IND vs NAM: మరో కూనతో పోరు | India to face Namibia in T20 World Cup today | Sakshi
Sakshi News home page

IND vs NAM: మరో కూనతో పోరు

Feb 12 2026 3:58 AM | Updated on Feb 12 2026 10:48 AM

India to face Namibia in T20 World Cup today

నేడు నమీబియాతో భారత్‌ ఢీ 

అభిషేక్‌ శర్మకు అస్వస్థత 

సామ్సన్‌కు అవకాశం

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం  

న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమిండియా రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి పోరులో అమెరికాపై విజయం సాధించిన సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలోని భారత జట్టు గురువారం నమీబియాతో తలపడనుంది. 

గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా తదుపరి మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌ తో ఆడనున్న టీమిండియా దానికి ముందు నమీబియాతో మ్యాచ్‌ను ప్రాక్టీస్‌గా వాడుకోవాలని భావిస్తోంది. బలాబలాలు, అనుభవం దృష్ట్యా ఇరుజట్లలో చాలా అంతరం ఉంది. తొలి మ్యాచ్‌లో అమెరికాపై స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన టీమిండియా... నమీబియాపై కలిసికట్టుగా కదంతొక్కాల్సిన అవసరముంది. భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. 

అస్వస్థత కారణంగా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ కడుపు నొప్పితో రెండు రోజులపాటు ఆసుపత్రిలో ఉన్నాడు. బుధవారం డిశ్చార్జి అయి జట్టుతో కలిశాడు. అయితే నేటి పోరులో అతను ఆడే విషయంపై స్పష్టత లేదు. ఒకవేళ అభిషేక్‌ దూరమైతే సంజూ సామ్సన్‌కు అవకాశం లభించవచ్చు. 

మరోవైపు వాషింగ్టన్‌ సుందర్‌ గాయం నుంచి కోలుకోగా... ప్రాక్టీస్‌ సందర్భంగా ఇషాన్‌ కిషన్‌ కాలికి గాయమైంది. ఇక తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ చేతిలో ఓడిన నమీబియా... ‘పోరాడితే పోయేదేమీ లేదు’ అన్న చందంగా రాణించాలని చూస్తోంది. ఢిల్లీ పిచ్‌ అటు బౌలింగ్‌కు, ఇటు బ్యాటింగ్‌కు సమానంగా సహకరించనుంది. మైదానం చిన్నది కావడంతో కుదురుకుంటే భారీ స్కోర్లు ఖాయమే! 

అభిషేక్‌పైనే అందరి దృష్టి 
గత రెండేళ్లుగా భారత జట్టు టి20 ఫార్మాట్‌లో నిలకడగా విజయాలు సాధించడంలో స్టార్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ కృషి ఎంతో ఉంది. ఆరంభంలోనే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి చూస్తుండగానే మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగల ఈ ‘బిగ్‌ హిట్టర్‌’ వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో ‘డకౌట్‌’ అయ్యాడు. 

‘పవర్‌ ప్లే’ లోపే మ్యాచ్‌ను లాగేసుకునే సత్తా గల అభిషేక్‌... రెండో మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది కీలకం. తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్, శివమ్‌ దూబే రూపంలో బ్యాటర్లకు కొదవలేదు. గత మ్యాచ్‌లో సూర్య కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ కారణంగా భారత జట్టు మంచి స్కోరు చేయగలిగింది. 

వరల్డ్‌కప్‌నకు ఒక్క రోజు ముందు పేస్‌ ఆల్‌రౌండర్‌ హర్షిత్‌ రాణా గాయపడటంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అమెరికాతో పోరులో ఆడని బుమ్రా తుది జట్టులోకి వస్తే ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరం. వాషింగ్టన్‌ సుందర్‌ కోలుకున్నా... ఇప్పడు అతడిని తుది జట్టులోకి ఎంపిక చేయడం కష్టమే. వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌ స్పిన్‌ భారం మోయనున్నారు.  

పోటీనిచ్చేనా! 
అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా అనుభవం లేని నమీబియా... టీమిండియాపై సంచలన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. 2021 ప్రపంచకప్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఏకైక మ్యాచ్‌ జరగ్గా... టీమిండియా అలవోక విజయం సాధించింది. అదే జోరు కొనసాగిస్తూ ఈ మ్యాచ్‌తో ప్లేయర్లంతా ఫామ్‌లోకి రావాలని భారత మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. 

నెదర్లాండ్స్‌తో పోరులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన నమీబియాపై అంచనాలు లేకపోయినా... ‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి’ అని టీమిండియా యోచిస్తోంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో నమీబియాపై ఫుల్‌ ప్రాక్టీస్‌ చేయాలని మనవాళ్లు చూస్తున్నారు. 

వరల్డ్‌కప్‌నకు ముందు జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టు చేతిలోనూ నమీబియా పరాజయం పాలైంది. అలాంటిది బుమ్రా, సిరాజ్, అర్‌‡్షదీప్, హార్దిక్, వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌ను ఎదుర్కొని నమీబియా బ్యాటర్లు నిలవగలరా చూడాలి.     

తుది జట్లు (అంచనా) 
భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్), అభిషేక్‌/సామ్సన్, ఇషాన్, తిలక్, హార్దిక్, రింకూ, శివమ్‌ దూబే, అక్షర్, అర్ష్ దీప్, బుమ్రా/సిరాజ్, వరుణ్‌. 
నమీబియా: ఎరాస్మస్‌ (కెప్టెన్ ), స్టీన్‌ కాంప్, ఫ్రైలింక్, జాన్‌ నికోల్, జేజే స్మిత్, జెన్‌ గ్రీన్, లైచెర్, విలియమ్‌ మైబుర్గ్, రూబెన్, బెర్నార్డ్‌ స్కాట్జ్, బెన్‌ షికొంగో.

టి20 ప్రపంచకప్‌లో నేడు
శ్రీలంక X ఒమన్‌
వేదిక: పల్లెకెలె; ఉ.గం. 11 నుంచి 
నేపాల్‌  X  ఇటలీ
వేదిక: ముంబై; మ.గం. 3 నుంచి
భారత్‌  X  నమీబియా
వేదిక: న్యూఢిల్లీ; రాత్రి గం. 7 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
 
Advertisement
Advertisement