టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. హై-వోల్టేజ్ పోరుకు ముందు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌ను తక్కువగా అంచనా వేయవద్దని భారత జట్టును భజ్జీ హెచ్చరించాడు.
ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ పాకిస్తాన్ జట్టులో ఉస్మాన్ తారిక్ లాంటి అద్భుతమైన స్పిన్నర్ ఉన్నాడు. అతడిని భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాలి. అయితే మన జట్టుపై పూర్తి నమ్మకం నాకు ఉంది. భారత జట్టు ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉంది. టీమిండియా ఎప్పటిలాగే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడి గెలుపు జెండా ఎగరవేస్తారని ఆశిస్తున్నాము అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు.
కాగా ఉస్మాన్ తారిఖ్ తన బౌలింగ్ యాక్షన్‌తో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి బౌలింగ్‌ను ఆర్ధం చేసుకునేందుకు బ్యాటర్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. బంతిని విసిరే ముందు కొద్దిసేపు ఆగి డెలివరీ చేసే అతడి బౌలింగ్ శైలి కేదార్ జాదవ్‌ను తలపిస్తోంది. అతడి బౌలింగ్ యాక్షన్‌పై వివాదాలు తలెత్తినప్పటికి.. ఐసీసీ మాత్రం క్లియరెన్స్ ఇచ్చింది. తారిఖ్ ఇప్పటివరకు కేవలం 4 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. పాక్ జట్టు కూడా అతడిపైనే గంపెడు ఆశలు పెట్టుకుంది.
చదవండి: T20 WC 2026: భారత ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా? పాక్ కెప్టెన్ రిప్లై ఇదే


