉంది. జట్టులోని ప్రతి ఆటగాడు భీకర ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుత పాక్ జట్టును టీమిండియా ఆడుతూపాడుతూ చిత్తు చేయవచ్చు.
అలాగని ఉదాసీనంగా వ్యవహరిస్తే, 2021 ఎడిషన్‌లో ఎదురైన పరాభవం పునరావృతమయేక్య ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి టీమిండియా చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే లాజిక్‌ను అమలు చేస్తే బాగుంటుంది. మరో గంటలో (రాత్రి 7 గంటలకు) ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఇప్పటి నుంచే టీవీలకు అతుక్కుపోయారు.
వరుణుడి భయం
ఓ పక్క అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, కొలొంబో వాతావరణం మాత్రం అందరినీ కలవరపెడుతుంది. మ్యాచ్ సమయంలో భారీ వర్షం పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్ని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ కొన్ని ఓవర్లు జరిగినా చాలని దేవుళ్లను ప్రార్దిస్తున్నారు.
ఒకవేళ మ్యాచ్ రద్దైతే మాత్రం భారత్, పాక్‌కు చెరో పాయింట్ లభిస్తుంది. తద్వారా ఈ రెండు జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. భారత అభిమానులు మాత్రం ఈ మ్యాచ్ పూర్తిగా జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే, భారత జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఈ జట్టుతో పాక్ సునాయాసంగా చిత్తు చేయవచ్చు. తద్వారా టీ20 ప్రపంచకప్‌లో తమ రికార్డును మరింత మెరుగుపర్చుకోవచ్చు.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన భారత్-పాక్ సమరాలు..
తొలి ఘట్టం – 2007
దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ రెండు సార్లు తలపడ్డాయి. గ్రూప్ స్టేజ్‌లో మ్యాచ్ టై అయ్యింది, కానీ బౌలౌట్‌లో భారత్ గెలిచింది. అదే టోర్నమెంట్ ఫైనల్‌లో మళ్లీ తలపడగా, ఎంఎస్ ధోని సారథ్యంలోని భారత జట్టు చరిత్రాత్మక విజయం సాధించింది. ఇది భారత్-పాక్ టీ20 వరల్డ్‌కప్ పోరాటాలకు ఆరంభం.
భారత్ ఆధిపత్యం
అనంతరం 2012, 2014, 2016 వరల్డ్‌కప్‌లలో భారత్ వరుస విజయాలు సాధించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి బ్యాటర్లు అద్భుత ప్రదర్శనలతో భారత్ పాక్‌పై ఆధిపత్యం కొనసాగించింది.
పాక్ చరిత్రాత్మక విజయం – 2021
దుబాయ్‌లో జరిగిన 2021 వరల్డ్‌కప్‌లో పాక్ భారత్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఇది పాక్‌కి వరల్డ్‌కప్ చరిత్రలో భారత్‌పై తొలి విజయం. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ అద్భుత బ్యాటింగ్‌తో ఆ మ్యాచ్ పాక్ అభిమానులకు మరపురాని జ్ఞాపకం అయ్యింది.
తిరిగి భారత్ ఆధిపత్యం
2022, 2024 వరల్డ్‌కప్‌లలో భారత్ మళ్లీ పాక్‌ను ఓడించింది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు ఈ గెలుపుల్లో కీలక పాత్ర పోషించారు.


