నేడు భారత్, ఆ్రస్టేలియా తొలి టి20
మ.గం.1.45 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రసారం
సిడ్నీ: భారత మహిళల క్రికెట్ జట్టు కూడా కీలకమైన టి20 పోరుకు సిద్ధమైంది. భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు తొలి సమరం జరుగుతుంది. వన్డే వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత స్వదేశంలో శ్రీలంకతో టి20 సిరీస్ ఆడి క్లీన్‌స్వీప్ చేసిన హర్మన్‌ప్రీత్ సేన ఇప్పుడు ఒక పెద్ద జట్టుతో ప్రత్యర్థి గడ్డపై తలపడుతోంది. కెపె్టన్ హర్మన్‌తో పాటు రెగ్యులర్ ఆటగాళ్లు స్మృతి మంధాన, షఫాలీ, జెమీమా, రిచా ఘోష్, దీప్తి శర్మ బ్యాటింగ్‌లో చెలరేగితే భారత్ పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా డబ్ల్యూపీఎల్‌లో టాప్‌స్కోరర్‌గా నిలిచి అద్భుతమైన ఫామ్‌తో స్మృతి ఈ సిరీస్‌కు సిద్ధమైంది. గత టి20 వరల్డ్ కప్ తర్వాతి నుంచి 143.54 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధిస్తున్న స్మృతికి ఆసీస్ గడ్డపై కూడా మంచి రికార్డు ఉంది. క్రాంతి, అరుంధతి, శ్రీచరణి, శ్రేయాంక, రేణుకా సింగ్ బౌలింగ్ బాధ్యతలు తీసుకుంటారు.
మరో వైపు కొత్త కెప్టెన్ సోఫీ మోలినే నాయకత్వంలో ఆసీస్ బరిలోకి దిగుతోంది. గత 19 టి20 సిరీస్‌లలో ఆ్రస్టేలియా ఒక్కటి మాత్రమే ఓడింది. అలీసా హీలీ ఈ ఫార్మాట్‌నుంచి రిటైరైనా... ఇతర స్టార్లు ఎలైస్ పెరీ, సదర్లాండ్, మూనీ, లిచ్‌ఫీల్డ్, వోల్, వేర్‌హామ్‌లకు జట్టును ఒంటిచేత్తో గెలిపించగల సత్తా ఉంది.
ఆ్రస్టేలియాలో భారత పర్యటనను ప్రతీ ఫార్మాట్‌కు వేర్వేరుగా కాకుండా తొలిసారి మూడు ఫార్మాట్‌లలో ప్రదర్శనను బట్టి సిరీస్ విజేతను నిర్ణయిస్తారు. 3 టి20, 3 వన్డేలు, ఒక టెస్టు తర్వాత ఇది తేలుతుంది. పరిమిత ఓవర్లలో ఒక విజయానికి 2 పాయింట్లు, టెస్టులో విజయానికి 4 పాయింట్లు...టెస్టు డ్రా అయితే చెరో 2 పాయింట్లు కేటాయిస్తారు.


