టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు వంత పాడిన పాకిస్తాన్, తదనంతరం పరిణామాల్లో ఆ దేశాన్ని ఏకాకిని చేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ప్రారంభం నుంచి బంగ్లాదేశ్ కోసం ఏదో చేస్తున్నామన్నట్లు బిల్డప్ ఇచ్చిన పాక్, ఐసీసీతో చర్చల తర్వాత స్వలాభం చూసుకొని భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది.
ఈ మొత్తం ఎపిసోడ్‌ను క్షుణ్ణంగా గమనిస్తే పాక్ బంగ్లాదేశ్‌ను ఫూల్ చేసిందన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. పాక్ ఐసీసీ అంక్షలకు భయపడి భారత్‌తో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించగా.. బంగ్లాదేశ్ మాత్రం ప్రపంచకప్ నుంచి వైదొలిగి, ఏకాకిలా మిగిలిపోయింది.
ఈ ఎడిసోడ్ నడుస్తుండగానే బంగ్లాదేశ్ ఆటగాళ్లు పాక్‌లో జరిగే పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు. మొత్తం 50 మంది బంగ్లాదేశీ ఆటగాళ్లు పీఎస్‌ఎల్ 2026 వేలంలో పాల్గొన్నారు. మూడు బేస్ ప్రైజ్‌ల విభాగాల్లో బంగ్లా ఆటగాళ్లు వేలం బరిలో నిలిచారు.
బంగ్లాదేశ్ విషయంలో లేని ప్రేమను ఒలకబోసిన పాక్.. పీఎస్‌ఎల్ వేలంలో ఆ దేశ ఆటగాళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. మొత్తం 50 మంది వేలం బరిలో నిలిస్తే.. కేవలం ఒకరిద్దరిని మాత్రం పీఎస్‌ఎల్ ఫ్రాంచైజీలు అక్కున చేర్చుకున్నాయి. అమ్ముడుపోయిన వారికి కూడా పెద్ద మొత్తంలో ధర దక్కలేదు.
ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ వేలంలో బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్ లిటన్ దాస్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఆ దేశ దిగ్గజ ఆటగాడు షకీబ్ అల్ హసన్‌ను కూడా పట్టించుకునే నాథుడే లేడు. వీరితో పాటు చాలామంది బంగ్లా స్టార్ ఆటగాళ్లవైపు పీఎస్‌ఎల్ ఫ్రాంచైజీలు కన్నెత్తి కూడా చూడలేదు.
బంగ్లాతో స్నేహం ఒలకబోసి, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్‌ను కనీసం బేస్ ధరకు (48 లక్షల టాకాలు) కూడా కొనుగోలు చేయకపోవడం ఎంత ఘోర అవమానమో బంగ్లా ఆటగాళ్లకు అర్దం కావాలి. ఇకనైనా బంగ్లాదేశ్ పాక్ కపట నాటకాలకు పావుగా మారకుండా ఉండేందుకు జాగ్రత్త పడాలి.
లిట్టన్ దాస్‌కు గతంలో పీఎస్‌ఎల్‌లో ఆడిన అనుభవం ఉన్నా, ఫ్రాంచైజీలు చిన్నచూపు చూశాయి. ఈ వేలంలో కొద్దోగొప్పో లబ్ది పొందింది రిషద్ హొసేన్. ఈ బంగ్లా ఆల్‌రౌండర్‌ను రావల్పిండి బేస్ ఫ్రాంచైజీ 3 కోట్ల పాక్ కరెన్సీకి సొంతం చేసుకుంది.
అలాగే ఐపీఎల్ నుంచి గెంటివేయబడ్డ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీ వేలానికి ముందే డైరెక్ట్ సైనింగ్ ద్వారా స్వల్ప మొత్తానికి దక్కించుకుంది. మొత్తంగా చూస్తే పీఎస్ఎల్ వేలంలో బంగ్లా ఆటగాళ్లను పట్టించుకునే నాథుడే లేడన్న విషయం స్పష్టమైంది.


