‘డబుల్‌ సూపర్‌’ ధమాకా | Safaris win over Afghanistan after two Super Overs | Sakshi
Sakshi News home page

‘డబుల్‌ సూపర్‌’ ధమాకా

Feb 12 2026 3:43 AM | Updated on Feb 12 2026 10:49 AM

Safaris win over Afghanistan after two Super Overs

అఫ్గానిస్తాన్‌తో పోరులో గట్టెక్కిన దక్షిణాఫ్రికా  

రెండు సూపర్‌ ఓవర్ల తర్వాత నెగ్గిన సఫారీలు

అఫ్గాన్‌ టీమ్‌కు తీవ్ర నిరాశ

ప్రపంచకప్‌లో డజను మ్యాచ్‌లు ముగిసినా అభిమానులకు ఇంకా ఏదో వెలితి... కొన్ని చక్కటి ఇన్నింగ్స్‌లు, మరికొన్ని మంచి బౌలింగ్‌ ప్రదర్శనలు వచ్చినా అసలైన టి20 మజా మాత్రం ఇంకా కనిపించలేదు... ఇలాంటి సమయంలో బుధవారం జరిగిన పోరు ఫుల్‌ మీల్స్‌ను అందించింది... దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్‌ కలిసి ఉత్కంఠతో నిండిన అద్భుత మ్యాచ్‌ను చూపించాయి... 

20 ఓవర్ల సమరంలో ఇరు జట్లూ 187 పరుగులతో సమఉజ్జీలుగా నిలవగా, సూపర్‌ ఓవర్‌ తప్పలేదు. అక్కడా ఎవరూ తగ్గకుండా సమం–సమం అనడంతో మరో సూపర్‌ ఓవర్‌ ముందుకు వచ్చింది. ఈసారి మాత్రం ఆధిపత్యం ప్రదర్శించిన సఫారీ టీమ్‌ ఎట్టకేలకు గట్టెక్కింది. ప్రధాన పోరుతో పాటు రెండు సూపర్‌ ఓవర్లతో సాగిన డ్రామా టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. 

దక్షిణాఫ్రికా ప్రదర్శనకంటే కీలక సమయాల్లో వరుస తప్పులు చేసిన అఫ్గానిస్తాన్‌ స్వయంకృతమే ఫలితాన్ని నిర్దేశించింది. అఫ్గాన్‌ బెస్ట్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ రెండు సూపర్‌ ఓవర్లలో ఒక్కటి కూడా బౌలింగ్‌  చేయకపోగా... రెండో సూపర్‌ ఓవర్లో ఫామ్‌లో ఉన్న గుర్బాజ్‌ను కాకుండా నబీకి స్ట్రయిక్‌ అవకాశం ఇవ్వడం కూడా జట్టును ఓడించాయి.    

అహ్మదాబాద్‌: టి20 ప్రపంచకప్‌లో డజను మ్యాచ్‌ల తర్వాత అద్భుతమైన వినోదాన్ని చూసే అవకాశం అభిమానులకు దక్కింది. బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో దక్షిణాఫ్రికా ‘డబుల్‌ సూపర్‌ ఓవర్‌’లో అఫ్గానిస్తాన్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రికెల్టన్‌ (28 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), డికాక్‌ (41 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. 

వీరిద్దరు రెండో వికెట్‌కు 61 బంతుల్లో 114 పరుగులు జోడించారు. అనంతరం అఫ్గానిస్తాన్‌ 20 ఓవర్లలో సరిగ్గా 187 పరుగులకే ఆలౌటైంది. రహ్మనుల్లా గుర్బాజ్‌ (42 బంతుల్లో 84; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఎన్‌గిడి (3/26) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. స్కోర్లు సమం కావడంతో నిర్వహించిన తొలి ‘సూపర్‌ ఓవర్‌’లో ఇరు జట్లు సరిగ్గా 17 పరుగులే చేశాయి. దాంతో రెండో ‘సూపర్‌ ఓవర్‌’ను ఆడించాల్సి వచ్చింది. 

ఇందులో దక్షిణాఫ్రికా 23 పరుగులు చేయగా, 19 పరుగులు చేసిన అఫ్గానిస్తాన్‌ 4 పరుగులతో ఓడింది. దక్షిణాఫ్రికా వరుసగా రెండో విజయం అందుకొని గ్రూప్‌ ‘డి’ నుంచి ‘సూపర్‌ ఎయిట్స్‌’కు చేరువ కాగా... వరుసగా రెండో ఓటమితో అఫ్గానిస్తాన్‌ ముందంజ వేసే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి.  

చివరి ఓవర్‌ డ్రామా సాగిందిలా... 
ఆఖరి ఓవర్లో అఫ్గానిస్తాన్‌కు 13 పరుగులు అవసరం కాగా, ఒకటే వికెట్‌ ఉంది. తొలి బంతికి నూర్‌ను రబడ బౌల్డ్‌ చేసినా అది నోబాల్‌ అయింది. తర్వాతి బంతి వైడ్‌ కాగా, ఆ తర్వాత వేసిన బంతికి నూర్‌ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను యాన్సెన్‌ వదిలేశాడు. ఆ వెంటనే నూర్‌ సిక్స్‌ బాదడంతో తొలి రెండు బంతుల్లోనే 8 పరుగులు వచ్చినట్లయింది. ఇక చేయాల్సింది 4 బంతుల్లో 5 పరుగులే. తర్వాతి బంతికి షాట్‌ ఆడి నూర్‌ సగం దూరం వచ్చినా... ఫరూఖీ వెనక్కి పంపడంతో పరుగు రాలేదు.

ఓవర్‌ నాలుగో బంతి మళ్లీ నోబాల్‌ కావడంతో పాటు 2 పరుగులు తీయడంతో సమీకరణం మరింత సులువుగా మారింది. 2 బంతుల్లో 3 పరుగులు కావాలి, పైగా ఫ్రీ హిట్‌...బహుశా బ్యాటర్లకు ఇదే సూచన ఇచ్చేందుకు ‘వాటర్‌ బాయ్స్‌’ను పంపించగా, అంపైర్లు అనుమతించలేదు! నూర్‌ లాంగాఫ్‌ దిశగా కొట్టిన షాట్‌కు తొలి పరుగు సులువుగా రాగా, రెండో పరుగు తీసే ప్రయత్నంలో ఫారుఖీ నెమ్మదించడంతో రనౌటయ్యాడు. దాంతో స్కోర్లు సమమయ్యాయి. 

ఫీల్డర్‌ వైపు చూడకుండా వేగంగా పరుగెత్తి బ్యాట్‌తో డైవ్‌ చేసే ప్రయత్నం చేస్తే ఫారుఖీ పరుగు సునాయాసంగా పూర్తయ్యేది. అంతకుముందు మూడో బంతికి సింగిల్‌ నిరాకరించిన ఫారుఖీ అసలు సమయంలో సరిగా పరుగెత్తక తన జట్టుకు గెలుపును దూరం చేశాడు. దీని తర్వాత మరో రెండు బంతులు కూడా ఉన్నాయి కాబట్టి అఫ్గానిస్తాన్‌ ఈ రిస్క్‌ చేయకుండా ఉండాల్సింది.

మొదటి సూపర్‌ ఓవర్‌: ఎన్‌గిడి బౌలింగ్‌లో అజ్మతుల్లా 2 ఫోర్లు, సిక్స్‌ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. అనంతరం ఫారుఖీ బౌలింగ్‌లో 5 బంతుల్లో 11 పరుగులు చేసి ఒక వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా తప్పనిసరిగా సిక్స్‌ కొట్టాల్సిన స్థితిలో నిలిచింది. లో ఫుల్‌టాస్‌ను లాంగాఫ్‌ మీదుగా స్టబ్స్‌ సిక్స్‌ బాదడంతో దక్షిణాఫ్రికా కూడా 17 పరుగులే చేయగలిగింది. 

రెండో సూపర్‌ ఓవర్‌:  అజ్మతుల్లా బౌలింగ్‌లో స్టబ్స్‌ వరుసగా 6, 1 రాబట్టగా, మిల్లర్‌ వరుసగా 2, 6, 6, 2 బాదడంతో 23 పరుగులు లభించాయి. ఆ తర్వాత కేశవ్‌ మహరాజ్‌ ఓవర్లో అఫ్గానిస్తాన్‌ తొలి 2 బంతుల్లో పరుగులేమీ చేయకుండా వికెట్‌ కోల్పోయింది. అయితే గుర్బాజ్‌ చెలరేగి వరుసగా 6, 6, 6 కొట్టడంతో పాటు తర్వాతి బంతి వైడ్‌గా పడింది. ఈసారి కూడా సిక్స్‌ కొడితే అఫ్గాన్‌ గెలిచే అవకాశాలు ఉండగా, చివరి బంతికి గుర్బాజ్‌  క్యాచ్‌ ఇచ్చాడు.  

38 ఇప్పటి వరకు అంతర్జాతీయ టి20ల్లో ‘సూపర్‌ ఓవర్‌’ ద్వారా ఫలితాలు వచ్చిన మ్యాచ్‌లు.

2 అంతర్జాతీయ టి20ల్లో ‘డబుల్‌ సూపర్‌ ఓవర్‌’ ద్వారా ఫలితం తేలిన మ్యాచ్‌లు. ఈ రెండింటిలోనూ అఫ్గానిస్తాన్‌ ప్రత్యర్థిగా ఉండటం గమనార్హం. 2024లో అఫ్గానిస్తాన్‌పై భారత్‌ ‘డబుల్‌ సూపర్‌’లో గెలిచింది. 2025లో నేపాల్‌పై నెదర్లాండ్స్‌ ‘ట్రిపుల్‌ సూపర్‌ ఓవర్‌’లో నెగ్గింది.  

స్కోరు వివరాలు 
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (సి) నబీ (బి) ఫారుఖీ 5; డికాక్‌ (సి) జద్రాన్‌ (బి) రషీద్‌ 59; రికెల్టన్‌ (ఎల్బీ) (బి) రషీద్‌ 61; బ్రెవిస్‌ (సి) నబీ (బి) ఒమర్జాయ్‌ 23; మిల్లర్‌ (నాటౌట్‌) 20; స్టబ్స్‌ (సి) ముజీబ్‌ (బి) ఒమర్జాయ్‌ 1; యాన్సెన్‌ (సి) అటల్‌ (బి) ఒమర్జాయ్‌ 16; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–12, 2–126, 3–127, 4–155, 5–159, 6–187. బౌలింగ్‌: ఫరూఖీ 4–0–32–1, ముజీబ్‌ 3–0–30–0, ఒమర్జాయ్‌ 4–0–41–3, నబీ 2–0–20–0, రషీద్‌ 4–0–28–2, నూర్‌ 3–0–35–0. 

అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) లిండే (బి) మహరాజ్‌ 84; జద్రాన్‌ (బి) ఎన్‌గిడి 12; నైబ్‌ (సి అండ్‌ బి) ఎన్‌గిడి 0; అటల్‌ (సి) యాన్సెన్‌ (బి) రబడ 0; రసూలీ (రనౌట్‌) 15; ఒమర్జాన్‌ (సి) స్టబ్స్‌ (బి) ఎన్‌గిడి 22; నబీ (సి) మార్క్‌రమ్‌ (బి) లిండే 5; రషీద్‌ (సి) మిల్లర్‌ (బి) యాన్సెన్‌ 20; ముజీబ్‌ (రనౌట్‌) 0; నూర్‌ (నాటౌట్‌) 15; ఫారుఖీ (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 187. వికెట్ల పతనం: 1–51, 2–51, 3–52, 4–121, 5–121, 6–139, 7–164, 8–169, 9–175, 10–187. బౌలింగ్‌: ఎన్‌గిడి 4–0–26–3, యాన్సెన్‌ 4–0–42–1, రబడ 3.4–0–38–1, లిండే 3–0–39–1, మహరాజ్‌ 4–0–27–1, మార్క్‌రమ్‌ 1–0–14–0.   

Advertisement
 
Advertisement
Advertisement