మార్క్‌రమ్, యాన్సెన్‌ జోరు | South Africa beat New Zealand by 7 wickets in T20 World Cup | Sakshi
Sakshi News home page

మార్క్‌రమ్, యాన్సెన్‌ జోరు

Feb 15 2026 2:47 AM | Updated on Feb 15 2026 2:47 AM

South Africa beat New Zealand by 7 wickets in T20 World Cup

దక్షిణాఫ్రికాకు మరో విజయం

7 వికెట్లతో న్యూజిలాండ్‌ చిత్తు 

టి20 ప్రపంచకప్‌ 

అహ్మదాబాద్‌: బౌలింగ్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మార్కో యాన్సెన్‌ జోరు (4/40), బ్యాటింగ్‌లో కెప్టెన్‌ కెప్టెన్  ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (44 బంతుల్లో 86 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు)  దూకుడుతో దక్షిణాఫ్రికా ఖాతాలో మరో విజయం చేరింది.  గ్రూప్‌ ‘డి’లో శనివారం జరిగిన ఈ లీగ్‌ మ్యాచ్‌లో సఫారీ జట్టు 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. 

టాస్‌ నెగ్గిన మార్క్‌రమ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. మార్క్‌ చాప్‌మన్‌ (26 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి గెలిచింది. ఫెర్గూసన్, నీషమ్, రచిన్‌ రవీంద్రలకు తలా ఒక వికెట్‌ దక్కింది. 

టాపార్డర్‌ టపటపా... 
ఇన్‌గిడి మూడో ఓవర్లో అలెన్‌ 3 ఫోర్లు, 1 సిక్స్‌తో కివీస్‌ శిబిరానికి జోష్‌ తెచ్చాడు. యాన్సెన్‌ తర్వాతి ఓవల్లో సీఫెర్ట్‌ (13) అవుటైనా... అలెన్‌ 4, 6తో జోరు కొనసాగించే ప్రయత్నం చేశాడు. మళ్లీ ఆరో ఓవర్‌ వేసిన యాన్సెన్‌ ఈ సారి రచిన్‌ రవీంద్ర (13), అలెన్‌ (17 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుకు చెక్‌పెట్టాడు. కివీస్‌ పవర్‌ ప్లే కష్టాల నుంచి కోలుకోకముందే కేశవ్‌ మహరాజ్‌... ఫిలిప్స్‌ (1)ను బౌల్డ్‌ చేయడంతో 64 పరుగుల వద్ద కివీస్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది.

ఈ దశలో చాప్‌మన్‌ ధాటిగా ఆడి న్యూజిలాండ్‌ స్కోరు పెంచాడు. డారిల్‌ మిచెల్‌ (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్‌), ఆఖర్లో నీషమ్‌ (15 బంతుల్లో 23 నాటౌట్‌; 3 ఫోర్లు) బౌండరీలతో న్యూజిలాండ్‌ పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. యాన్సెన్‌ సగటున ఓవర్‌కు 10 చొప్పున పరుగులిచ్చినా కీలక వికెట్లు తీశాడు. 

రఫాడించిన మార్క్‌రమ్‌ 
కివీస్‌ చేసిందేమీ తక్కువ స్కోరు కాదు. దీంతో ఈ గ్రూప్‌లో రెండు పోటీ జట్ల మధ్య ఆసక్తికర సమరం జరుగుతుందనుకుంటే మార్క్‌రమ్‌ ఏకపక్షంగా మార్చేశాడు. అతను ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా మూడో ఓవర్లోనే 50 స్కోరుకు చేరుకుంది. జట్టు స్కోరు 62 పరుగుల వద్ద డికాక్‌ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అవుటయ్యాడు. కాసేపటికే మార్క్‌రమ్‌ 19 బంతుల్లోనే  ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున వేగవంతమైన అర్ధశతకాన్ని సాధించాడు. 

రికెల్టన్‌ (11 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా కెప్టెన్‌లాగే కివీస్‌ బౌలర్లపై విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా 7.2 ఓవర్లలోనే వంద పరుగులు దాటింది. తర్వాత వచ్చిన బ్రెవిస్‌ (17 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్‌), మిల్లర్‌ (17 బంతుల్లో 24 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) ధాటిగా ఆడటంతో ఇంకో 2.5 ఓవర్లముందే సఫారీ లక్ష్యాన్ని దాటేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement