వికృత ‘కాస్టింగ్‌ కౌచ్‌’ క్రీడకు మూలం! | Sakshi Guest Column On Film industry, casting couch | Sakshi
Sakshi News home page

వికృత ‘కాస్టింగ్‌ కౌచ్‌’ క్రీడకు మూలం!

Feb 8 2026 1:32 AM | Updated on Feb 8 2026 1:32 AM

Sakshi Guest Column On Film industry, casting couch

సినిమా రంగం అంటే సామాన్య ప్రజలకు అదొక రంగుల ప్రపంచం, కలల సౌధం. వెండితెరపై కనిపించే తారల వెలుగుల వెనుక ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో, ఎన్ని అవమానాలు దాగి ఉన్నాయో బయటి ప్రపంచానికి ఎప్పుడూ ఒక మిస్టరీగానే ఉంటుంది. ప్రతిభ ఉంటే చాలు, ఆకాశమే హద్దుగా ఎదగవచ్చనే ప్రచారం ఈ పరిశ్రమలో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఒక అగ్ర కథానాయకుడు మాట్లాడుతూ, సినిమా పరిశ్రమలో ‘కాస్టింగ్‌ కౌచ్‌’ అనే సంస్కృతే లేదనీ, నటీనటులు క్రమ శిక్షణతో ‘స్ట్రిక్ట్‌’గా ఉంటే ఎవరూ ఇబ్బంది పెట్టరనీ ఉద్బోధించారు. తన కుమార్తెను కూడా ఈ రంగంలోకి రావాలని ప్రోత్సహించానని ఆయన ఉదాహరించారు. 

అయితే, ఈ వ్యాఖ్యలపై క్షేత్రస్థాయిలో పనిచేసే మహిళా నటీమణుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమ య్యాయి. వెనుక అండదండలు ఉన్న వారసులకూ, ఏ అండా లేని సాధారణ యువతులకూ మధ్య ఉండే వ్యత్యాసాన్ని వారు ఎత్తిచూపారు. ప్రతిభ ఉన్నా ‘కమిట్‌మెంట్‌’, ‘అడ్జస్ట్‌మెంట్‌’ పేరుతో శారీరక లొంగుబాటు కోరడం ఇక్కడ నిత్యకృత్యమనీ, అది లేకుండా అవ కాశాలు రావడం దాదాపు అసాధ్యమనీ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘స్ట్రిక్ట్‌’గా ఉండటం అంటే వచ్చిన అవ కాశాన్ని వదులుకుని వెనక్కి వెళ్లిపోవడమే తప్ప మరో మార్గం లేదని వారు కుండబద్దలు కొట్టారు. 

అసలు ఈ ‘కాస్టింగ్‌ కౌచ్‌’ అనే మాటకూ అర్థం ఏమిటి? ‘కాస్టింగ్‌’ అంటే సినిమా నిర్మాణంలో నటీ నటులను, ఇతర సాంకేతిక నిపుణులను ఎంచుకునే ప్రక్రియ. ‘కౌచ్‌’ అంటే ఆ ఎంపిక సమయంలో చర్చలు జరిపే పెద్ద సోఫా. అది పడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అమెరికన్‌ భాషా శాస్త్రవేత్త బెంజమిన్‌ జిమ్మెర్‌మ్యాన్‌ వివరణ ప్రకారం, సినిమాలో అవకాశం ఇవ్వాలంటే పడక సుఖం కోరడం అనే వికృత ధోరణే ఈ పేరుతో పిలవబడుతోంది. పైకి మాత్రం చాలా మర్యా దగా ‘కమిట్‌మెంట్‌’ ఉండాలనీ, కొంత ‘అడ్జస్ట్‌’ కావా లనీ అంటుంటారు. ఇది 1910–1920 కాలంలో హాలీవుడ్, బ్రాడ్‌వే నాటక రంగాల్లోనే ప్రబలంగా ఉండే దని చరిత్ర చెబుతోంది. నిర్ణయాత్మక స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసే ఈ దోపిడీకి ‘కాస్టింగ్‌ కౌచ్‌’ అనే పేరు స్థిరపడిపోయింది.

సినిమా రంగంలోని ఈ అనారోగ్యకర ధోరణు లను, దానిపట్ల ఉన్న ఆకర్షణ గురించి 80 ఏళ్ళనాడే చలం, తన ‘సినిమా జ్వరం’ అనే వ్యాసంలో సినిమా జాడ్యం ముసలివాళ్ళ దగ్గిర్నించీ పసిపిల్లల దాకా గట్టిగా పట్టుకుందనీ, ఇది మరింతగా విస్తరించబోతోందనీ జోస్యం చెప్పారు. పూర్వం యోగుల కటాక్షం కోసం శిష్యులు వేచి చూసినట్లు, నేటి యువతీ యువకులు ఒక్క అవకాశం కోసం దర్శకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ సేవ చేస్తున్నారని ఆయన విమర్శించారు. 

సినిమా రంగం అత్యంత పవిత్రమైనదనీ, ఇక్కడ శీలానికి భయం లేదనీ చెప్పే దొంగ రాతలు ప్రజలను వంచించ డమేనని చలం ఘాటుగా స్పందించారు. ‘అడవిలో పాములు, పులులు ఉన్నాయని హెచ్చరించడం న్యాయం. జాగ్రత్తగా వెళ్ళు అనడం ధర్మం. కానీ పులిని బ్రహ్మస్వరూపంగా భావించమని, అడవిలో ఏమీ లేవని చెప్పి పంపడం ఘాతుకం’ అని ఆయన అభిప్రాయ పడ్డారు. వాస్తవాలను దాచిపెట్టి అబద్ధపు పేర్లతో లోకాన్ని మోసం చేయడం వల్లే సగం సమస్యలు పుడు తున్నాయని ఆయన ఆనాడే స్పష్టం చేశారు.

హిందీ నుంచి తెలుగు దాకా...
ఈ జబ్బు కేవలం మన ప్రాంతానికే పరిమితం కాదు. హాలీవుడ్‌ చరిత్రకారుడు కారీ రిక్కే రాసిన దాని ప్రకారం... ఆనాటి సుప్రసిద్ధ నటి మార్లిన్‌ మన్రో హాలీ వుడ్‌ను ఒక ‘కిక్కిరిసిన వేశ్యావాటిక’గా అభివర్ణించింది. హారీ కోహ్న్‌ వంటి బడా నిర్మాతలు నటీమణులను పడక గదిలో పరీక్షించకుండా అవకాశాలు ఇచ్చేవారు కాదని ప్రతీతి. హాలీవుడ్‌లో ఈ జాడ్యంపై 2018–2020 కాలంలో ప్రపంచవ్యాప్తంగా ‘మీ టూ’ ఉద్యమం పెల్లు బికింది. 

తెలుగు చిత్రసీమలో కూడా 2017లో ఫిలిం నగర్‌ సాక్షిగా ఒక నటి చేసిన అర్ధనగ్న నిరసన ప్రదర్శన పరిశ్రమలో పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనల తర్వాత వాస్తవాలను తేల్చడానికి, ఇటువంటి దుర్మా ర్గాలు జరగకుండా చూడటానికి కొన్ని కమిటీలు ఏర్పాటై నట్లు వార్తలు వచ్చినా, ఆశించిన మార్పు మాత్రం అగుపించలేదు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దకుండా కేవలం కమిటీలు వేయడం వల్ల ప్రయోజనం ఉండదని కాలం నిరూపించింది.

సినిమా అనే విచిత్రమైన సరుకును తయారుచేసే పెట్టుబడిదారీ విధానంలోనే ఈ దోపిడీ మూలాలు ఉన్నాయి. సినిమాల ప్రారంభం నుండి స్త్రీ దేహాన్ని కేవలం ఒక భోగ వస్తువుగా, సెక్స్‌ సింబల్‌గా చూపే ధోరణి పెరిగింది. మహిళలను కేవలం లాభాలు తెచ్చి పెట్టే సరుకులుగా (‘కమోడిఫికేషన్‌’) మార్చే ఈ వ్యవ స్థలో మార్పు రానంత కాలం ఎన్ని నిరసనలు తెలిపినా ఫలితం శూన్యం. చలం తన వ్యాసంలో చెప్పినట్లు, స్టూడియోలు, దర్శకులు ఉన్నతమైన ఆశయాలు, ప్రజల మీద ప్రేమ గలవారైతే తప్ప పరిస్థితులు మారవు. సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు, అదొక కళ అనీ, అందులో పనిచేసే వారు మనుషులనీ గుర్తించినప్పుడే ఈ ‘కాస్టింగ్‌ కౌచ్‌’ అనే వికృత క్రీడకు ముగింపు లభిస్తుంది.
– బి.ఆర్‌. బాపూజీ
హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్‌ 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement