సందర్భం
బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలలో జెన్–జీ ఉద్యమాలు జరిగి, అక్కడి ప్రభు త్వాలు కూలిపోవడం తెలిసినదే. ఈ ఆందోళనలకు ప్రేరణ ఆ యా సమాజా లలో పెరిగిపోతోన్న నిరుద్యోగం, ధరలు, అవినీతి వంటి అంశాలే. ఈ రెండు దేశాలు త్వరలో ఎన్నికలకు వెళ్ళబోతు న్నాయి. సరికొత్త రాజకీయ ‘అవతారం’ ఎత్తిన పాత రాజకీయ పక్షాలు కానీ... ప్రస్తుతం రాజకీయ రూపం సంతరించుకున్న జెన్–జీ ఉద్యమ కారులు కానీ సమస్యల పరిష్కారం కోసం ముందుకు తెస్తోన్న క్రొంగొత్త, సృజనాత్మక అజెండా మాత్రం ఏమీ లేదు! ఈ పోరాటాల వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ, ఇవి ఆవేశకావేశాల ప్రాతిపదికన సాగాయే తప్ప, స్పష్టమైన కార్యాచరణతో జరిగినవి కావు. నేపాల్, బంగ్లాదేశ్‌లలోనే కాదు, నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు ఎదుర్కొంటున్న నిరు ద్యోగ సంక్షోభానికి జవాబు వెతకడం కష్టంగా మారుతోంది.
ప్రస్తుత నిరుద్యోగ విలయానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది– 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం ఏర్పడి ఉపాధి కల్పన కుంటుపడింది. రెండోది– దశాబ్దాలుగా సాగుతున్న సాంకేతిక పురోగతి నేడు పరాకాష్టకు చేరింది. మానవ శారీరక శ్రమను రోబోలు ఆక్రమిస్తుంటే, మేధా శ్రమ స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కైవసం చేసు కుంటోంది. ఫలితంగా బ్లూ కాలర్, వైట్ కాలర్ రంగాల్లో మనిషికి స్థానం లేకుండా పోతోంది. ఉదాహరణకు, అమెజాన్ సంస్థలో 30 వేల మంది వరకూ ఉద్యోగులను తొలగించనున్నారు. దీనికి కారణం ఆ కంపెనీ ఒక ఉద్యోగస్థుడికి సాలీనా సగటున 36 వేల డాలర్ల వేతనం చెల్లించవలసి ఉంటే... అదే స్థానంలో మర మనిషిని (రోబో) పెట్టుకుంటే అయ్యే ఖర్చు 3,600 డాలర్లు మాత్రమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తన సంస్థకు సంబంధించిన కొత్త కోడ్‌ను గూగుల్ 2025 నాటికి 30% మేరకు రాయగలుగు తోంది. అంటే, ఆ మేరకు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాల కోతలు అనివార్యమన్నమాట.
వ్యవస్థ ఇక కొత్త ఉద్యోగాలను ఇవ్వలేదని గ్రహించిన బిల్‌గేట్స్ వంటి వారు ‘సార్వజనీన కనీస ఆదాయం’ (యూబీఐ) వంటి ప్రతిపాదనలు తెస్తున్నారు. అంటే, పెరిగిపోతున్న నిరుద్యోగుల తిరుగుబాట్లను అడ్డుకోవడానికి ప్రజల ఖాతాల్లో కొంత నిరుద్యోగ భృతి జమ చేసి వ్యవస్థను కాపాడుకోవాలనేది వారి ఎత్తుగడ. ఈ స్థితిని 180 ఏళ్ల క్రితమే కారల్ మార్క్స్ తన ‘కమ్యూనిస్ట్ ప్రణా ళిక’లో అంచనా వేశారు. ‘...ఒక వర్గాన్ని పీడించాలంటే ఆ పీడిత వర్గం తన బానిస బతుకును కొనసాగించడానికైనా హామీ ఇవ్వాలి... కానీ, ఈనాటి బూర్జువా వర్గ ఆధిపత్యం కింద, ఈనాటి పారిశ్రామిక క్రమంలో ఆధునిక శ్రామికుడు ఎదగడం మాట అటుంచి, నానాటికీ అడుగుకి పోతున్నాడు... కార్మికుడు బుక్కాపకీరుగా మారుతున్నాడు. తన బానిసకు బానిస బతుకునైనా నమ్మకంగా చూపించగల సత్తా దానికి (వ్యవస్థకు) లేదు. తన బానిస శ్రమ మీద బతకాల్సిన వర్గం అది. కానీ, ఆ పరిస్థితి మారి ఆ బానిసే దాని బిచ్చం (పైన పేర్కొన్న సార్వజనీన కనీస ఆదాయం) మీద ఆధారపడాల్సి వస్తే అటువంట ప్పుడు బూర్జువా వర్గం కింద సమాజం ఇక ఎంతమాత్రమూ బతక లేదు. కాబట్టి (ఆ) వర్గ పతనం తప్పదు. కార్మిక వర్గ విజయమూ తప్పదు.’ అదీ విషయం. ప్రస్తుతం పెట్టుబడిదారీ వ్యవస్థ దాని పరిణామక్రమంలో మార్క్స్ చెప్పిన పై దశను చేరుకుంది.
ప్రస్తుత వ్యవస్థలో నిర్జీవమైన పెట్టుబడి (డబ్బు), సజీవమైన మనుషులపై పెత్తనం చేస్తోంది. నిన్నటి ఉత్పత్తి సాధనాలే నేడు విధ్వంసక శక్తులుగా మారుతున్నాయి. ఈ వ్యవస్థాగత లోపాలను గుర్తించకుండా చేసే ఏ ఉద్యమమైనా నిష్ప్రయోజనమే! కమ్యూనిజా నికి కాలం చెల్లిందన్న ప్రచారపు బూజును తలల నుంచి దులుపుకొని ఆ సిద్ధాంతపు వెలుగులో సమకాలీన సమస్యలను చూడగలిగితేనే మరో ప్రపంచానికీ, మానవాళి మహోదయానికీ దారులను అన్వేషించగలం.
డి. పాపారావు
వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు


