టీ20 ప్రపంచకప్ 2026లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఘనంగా బోణీ కొట్టింది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఇవాళ (ఫిబ్రవరి 11) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్‌పై 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. 45 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జోష్ ఇంగ్లిస్, మ్యాట్ రెన్‌షా తలో 37 పరుగులు.. కూపర్ కన్నోలీ, జేవియర్ బార్ట్‌లెట్ చెరో అజేయమైన 11 పరుగులు.. తాత్కాలిక కెప్టెన్ ట్రవిస్ హెడ్ , గ్లెన్ మ్యాక్స్‌వెల్ 9 పరుగులు చేశారు.
ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 2, మాథ్యూ హంఫ్రేస్, జార్జ్ డాక్రెల్, హ్యారీ టెక్టార్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 183 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ ఆదిలోనే చేతులెత్తేసింది. ఆడమ్ జంపా (4-0-23-4), నాథన్ ఎల్లిస్ (3.5-1-12-4) ధాటికి 16.5 ఓవర్లలో 115 పరుగులకే చాపచుట్టేసింది. మిగతా ఆసీస్ బౌలర్లలో కుహ్నేమన్ (4-0-29-1) కూడా రాణించాడు.
ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జార్జ్ డాక్రెల్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డాక్రెల్ ఈ స్కోర్ చేయకపోయుంటే ఐర్లాండ్ 100 పరుగుల మార్కును కూడా దాటలేకపోయేది. మిగతా ఐరిష్ బ్యాటర్లలో లోర్కన్ టక్కర్ (24), రాస్ అదైర్ (12), గెరాత్ డెలానీ (11) రెండంకెల స్కోర్లు చేశారు.


