రైతుల పాలిట పిడుగుపాటు | Sakshi Guest Column On Farmers | Sakshi
Sakshi News home page

రైతుల పాలిట పిడుగుపాటు

Feb 11 2026 12:02 AM | Updated on Feb 11 2026 12:02 AM

Sakshi Guest Column On Farmers

విశ్లేషణ

షేక్‌స్పియర్‌ నాటకంలోలాగా, ఎవరి మాటలు నమ్మాలో ఎవరివి నమ్మకూడదో తెలియని సంకటం. ‘అమెరికన్‌ రైతులకు మేలు చేసే విధంగా’ ఇండియాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నందుకు ట్రంప్‌కు అమెరికా వ్యవసాయ మంత్రి బ్రూక్‌ రోలిన్స్‌ కృతజ్ఞతలు తెలి పారు. సున్నిత అంశాలైన వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలకు తగు రక్షణ కల్పి స్తూనే అమెరికాతో ‘చారిత్రక’ ఒప్పందం కుదుర్చుకుంటున్నందుకు మోదీని మన వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రశంసించారు. ఒప్పందంలోని వివరాలు పూర్తిగా వెల్లడైన తర్వాతనే, అది రెండు పెద్ద ప్రజాస్వామిక దేశాలకు ఉభయ తారకమైనదా లేక బెదిరింపు ధోరణితో మెడలు వంచి ఒప్పిస్తున్నదా అన్నది తేలుతుంది. కానీ, ఇంతవరకు బహిర్గతమైన వివరాలే రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. 

ముంచెత్తితే ప్రమాదమే!
దేశంలో వ్యవసాయ రంగం ఇప్పటికే దయనీయ స్థితిలో ఉంది. ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కన్నా 30–40 శాతం తక్కువ ధరకు రైతులు తమ పంటలను అమ్ముకుంటున్నారు. ఈ స్థితిలో భారత మార్కెట్లోకి ద్వారాలు తెరిస్తే... హెచ్చు సబ్సిడీలు పొందు తున్న, చౌకైన అమెరికన్‌ వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడి మార్కెట్లను ముంచెత్తి, రైతుల జీవనోపాధిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. వ్యవసాయ వనరుల నిర్వహణ (2020) సర్వే ప్రకారం, అమెరికన్‌ రైతులు ఏటా భారీ సబ్సిడీలు పొందుతున్నారు. అక్కడి రైతుకు ఏటా సగటున 66,314 డాలర్ల సబ్సిడీ లభిస్తున్నట్లు అంచనా. 

ఆ సబ్సిడీలు మార్కెట్లోని హెచ్చుతగ్గుల నుంచి అక్కడి రైతులకు రక్షణ కల్పిస్తున్నాయి. రైతులకు వాటిల్లుతున్న నష్టాలను భర్తీ చేసేందుకు ‘ఫార్మర్స్‌ బ్రిడ్జ్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రామ్‌’ (ఎఫ్బీయే) కింద ఎకరాకు వస్తు చెల్లింపుల కింద మొత్తం 12 బిలియన్‌ డాలర్లను సమకూర్చాలని అమెరికన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ట్రంప్‌ ఆ పథ కాన్ని ‘ఒక పెద్ద అందమైన బిల్లు’గా అభివర్ణిస్తున్నారు. అయితే, అమెరికాలోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై సుంకా లను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. అమెరికన్‌ ఎగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. నాన్‌–ట్యారిఫ్‌ ప్రతిబంధకాలను తొలగిస్తున్నట్లు చెప్పారు. 

రైతుల నిరసన హెచ్చరికలు
రైతుల ప్రయోజనాలను జాగ్రత్తగా ‘సంరక్షించిన’ తర్వాతనే ఒప్పందం కుదిరిందని మన వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు. ప్రయోజనాలకు భంగం వాటిల్లదనే హామీలు వెలువడుతున్నా ఇది రైతుల్లో సందిగ్ధాన్ని సృష్టిస్తోంది. అమెరికా దిగుమతులపై సుంకాలను సున్నా చేస్తే, ఆహార పదార్థాలు దేశంలోకి కుప్పతెప్పలుగా వచ్చిపడతాయని 2020–21లో న్యూఢిల్లీ చుట్టుపక్కల రైతుల ఆందోళనకు నేతృత్వం వహించిన సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా హెచ్చరిస్తోంది. 2020–21 తరహాలోనే కొత్తగా నిరసనలకు దిగుతామని అది బెదిరిస్తోంది. 

భారతీయ రైతులు 2000–01 నుంచి 2024–25 మధ్య కాలంలో సమష్టిగా రూ. 111 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారని ‘ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో–ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ తన తాజా నివేదికలో అంచనా వేసింది. ‘‘అది రైతులకు అశని పాతమే కాదు, మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన అవుతుంది’’ అని హిమాచల్‌ ప్రదేశ్‌ ఆపిల్‌ పండ్ల తోటల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు హరీశ్‌ చౌహాన్‌ అంటున్నారు.

యూరోపియన్‌ యూనియన్, న్యూజిలాండ్‌లతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల ఆపిల్‌ పండ్లకు మార్కెట్‌ అసాధారణమైన రీతిలో అందుబాటులోకొచ్చింది. ఫలితంగా, పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ఆపిల్‌ తోటల పెంపకం పరిశ్రమ క్రమంగా తుడిచిపెట్టుకుపోతుందేమోనని భయ సందేహాలు వ్యక్తమవు తున్నాయి. సుంకాలు ఏమీ లేకుండా అమెరికా ఆపిల్‌ పండ్లు దిగు మతి అయితే, మన దేశంలో ఆపిల్‌ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని పోతుందని హరీశ్‌ హెచ్చరిస్తున్నారు. 

సుంకాలు లేకపోతే సమస్యే!
పడిపోయిన ధరలతో పత్తి, సోయా, ఉల్లిపాయల రైతులు ఇప్ప టికే బిక్కుబిక్కుమంటున్నారు. సుంకాలు ఏమీ లేకుండా అవి దిగు మతి అయి, ధరలు మరింతగా పతనమైతే, వారు ఆ పంటలను వదిలేసి చేతులెత్తేయడం మినహా చేయగలిగింది లేదు. ఏడాదికి 500 బిలియన్ల విలువైన అమెరికన్‌ ఎగుమతుల గురించి ట్రంప్‌ మాట్లాడుతున్నారు. అందులో ఇంధనం, టెక్నాలజీ, బొగ్గు, వ్యవసాయం వంటి రంగాలవి కూడా ఉన్నాయి. అయితే, అది ఏడాదికి దాదాపు 100 బిలియన్‌ డాలర్ల చొప్పున ఐదేళ్ళ కాలానికి లెక్క చెప్పినదై ఉంటుందని కొందరు విశ్లేషకులు భావిస్తు న్నారు. అమెరికన్‌ ఎగుమతులన్నీ వ్యవసాయం, పాడి పరిశ్రమ, వాటి అనుబంధ రంగాల ఉత్పత్తులతోనే నిండి ఉంటాయని భావించడం కూడా సబబు కాదు. 

పత్తి, పప్పుధాన్యాలు, ఉల్లిపాయల వంటి వస్తువుల విషయంలో ఒక కోటా మేరకు మాత్రమే మార్కెట్‌ అందుబాటులో ఉంటుందని వార్తలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, ఆహారాన్ని దిగుమతి చేసుకోవడం నిరుద్యోగాన్ని దిగుమతి చేసుకోవడం లాంటిదేనని అర్థం చేసుకోవాలి. 
గత ఏడాది సెప్టెంబర్‌–డిసెంబర్‌ మధ్య కాలంలో, పత్తి దిగుమతులపై 11 శాతం సుంకాన్ని తొలగించినపుడు చౌక ధరకు పత్తి బేళ్ళు అపారంగా వచ్చిపడ్డాయి. దేశంలో పత్తి ధరలు తగ్గాయి. అందుకు వస్త్ర పరిశ్రమవారు సంతోషించారు కానీ, రైతులు నష్ట పోయారు. మూడు నెలల్లో 30 లక్షల పత్తి బేళ్ళు దిగుమతి అయ్యాయి. పత్తి ధర క్వింటాల్‌కు రూ. 1,000–రూ.1,500 వరకు పడిపోయింది. 

అభివృద్ధి చెందుతున్న దేశాలపై బలవంతంగా రుద్దాలని ట్రంప్‌ చూస్తున్న నూతన వాణిజ్య వ్యవస్థ... ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు వ్యతిరేకమైనది. ట్రంప్‌ తన కొత్త వ్యవస్థకు ‘యూరో పియన్‌ యూనియన్‌ కూడా తలొగ్గేట్లు చేయాలని చూస్తున్నారు. వాణిజ్య సంస్థ 1995లో ఏర్పడినప్పటి నుంచి అమెరికా పప్పులు ఉడకడం లేదు. అది ఇపుడు ఎలాగైనా తన పంతం నెగ్గించు కోవాలని చూస్తోంది. ఒత్తిడికి లొంగిపోతున్న దేశాలతో, నూతన ప్రపంచ వ్యవస్థ ఆవిష్కృతమవుతోంది. ‘కండ గలవాడిదే రాజ్యం’ అన్న లోకోక్తి ఎంతకాలం కొనసాగుతుందో కాలమే చెప్పాలి. 

దేవీందర్‌ శర్మ
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు
ఈ–మెయిల్‌: hunger55@gmail.com 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement