టీమిండియా బౌలర్ల విజృంభణ.. కుప్పకూలిన ఆస్ట్రేలియా | India Women tour of Australia 2026: Indian bowlers restricted aussies to 133 runs | Sakshi
Sakshi News home page

టీమిండియా బౌలర్ల విజృంభణ.. కుప్పకూలిన ఆస్ట్రేలియా

Feb 15 2026 3:49 PM | Updated on Feb 15 2026 4:38 PM

India Women tour of Australia 2026: Indian bowlers restricted aussies to 133 runs

ఆస్ట్రేలియా గడ్డపై తొలి మ్యాచ్‌లోనే భారత మహిళా బౌలర్లు చెలరేగిపోయారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా.. ఆసీస్‌ను 133 పరుగులకే (18 ఓవర్లలో) కుప్పకూల్చింది.

పేసర్లు రేణుకా సింగ్‌ (4-1-14-2), అరుంధతి రెడ్డి (4-0-22-4), క్రాంతి గౌడ్‌ (3-0-39-0) నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్‌ ప్లేయర్ల భరతం​ పట్టారు. స్పిన్నర్లు శ్రీ చరణి (3-0-14-2), దీప్తి శర్మ (2-0-19-1) కూడా సత్తా చాటారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్‌ (2-0-24-0) ఒక్కరే కాస్త ధారాళంగా పరుగులు సమర్పించుకుంది.

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో జార్జియా వేర్హమ్‌ (30) టాప్‌ స్కోరర్‌ కాగా.. ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (26), ఎల్లిస్‌ పెర్రీ (20), జార్జియా వాల్‌ (18), నికోలా క్యారీ (12) రెండంకెల స్కోర్లు చేశారు. బెత్‌ మూనీ (5), ఆష్లే గార్డ్‌నర్‌ (4), అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (3), కిమ్‌ గార్త్‌ (2), డార్సీ బ్రౌన్‌ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. కొత్త కెప్టెన్‌ సోఫీ మోలినెక్స్‌ 6 పరుగులతో అజేయంగా నిలిచింది.

కాగా, మల్లీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం భారత్‌ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో తొలుత మూడు టీ20లు, ఆతర్వాత మూడు వన్డేలో, చివరిగా ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ జరుగనుంది. 

ఆస్ట్రేలియాలో భారత పర్యటన షెడ్యూల్‌

ఫిబ్రవరి 15- తొలి టీ20 (సిడ్నీ)
ఫిబ్రవరి 19- రెండో టీ20 (కాన్‌బెర్రా)
ఫిబ్రవరి 21- మూడో టీ20 (అడిలైడ్‌)

ఫిబ్రవరి 24- తొలి వన్డే (బ్రిస్బేన్‌)
ఫిబ్రవరి 27- రెండో వన్డే (హోబర్ట్‌)
మార్చి 1- మూడో వన్డే (హోబర్ట్‌)

మార్చి 6- ఏకైక టెస్ట్‌ (పెర్త్‌)

Advertisement
 
Advertisement
Advertisement